
టీమిండియా నయా సారథి రోహిత్ శర్మ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందా? హిట్ మ్యాన్ రోహిత్‌ను ఫాలో అవుతున్నవారందరికీ ఇదే అనుమానం కలుగుతోంది... కారణం మార్చి 1 (శివరాత్రి పర్వదినాన)న తన ట్విట్టర్ అకౌంట్‌లో అర్థం పర్థం లేని ట్వీట్లు చేశాడు రోహిత్ శర్మ...
రోహిత్ శర్మకు ట్విట్టర్‌లో 20.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టా అకౌంట్‌లో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసే రోహిత్ శర్మ, ట్విట్టర్‌లో మాత్రం క్రికెట్ మ్యాచులకు సంబంధించిన ఫోటోలను, పోస్టులను మాత్రమే చేసేవాడు...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ నుంచి టీ20 పగ్గాలు తీసుకున్న రోహిత్ శర్మ, రెండు నెలల గ్యాప్‌లోనే వన్డే, టెస్టు సారథ్య బాధ్యతలు కూడా చేపట్టబోతున్నాడు. కెప్టెన్‌గా వరుసగా మూడు టీ20 సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ శర్మ, విండీస్‌పై జరిగిన వన్డే సిరీస్‌ను కూడా వైట్ వాష్ చేశాడు...
వరుసగా 12 విజయాలు అందుకుని, ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన రోహిత్ శర్మ, మొహాలీ వేదికగా మార్చి 4 నుంచి ప్రారంభమయ్యే ఇండియా, శ్రీలంక టెస్టు ద్వారా సుదీర్ఘ ఫార్మాట్ కెప్టెన్‌గా కెరీర్ మొదలెట్టబోతున్నాడు...
2019 వరకూ టెస్టు టీమ్‌లో ప్లేస్ కూడా దక్కించుకోలేకపోయిన రోహిత్ శర్మ, 2022 నాటికి టెస్టుల్లో కెప్టెన్‌గా నియమించబడడం విశేషం. తాజాగా సోషల్ మీడియాలో రోహిత్ శర్మ చేసిన ట్వీట్లను గమనిస్తే, అతని అకౌంట్ ఎవ్వరైనా హ్యాక్ చేశారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి...
‘నాకు కాయిన్ టాస్‌లు అంటే ఇష్టం. ముఖ్యం ఎప్పుడైతే అవి నా కడుపులోకి చేరతాయో...’ అంటూ ట్వీట్ చేశాడు రోహిత్ శర్మ. రోహిత్ శర్మ మంచి భోజన ప్రియుడని, విరాట్ కోహ్లీతో పోలిస్తే పెద్దగా ఫిట్‌నెస్ మెయింటైన్ చేయడని విమర్శలు ఉన్నాయి...
అందుకే రోహిత్ శర్మను ‘వడాపావ్’ అంటూ ముద్దు పేరుతో పిలుస్తూ ట్రోల్ చేస్తారు కూడా. ఇప్పుడు రోహిత్ అకౌంట్ వేసిన ట్వీట్ చూస్తుంటే, తాను తిండి బోతునని తనను తాను ట్రోల్ చేసుకోవడానికే పెట్టినట్టుగా భావిస్తున్నారు అభిమానులు...
ఆ తర్వాత కొద్దిసేపటికి... ‘బజ్‌జ్‌జ్... మీకు తెలుసా... తెగ సందడి చేసే తేనేటీగలు గొప్ప బాక్సింగ్ బ్యాగులను తయారు చేస్తాయి...’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఎందుకు వేశాడు? ఎవరిని ఉద్దేశించి వేశాడు? రోహిత్ అభిమానులకు కూడా అర్థం కావడం లేదు...
తానను విమర్శించే వారిని చూసి, తాను గొప్ప ప్లేయర్‌గా మారతాననే ఉద్దేశంతో వేశాడా? లేక మరేదైనా ఉద్దేశం ఉందా? నిజంగానే రోహిత్ అకౌంట్ హ్యాక్ అయ్యిందా? అనేది తేలాల్సి ఉంది...
కొన్ని రోజుల క్రితం ముంబై ఇండియన్స్ మాజీ ప్లేయర్, టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా ట్విట్టర్ అకౌంట్ ఇలాగే హ్యాక్ అయ్యింది. బిట్ కాయిన్‌కి తన అకౌంట్‌ను అమ్మేస్తున్నానని, ఫలానా అమ్మాయి చాలా హాట్‌గా ఉంటుందని కొన్ని ట్వీట్లు వేశాడు సదరు హ్యాకర్. కొన్ని గంటల తర్వాత అకౌంట్ రికవరీ చేసుకున్న కృనాల్ పాండ్యా, తన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారంటూ అభిమానులకు క్షమాపణలు చెప్పాడు...