లతా మంగేష్కర్‌కి నివాళి ఘటించిన సచిన్ టెండూల్కర్... తన అభిమానికి కన్నీటి వీడ్కోలు...

Published : Feb 06, 2022, 05:50 PM ISTUpdated : Feb 06, 2022, 05:58 PM IST
లతా మంగేష్కర్‌కి నివాళి ఘటించిన సచిన్ టెండూల్కర్... తన అభిమానికి కన్నీటి వీడ్కోలు...

సారాంశం

ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో లతా మంగేష్కర్‌ పార్థివ దేహాన్ని దర్శించుకుని, నివాళి ఘటించిన సచిన్ టెండూల్కర్... 

గాన కోకిల, ‘భారత రత్న’ లతా మంగేష్కర్, తన 92 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. తన గానంతో ఎన్నో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న లతా మంగేష్కర్, దాదా సాహేబ్ పాల్కే అవార్డుతో పాటు పద్మ విభూషణ్, పద్మభూషణ్ వంటి పురస్కారాలెన్నో అందుకున్నారు...

భారత సంగీత రంగానికి ఎన్నో సేవలు అందించిన లతా మంగేష్కర్, హిందీతో పాటు బెంగాళీ, తమిళ్, తెలుగు, కన్నడ, ఒడిస్పా, అస్సామీ, గుజరాతీ, పంజాబీ, మరాఠీ, తులు వంటి భారతీయ భాషలన్నింటిలోనూ పాటలు పాడారు. నేపాల్, ఇంగ్లీష్ భాషల్లోనూ తన స్వరాన్ని వినిపించిన లతా మంగేష్కర్‌కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు...

భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో లతా మంగేష్కర్‌ పార్థివ దేహాన్ని దర్శించుకుని, నివాళి ఘటించాడు. ‘లతా దీదీ జీవితంలో నాకు కొంత భాగం దక్కినందుకు గర్వపడుతున్నా. ఆమె ఎల్లప్పుడూ నాపై అమితమైన ప్రేమ, ఆశీర్వాదాలను చూపించేవారు. ఆమె మరణం, నా జీవితంలో ఓ తీరని లోటుని మిగిల్చింది... ఆమె తన సంగీతంతో ఎల్లప్పుడూ మన హృదయాల్లో బతికే ఉంటుంది...’ అంటూ ట్వీట్ చేశాడు సచిన్ టెండూల్కర్... 

 

సప్త స్వరాల మధ్య జీవితాన్ని గడిపిన లతా మంగేష్కర్, కాలక్షేపం కోసం క్రికెట్ మ్యాచులను ఇష్టంగా చూసేవారు. ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ అంటే ఆమెకి ప్రత్యేకమైన అభిమానం. సచిన్ టెండూల్కర్‌తో లతా మంగేష్కర్‌కి ఆత్మీయ అనుబంధం కూడా ఉంది...

తరుచుగా లతా మంగేష్కర్‌ని కలిసి యోగక్షేమాలు తెలుసుకునేవాడు సచిన్ టెండూల్కర్. ఆమెను ప్రేమగా ‘ఆయీ’ (మరాఠీ భాషలో అమ్మ అని అర్థం) అని పిలిచేవాడు సచిన్. టెండూల్కర్ ఫామ్‌ కోల్పోయి, పరుగులు చేయలేక ఇబ్బంది పడిన సమయంలో ఆయనలో మళ్లీ రెట్టింపు ఉత్సాహం నింపింది లతా మంగేష్కర్...

24 ఏళ్ల పాటు క్రికెట్ ప్రపంచమే జీవితంగా గడిపిన సచిన్ టెండూల్కర్, లతా మంగేష్కర్ పాటలకి వీరాభిమాని. సచిన్ టెండూల్కర్ సతీమణి అంజలీ కూడా లతా మంగేష్కర్‌కి వీరాభిమాని కావడంతో ఈ దంపతులు, వీలైనప్పుడల్లా ఆమెను కలుస్తుండేవారు...

సచిన్ టెండూల్కర్ దగ్గర్నుంచి భారత మాజీ కెప్టెన్, క్రికెటర్ ఎమ్మెస్ ధోనీ ఫోన్ నెంబర్ తీసుకుని, మాహీని సర్‌ప్రైజ్ చేశారట లతా మంగేష్కర్. 2007 టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన తర్వాత విన్నింగ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని స్వయంగా ఫోన్ ద్వారా అభినందించిన లతా మంగేష్కర్, భారత జట్టు స్వదేశానికి చేరుకున్న తర్వాత విజయ యాత్రలో పాల్గొని వారిని సాదరంగా ఆహ్వానించింది కూడా...

1983లో బీసీసీఐ, ఆటగాళ్లకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న సమయంలో న్యూఢిల్లీలోని నెహ్రా స్టేడియంలో ఓ సంగీత కార్యక్రమం నిర్వహించి నిధులు సేకరించారు లతా మంగేష్కర్. అలా వచ్చిన డబ్బులతో అప్పటి టీమిండియా మేనేజర్‌ మన్‌ సింగ్‌తో పాటు 14 మంది క్రికెటర్లకు రూ.21 లక్షలను అందించారు. ఈ కారణంగానే పరిస్థితులు సద్ధుకున్న తర్వాత లతా మంగేష్కర్ కుటుంబానికి  ఇండియాలో జరిగే ప్రతీ క్రికెట్ మ్యాచ్‌కి ముందు రెండు టికెట్లను పంపుతూ వచ్చింది బీసీసీఐ. 

 

PREV
click me!

Recommended Stories

IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !
IPL 2026 Auction: ఐపీఎల్ మినీ వేలం సిద్ధం.. 77 స్థానాలు.. 350 మంది ఆటగాళ్లు! ఆర్టీఎమ్ కార్డ్ ఉంటుందా?