
ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేశాడు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, కేన్ విలియంసన్ ఫెయిల్ అయినా రాహుల్ త్రిపాఠి, అయిడిన్ మార్క్‌రమ్ హాఫ్ సెంచరీలతో రాణించి ఆరెంజ్ ఆర్మీకి వరుసగా మూడో విజయాన్ని అందించారు.. కేకేఆర్
176 పరుగుల లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్‌కి శుభారంభం దక్కలేదు. 10 బంతులాడి కేవలం 3 పరుగులు చేసిన ఓపెనర్ అభిషేక్ శర్మ, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 16 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసిన కెప్టెన్ కేన్ విలియంసన్, ఆండ్రే రస్సెల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు...
39 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. వస్తూనే కేకేఆర్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు రాహుల్ త్రిపాఠి. కేకేఆర్ జట్టు నుంచి బయటికి వచ్చిన రాహుల్ త్రిపాఠి, 21 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుున్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున రాహుల్ త్రిపాఠికి ఇదే మొట్టమొదటి హాఫ్ సెంచరీ. సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 54 బంతుల్లో 71 పరుగులు కావాల్సిన దశలో కమ్మిన్స్, నరైన్ కేవలం నాలుగేసి పరుగులు మాత్రమే ఇచ్చి సన్‌రైజర్స్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు.
అయితే ఉమేశ్ యాదవ్ వేసిన 14వ ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన అయిడిన్ మార్క్‌రమ్ మళ్లీ జోరు పెంచాడు. రస్సెల్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన రాహుల్ త్రిపాఠి, ఆ తర్వాతి బంతికి అవుట్ అయ్యాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 71 పరుగులు చేసి అవుట్ అయ్యాడు త్రిపాఠి...
ఐపీఎల్‌లో 1500+ పరుగులు చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రాహుల్ త్రిపాఠి. త్రిపాఠి అవుటైన తర్వాత కూడా జోరు కొనసాగించిన అయిడిన్ మార్క్‌రమ్, 30 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. సునీల్ నరైన్ వేసిన 17వ ఓవర్‌లో 5 పరుగులు మాత్రమే వచ్చాయి.
అయితే అప్పటికే ఆఖరి 18 బంతుల్లో 18 పరుగులు కావాల్సిన స్థితికి చేరుకుంది సన్‌రైజర్స్. కమ్మిన్స్ వేసిన 18వ ఓవర్‌లో వరుసగా 4,6,6 బాది మ్యాచ్‌ను ముగించిన మార్క్‌రమ్, 36 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. అజింకా రహానే స్థానంలో కేకేఆర్ తరుపున ఆరంగ్రేటం చేసిన ఆరోన్ ఫించ్ 5 బంతుల్లో ఓ సిక్సర్‌తో 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వెంకటేశ్ అయ్యర్ 13 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసి నటరాజన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికి క్రీజులోకి వచ్చిన సునీల్ నరైన్ మొదటి బంతికి సిక్సర్ బాది, రెండో బంతికి అవుట్ అయ్యాడు...
6 పరుగులు చేసిన సునీల్ నరైన్, నట్టూ బౌలింగ్‌లో శశాంక్ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది కోల్‌కత్తా నైట్ రైడర్స్. ఈ దశలో శ్రేయాస్ అయ్యర్, నితీశ్ రాణా కలిసి నాలుగో వికెట్‌కి 39 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
25 బంతుల్లో 3 ఫోర్లతో 28 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 7 బంతుల్లో ఓ సిక్సర్‌తో 7 పరుగులు చేసిన షెల్డన్ జాక్సన్ కూడా ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో నట్టూకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
మరో ఎండ్‌లో నితీశ్ రాణా 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నితీశ్ రాణాకి ఐపీఎల్‌లో 19 ఇన్నింగ్స్‌ల తర్వాత వచ్చిన హాఫ్ సెంచరీ కావడం విశేషం. 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేసిన నితీశ్ రాణా, నటరాజన్ బౌలింగ్‌లో నికోలస్ పూరన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూకి వెళ్లిన సన్‌రైజర్స్‌కి అనుకూలంగా ఫలితం వచ్చింది. 3 బంతుల్లో 3 పరుగులు చేసిన ప్యాట్ కమ్మిన్స్, భువీ వేసిన 19వ ఓవర్‌లో మార్కో జాన్సెన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. యార్కర్లతో ఆండ్రే రస్సెల్‌ని ఇబ్బంది పెట్టిన భువనేశ్వర్ కుమార్, 19వ ఓవర్‌లో 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
16వ ఓవర్‌లో 2 పరుగులు మాత్రమే ఇచ్చిన ఉమ్రాన్ మాలిక్, 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా మార్కో జాన్సెన్ ఓ వికెట్ తీశాడు. టి నటరాజన్ 4 ఓవర్లలో 37 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో 11 వికెట్లు పూర్తి చేసుకున్న నట్టూ, పర్పుల్ క్యాప్ రేసులో చాహాల్ తర్వాతి స్థానంలో నిలిచాడు.
ఐపీఎల్‌లో ఎదుర్కొన్న మొదటి బంతికే ఫోర్ బాదిన ఆమన్ ఖాన్, సుచిత్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆఖరి ఓవర్ ఆఖరి మూడు బంతుల్లో వరుసగా 6,6, 4 బాదిన ఆండ్రే రస్సెల్ 16 పరుగులు రాబట్టి కేకేఆర్‌కి మంచి స్కోరు అందించాడు.