
మనీశ్ పాండే... ఈ పేరు చెప్పగానే చాలామందికి సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కి అతను ఆడిన జిడ్డు ఇన్నింగ్సే గుర్తుకు వస్తాయి. యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్ వంటి మ్యాచ్ విన్నర్లను కూడా పక్కనబెట్టి, 2018 సీజన్‌లో రూ.11 కోట్లకు మనీశ్ పాండేని కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. నాలుగేళ్ల పాటు సీజన్‌కి రూ.11 కోట్లు ఖాతాలో వేసుకున్న మనీశ్ అన్న, సన్‌రైజర్స్‌ని గెలిపించిన మ్యాచులు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. చేజేతులా ఓడించిన మ్యాచుల సంఖ్య లెక్కపెడితే చాలా పెద్ద లిస్టే బయటపడుద్ది..
ఐపీఎల్‌లో సెంచరీ చేసిన మొట్టమొదటి భారత బ్యాటర్‌గా ఉన్న మనీశ్ పాండే, దేశవాళీ టోర్నీల్లో కర్ణాటక కెప్టెన్‌గా అనేక విజయాలు అందుకున్నాడు. తాజాగా మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏటీ20 2023 ట్రోఫీ ఫైనల్‌లో మెరుపు బ్యాటింగ్, స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో కెప్టెన్‌గా మరో టైటిల్ గెలిచాడు మనీశ్ పాండే..
మహారాజా ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హుబ్లీ టైగర్స్, 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగుల భారీ స్కోరు చేసింది. లువ్‌నీత్ సిసోడియా డకౌట్ కాగా మహ్మద్ తాహా 40 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. కృష్ణన్ శ్రీజిత్ 38, సంజయ్ అశ్విన్ 16, ప్రవీణ్ దుబీ 4, మన్వంత్ కుమార్ 14, లావిష్ కౌషల్ 4 పరుగులు చేశారు. కెప్టెన్ మనీశ్ పాండే 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు..
ఈ లక్ష్యఛేదనలో మైసూర్ వారియర్స్, 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి 8 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేయగలిగింది. కార్తీక్ 28, రవికుమార్ సమర్థ్ 63, కెప్టెన్ కరణ్ నాయర్ 37, లంకేశ్ 13, అజిత్ కార్తీక్ 18, జగదీశ సుచిత్ 13 పరుగులు, శివ్‌కుమార్ రక్షిత్ 10 పరుగులు చేశారు.
ఆఖరి ఓవర్‌లో మైసూర్ వారియర్స్ విజయానికి 11 పరుగులు కావాల్సి వచ్చాయి. తొలి బంతికి శివ్‌కుమార్ రక్షిత్ అవుట్ అయ్యాడు. రెండో బంతికి 1 పరుగు వచ్చింది. మూడో బంతికి జగదీశ సుచిత్ ఓ సూపర్ షాట్ ఆడాడు. అయితే బౌండరీ లైన్ దగ్గర గాల్లోకి ఎగురుతూ బంతిని ఆపిన మనీశ్ పాండే, కింద పడేముందు బాల్‌ని లోపలికి నెట్టేశాడు. ఈ సెన్సేషనల్ ఫీల్డింగ్ కారణంగా ఈజీగా సిక్స్ వెళ్లాల్సిన బాల్‌కి 1 పరుగు మాత్రమే వచ్చింది...
ఆ బాల్ సిక్సర్ వెళ్లి ఉంటే, మైసూర్ వారియర్స్ విజయానికి ఆఖరి 3 బంతుల్లో 4 పరుగులే కావాల్సి వచ్చేవి. కానీ చివరి 3 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసిన మైసూర్ వారియర్స్, చివరి ఓవర్‌లో 2 వికెట్లు కోల్పోయి 8 పరుగుల తేడాతో ఓడింది. సూపర్ ఫీల్డింగ్, సెన్సేషనల్ హాఫ్ సెంచరీతో అదరగొట్టిన హుబ్లీ టైగర్స్‌కి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది...