IPL2022 GT vs LSG: చిత్తుగా ఓడిన లక్నో సూపర్ జెయింట్స్... ప్లేఆఫ్స్‌కి గుజరాత్ టైటాన్స్...

Published : May 10, 2022, 10:49 PM ISTUpdated : May 10, 2022, 11:06 PM IST
IPL2022 GT vs LSG: చిత్తుగా ఓడిన లక్నో సూపర్ జెయింట్స్... ప్లేఆఫ్స్‌కి గుజరాత్ టైటాన్స్...

సారాంశం

145 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో 82 పరుగులకి ఆలౌట్ అయిన లక్నో సూపర్ జెయింట్స్... 62 పరుగుల భారీ తేడాతో గెలిచి ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లిన గుజరాత్ టైటాన్స్..

ఐపీఎల్ 2022ని వరుసగా నాలుగు విజయాలతో ప్రారంభించిన కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్, సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరిన మొట్టమొదటి జట్టుగా నిలిచింది. గత మ్యాచ్‌లో కేకేఆర్‌పై భారీ విజయంతో తన టేబుల్ టాప్ పొజిషన్‌ను లాక్కున్న లక్నో సూపర్ జెయింట్స్‌ని లో స్కోరింగ్ గేమ్‌లో చిత్తు చేసి... ప్లేఆఫ్స్‌ బెర్త్‌ని అధికారికంగా కన్ఫార్మ్ చేసుకుంది గుజరాత్ టైటాన్స్.. 145 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో 13.5 ఓవర్లలో 82 పరుగులకి ఆలౌట్ అయ్యి 62 పరుగుల తేడాతో ఓడింది లక్నో...


145 పరుగుల స్వల్ప లక్ష్యం... భీకరమైన బ్యాటింగ్ లైనప్... అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ప్లేయర్లు... అయినా లక్నో సూపర్ జెయింట్స్ టీమ్, గుజరాత్ టైటాన్స్ బౌలర్ల జోరుకి తలొగ్గాల్సి వచ్చింది. 3 ఓవర్ల తర్వాత మొదలైన లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ల పతనం ఏ దశలోనూ బ్రేకుల్లేకుండా సాగింది...

10 బంతుల్లో ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్, యష్ దయాల్ బౌలింగ్‌లో సాయి కిషోర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 16 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, మహ్మద్ షమీ బౌలింగ్‌లో మాథ్యూ వేడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

కొత్త కుర్రాడు కరణ్ శర్మ 4 బంతుల్లో 4 పరుగుల చేసి యష్ దయాల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరగా 5 పరుగులు చేసిన కృనాల్ పాండ్యాని రషద్ ఖాన్ స్టంపౌట్ చేశాడు. 11 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన ఆయుష్ బదోనీ, సాయి కిషోర్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు...

2 బంతుల్లో 2 పరుగులు చేసిన మార్కస్ స్టోయినిస్ రనౌట్ కాగా జాసన్ హోల్డర్‌ని రషీద్ ఖాన్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. మోహ్సీన్ ఖాన్ కూడా సాయి కిషోర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో దీపక్ హుడా 26 బంతుల్లో 3 ఫోర్లతో 27 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో షమీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆఖర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన ఆవేశ్ ఖాన్, ఓటమి వ్యత్యాసాన్ని తగ్గించి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. .

అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్‌, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 144 పరుగుల స్కోరు చేయగలిగింది. టైటాన్స్‌కి శుభారంభం దక్కలేదు. 11 బంతులాడి ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహా, మోహ్సీన్ ఖాన్ బౌలింగ్‌లో ఆవేశ్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 7 బంతుల్లో  2 ఫోర్లతో 10 పరుగులు చేసిన మాథ్యూ వేడ్, ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో క్వింటన్ డి కాక్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

13 బంతులాడి 11 పరుగులు మాత్రమే చేసిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కూడా ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో క్వింటన్ డి కాక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... 51 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది గుజరాత్ టైటాన్స్. ఈ దశలో డేవిడ్ మిల్లర్‌తో కలిసి నాలుగో వికెట్‌కి 52  పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు శుబ్‌మన్ గిల్...

24 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్, జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో ఆయుష్ బదోనీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. శుబ్‌మన్ గిల్, డేవిడ్ మిల్లర్ భాగస్వామ్యం నిర్మించడానికి ప్రాధాన్యం ఇవ్వడంతో స్కోరు వేగం మందగించింది. 16 ఓవర్లు ముగిసే సమయానికి 103 పరుగులు మాత్రమే చేయగలిగింది గుజరాత్ టైటాన్స్...

మోహ్సీన్ ఖాన్ 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీయగా ఆవేశ్ ఖాన్ 4 ఓవర్లలో 26 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. డెత్ ఓవర్లలో ఈ ఇద్దరూ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాహుల్ తెవాటియా, శుబ్‌మన్ గిల్ బౌండరీలు బాదడానికి ఎంత కష్టపడినా పెద్దగా వర్కవుట్ కాలేదు...

ఛమీరా వేసిన 17వ ఓవర్‌లో 14 పరుగులు వచ్చినా మోహ్సీన్ ఖాన్ వేసిన 18వ ఓవర్‌లో 5 పరుగులు, 19వ ఓవర్‌లో 6 పరుగులు మాత్రమే వచ్చాయి. జాసన్ హోల్డర్ వేసిన 20వ ఓవర్‌లో 16 పరుగులు రాబట్టాడు రాహుల్ తెవాటియా. దీంతో ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది గుజరాత్ టైటాన్స్..

శుబ్‌మన్ గిల్ 49 బంతుల్లో 7 ఫోర్లతో 63 పరుగులు చేయగా రాహుల్ తెవాటియా 16 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.  

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !