
ఐర్లాండ్ ఆల్‌రౌండర్ కెవిన్ ఓ'బ్రియన్.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 2006 జూన్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన కెవిన్ ఓ'బ్రియన్... ఐర్లాండ్ తరుపున 3 టెస్టులు, 153 వన్డేలు, 110 టీ20 మ్యాచులు ఆడి మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 5850 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 172 వికెట్లు పడగొట్టాడు...
2011 వన్డే వరల్డ్ కప్ గ్రూప్ బీలో పటిష్ట ఇంగ్లాండ్ టీమ్‌ని ఓడించి, ఊహించిన షాక్ ఇచ్చింది ఐర్లాండ్. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 327 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆండ్రూ స్ట్రాస్ 34, కెవిన్ పీటర్సన్ 59, జొనాథన్ ట్రాట్ 92, ఇయాన్ బెల్ 81 పరుగులు చేసి రాణించారు...
పసికూన ఐర్లాండ్ 328 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించగలదని ఎవ్వరూ ఊహించలేదు. ఇంగ్లాండ్ ఈజీగా భారీ విజయం అందుకుంటుందని అంచనా వేశారు. అనుకున్నట్టే ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది ఐర్లాండ్. వరుస వికెట్లు కోల్పోయి 111 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్‌ని కెవిన్ ఓ'బ్రియన్... చారిత్రాత్మక ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు....
63 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సర్లతో 113 పరుగులు చేసిన కెవిన్ ఓ'బ్రియన్... రనౌట్ రూపంలో అవుట్ అయ్యాడు. అలెక్స్ కుసక్, జాన్ మూవీ మిగిలిన లాంఛనాన్ని ముగించడంతో 49.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 329 పరుగులు చేసిన ఐర్లాండ్... చారిత్రక విజయాన్ని నమోదు చేసింది...
కెవిన్ ఓ'బ్రియన్ రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా 2011 వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌పై ఆడిన ఇన్నింగ్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఐసీసీ. అంతకుముందు 2007 వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌ని చిత్తు చేసిన ఐర్లాండ్ జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు కెవిన్ ఓ'బ్రియన్. పాకిస్తాన్‌తో 2018లో తొలి టెస్టు ఆడిన కెవిన్ ఓ'బ్రియన్, తన ఆరంగ్రేటం టెస్టులోనే సెంచరీ చేసి... మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఏకైక ఐర్లాండ్ క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...
టీ20 వరల్డ్ కప్ 2022 తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని అనుకున్నానని, అయితే తనకు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు సుదీర్ఘ లేఖ ద్వారా ప్రకటించాడు కెవిన్ ఓ'బ్రియన్...