IPL2022 MI vs KKR: హాఫ్ సెంచరీతో సూర్య ఎంట్రీ... కేకేఆర్ ముందు ఊరించే టార్గెట్...

Published : Apr 06, 2022, 09:20 PM IST
IPL2022 MI vs KKR: హాఫ్ సెంచరీతో సూర్య ఎంట్రీ... కేకేఆర్ ముందు ఊరించే టార్గెట్...

సారాంశం

హాఫ్ సెంచరీతో ఐపీఎల్ 2022 సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్... మరోసారి మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ... 

ఐపీఎల్ 2022 సీజన్‌లో తొలి విజయం కోసం ఎదురుచూస్తున్న ముంబై ఇండియన్స్ జట్టు, సూర్యకుమార్ యాదవ్‌పై భారీ ఆశలే పెట్టుకుంది. గాయం కారణంగా మొదటి రెండు మ్యాచులకు అందుబాటులో లేని సూర్యకుమార్ యాదవ్, కేకేఆర్‌తో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ఘనమైన రీఎంట్రీ ఇచ్చాడు...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ టాస్ గెలిచి, ముంబై ఇండియన్స్‌కి బ్యాటింగ్ అప్పగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించడంతో ఉమేశ్ యాదవ్ వేసిన మొదటి ఓవర్‌లో 1 పరుగు మాత్రమే వచ్చింది...

12 బంతులాడిన రోహిత్ శర్మ, ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి సామ్ బిల్లింగ్స్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు సింగిల్ డిజిట్‌కే అవుటైన ప్లేయర్‌గా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు రోహిత్ శర్మ.

రోహిత్‌కి ఇది 61వ సింగిల్ డిజిట్ స్కోరు కాగా దినేశ్ కార్తీక్ 60 సార్లు అంకె స్కోరుకే అవుట్ అయ్యాడు. టిమ్ డేవిడ్ స్థానంలో తుదిజట్టులోకి వచ్చిన యంగ్ బ్యాటర్ డేవాల్డ్ బ్రేవిస్ 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు...

వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన బ్రేవిస్, స్టంపౌట్ అయ్యాడు. 21 బంతుల్లో ఓ ఫోర్‌తో 14 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 55 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది ముంబై ఇండియన్స్...

11 ఓవర్లు ముగిసే సమయానికి 55 పరుగులు మాత్రమే చేసిన ముంబై, 15 ఓవర్లు ముగిసే వరకు 85 పరుగులు చేయగలిగింది. ప్యాట్ కమ్మిన్స్ వేసిన 16వ ఓవర్‌లో ఓ సిక్సర్, ఫోర్ బాది 13 పరుగులు రాబట్టిన తిలక్ వర్మ, స్కోరు వేగం పెంచాడు.

వరుణ్ చక్రవర్తి వేసిన 17వ ఓవర్‌లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కలిసి 17 పరుగులు రాబట్టగా సునీల్ నరైన్ వేసిన 18వ ఓవర్‌లో 14 పరుగులు వచ్చాయి. 19వ ఓవర్‌లో బౌలింగ్‌కి రస్సెల్ 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు...

34 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న సూర్యకుమార్ యాదవ్, 36 బంతుల్లో 5 ఫోర్లు, 2  సిక్సర్లతో 52 పరుగులు చేసి ఆఖరి ఓవర్‌లో మొదటి బంతికి అవుట్ అయ్యాడు. 2017 నుంచి సూర్యకుమార్ యాదవ్‌కి ఇది 13వ హాఫ్ సెంచరీ. గత 5 సీజన్లలో ముంబై ఇండియన్స్ తరుపున అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు సూర్యకుమార్ యాదవ్..

ఆఖరి ఓవర్‌లో 3 సిక్సర్లతో 5 బంతుల్లో 22 పరుగులు చేసిన కిరన్ పోలార్డ్, ముంబై ఇండియన్స్ స్కోరును 160+ దాటించాడు. అజింకా రహానే క్యాచ్ డ్రాప్ కారణంగా అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న తిలక్ వర్మ 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...

PREV
click me!

Recommended Stories

Fastest ODI Double Century : వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. బద్దలైన మాక్స్‌వెల్, గేల్ రికార్డులు
IND vs SA : టీ20 క్రికెట్ అంటే అంతే బాసూ.. సూర్యకుమార్ యాదవ్ భయం అదే !