
ఐపీఎల్ - 2022 సీజన్ లో ఫైనల్స్ ప్రత్యర్థులు ఈ సీజన్‌లో తొలిసారి తలపడుతున్నారు. గతేడాది అహ్మదాబాద్ వేదికగా సుమారు లక్ష మందికి పైగా అభిమానుల నడుమ ఫైనల్స్ ఆడిన గుజరాత్ టైటాన్స్ - రాజస్తాన్ రాయల్స్.. 2023 సీజన్ లో తొలిసారి ముఖాముఖి తలపడుతున్నాయి. గత ఫైనల్ జరిగిన అహ్మదాబాద్ వేదికపైనే ఈ రెండు జట్లూ మళ్లీ కయ్యానికి కాలు దువ్వబోతున్నాయి. కాగా ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. హార్ధిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ బ్యాటింగ్‌కు రానుంది.
ఈ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆడిన నాలుగు మ్యాచ్ లలో మూడు గెలిచి ఒకదాంట్లో ఓడింది. రాజస్తాన్ కూడా నాలుగింట మూడు గెలిచి పంజాబ్ చేతిలో పరాజయం పాలైంది.
పంజాబ్ తో మ్యాచ్ లో ఓడినా రాజస్తాన్ తర్వాత పుంజుకుంది. వరుసగా ఢిల్లీ, చెన్నైలను ఓడించి ముందుకు దూసుకెళ్తున్నది. యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, దేవదత్ పడిక్కల్, షిమ్రన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్ రూపంలో ఆ జట్టకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. చెన్నైతో మ్యాచ్ లో దూరంగా ఉన్న ట్రెంట్ బౌల్ట్ ఈ మ్యాచ్ కు తిరిగొచ్చాడు.
గుజరాత్ కూడా బ్యాటింగ్ లో శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, హార్ధిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియాలతో బలంగానే ఉంది. విజయ్ శంకర్ ఈ మ్యాచ్ లో ఆడటంలేదు. అతడి స్థానంలో అభినవ్ మనోహర్ తుదిజట్టులోకి వచ్చాడు. బౌలర్లలో రషీద్ ఖాన్ తో పాటు మహ్మద్ షమీ, జోసెఫ్, పంజాబ్ తో మ్యాచ్ లో రాణించిన వెటరన్ పేసర్ మోహిత్ శర్మ లు ఫామ్ లో ఉన్నారు.
తుది జట్లు :
గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ
రాజస్తాన్ రాయల్స్ : జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, షిమ్రన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంప, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్