కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఖాతాలో మరో టైటిల్... లెజెండ్స్ లీగ్ ఛాంపియన్‌గా ఇండియా క్యాపిటల్స్...

By Chinthakindhi RamuFirst Published Oct 6, 2022, 5:15 PM IST
Highlights

లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 టోర్నీ సీజన్ 2 టైటిల్‌ గెలిచిన ఇండియా క్యాపిటల్స్.. ఫైనల్‌లో బిల్వారా కింగ్స్‌పై 104 పరుగుల తేడాతో ఘన విజయం... 

టీమిండియా మాజీ ఓపెనర్‌‌ గౌతమ్ గంభీర్‌లో కెప్టెన్సీ స్కిల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ని రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన గౌతమ్ గంభీర్, కెప్టెన్‌గా మరో టైటిల్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 టోర్నీ సీజన్ 2 టైటిల్‌ని గంభీర్ కెప్టెన్సీలోని ఇండియా క్యాపిటల్స్ సొంతం చేసుకుంది... 

బిల్వారా కింగ్స్‌తో జరిగిన లెజెండ్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో 104 పరుగుల భారీ తేడాతో ఘన విజయం అందుకుంది ఇండియా క్యాపిటల్స్. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా క్యాపిటల్స్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది...

కెప్టెన్ గౌతమ్ గంభీర్ 8, డ్వేన్ స్మిత్ 3, మసక్‌జ 1, దినేశ్ రామ్‌దిన్ డకౌట్ కావడంతో 21 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది ఇండియా క్యాపిటల్స్. అయితే రాస్ టేలర్, మిచెల్ జాన్సన్ కలిసి ఐదో వికెట్‌కి 126 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు...

35 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 పరుగులు చేశాడు ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్. 41 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 82 పరుగులు చేసిన రాస్ టేలర్, రాహుల్ శర్మ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు...

ప్లంకెట్ డకౌట్ కాగా నర్స్ 19 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 42 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. బిల్వారా కింగ్స్ బౌలర్ రాహుల్ శర్మ 4 వికెట్లు తీయగా మౌంటీ పనేసర్‌ 2 వికెట్లు పడగొట్టాడు. 

212 పరుగుల భారీ లక్ష్యఛేదనలో వరుస వికెట్లు కోల్పోయిన బిల్వారా కింగ్స్‌ ఉ దశలోనూ కోలుకోలేకపోయింది. మోర్నో వార్ విక్ 5, విలియం పోర్టర్‌ఫీల్డ్ 12 పరుగులు చేసి అవుట్ కాగా షేన్ వాట్సన్ 19 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 27 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు...

యూసఫ్ పఠాన్ 6 పరుగులు చేయగా జేసల్ కరియా 17 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేయగా కెప్టెన్ ఇర్ఫాన్ పఠాన్ 2 పరుగులకే పెవిలియన్ చేరాడు. రాజేశ్ బిష్ణోయ్ 1, టిమ్ బ్రేసన్ 7, ధమికా ప్రసాద్ 1, టినో బెస్ట్ 2 పరుగులు చేసి అవుట్ కావడంతో 18.2 ఓవర్లలో 107 పరుగులకి ఆలౌట్ అయ్యింది బిల్వారా కింగ్స్ ...

ఇండియా క్యాపిటల్స్ బౌలర్లలో పవన్ సుయల్, ప్రవీణ్ తాంబే, పంకజ్ సింగ్ రెండేసి వికెట్లు తీయగా మిచెల్ జాన్సన్, లియామ్ ప్లంకెట్, రజత్ భాటియా తలా ఓ వికెట్ తీశారు. యూసఫ్ పఠాన్ ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలవగా మిచెల్ జాన్సన్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు.. 

click me!