ఐపీఎల్ 2023 సీజన్‌లోనూ కరోనా ఆంక్షలు... పాజిటివ్ వస్తే వారం రోజులు క్వారంటైన్‌లో పడుకోవాల్సిందే...

By Chinthakindhi RamuFirst Published Mar 19, 2023, 4:15 PM IST
Highlights

కరోనా పాజటివ్‌గా తేలిన ప్లేయర్లకు 7 రోజుల క్వారంటైన్ తప్పనిసరి... ఐపీఎల్ 2021 సీజన్ అనుభవాలు పునరావృత్తం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న బీసీసీఐ.. 

రెండేళ్ల పాటు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా, ఇప్పటికీ వదల్లేదు. ఈరోజుకి కూడా ప్రతీ దేశంలోనూ కరోనా పాజిటివ్ వెలుగు చూస్తున్నాయి. కరోనా కారణంగా క్రికెట్ ఆటలో కూడా అనేక మార్పులు చేయాల్సి వచ్చింది. ఇండియాలో కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో యూఏఈలో 2020 ఐపీఎల్ సీజన్ నిర్వహించిన బీసీసీఐ, 2021 సీజన్ మధ్యలో కేసులు వెలుగుచూడడంతో రెండో ఫేజ్‌ని అక్కడే నిర్వహించింది...

2022 ఐపీఎల్ సీజన్ ఎలాంటి కరోనా కేసులు, అవంతరాలు లేకుండా జరిగింది. ప్రస్తుతం జనాల్లో కరోనా భయం పోయింది. కరోనా పాజిటివ్ వచ్చినా పెద్దగా ఆందోళన చెందడం లేదు. దీంతో కరోనా పాజిటివ్ వచ్చిన ప్లేయర్లను కూడా ఆడేందుకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది ఐసీసీ..

టీ20 వరల్డ్ కప్ 2022 సమయంలో కరోనా పాజిటివ్‌గా తేలిన తర్వాత కూడా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ తహిళా మెక్‌గ్రాత్ ఫైనల్ మ్యాచ్ ఆడింది. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత కానీ టీమిండియాకి తాము ఓ కరోనా పాజిటివ్ పేషెంట్‌తో కలిసి ఆడిన విషయం తెలియలేదు..

అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 టోర్నీలో మాత్రం కరోనా పాజిటివ్ వచ్చిన ప్లేయర్లను ఆడించేందుకు బీసీసీఐ ఇష్టపడడం లేదు. ఏ ప్లేయర్ అయినా కరోనా పాజిటివ్‌గా తేలితే సదరు ప్లేయర్, కచ్ఛితంగా వారం రోజుల పాటు క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుంది..

కరోనా నెగిటివ్‌గా తేలిన తర్వాతే మిగిలిన ప్లేయర్లతో కలిసేందుకు, మ్యాచులు ఆడేందుకు అనుమతి ఇస్తారు. ఐపీఎల్ 2021 సీజన్ సమయంలో బయో బబుల్‌లో లీగ్‌ మ్యాచులు నిర్వహించింది బీసీసీఐ. అయితే బయో బబుల్ దాటి బయటికి వెళ్లిన వృద్ధిమాన్ సాహా, వరుణ్ చక్రవర్తి వంటి ప్లేయర్ల కారణంగా టీమ్స్‌లో కరోనా కేసులు వెలుగు చూశాయి...

రెండు రోజుల్లోనే పదుల సంఖ్యలో ప్లేయర్లు కరోనా పాజిటివ్‌గా తేలడంతో 29 మ్యాచులు ముగిసిన తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 2021 సీజన్‌ని అర్ధాంతరంగా నిలిపి వేయాల్సి వచ్చింది. ఈ సీజన్‌ని పూర్తి చేసేందుకు టీ20 వరల్డ్ కప్ 2021 ముందు షెడ్యూల్ చేయడం, బిజీ షెడ్యూల్ కారణంగా అలిసిపోయామని, అందుకే పొట్టి ప్రపంచ కప్‌లో బాగా ఆడలేకపోయామని భారత ప్లేయర్లు చెప్పడం జరిగిపోయాయి..

అందుకే అటువంటి సంఘటనలు మళ్లీ పునరావృత్తం కాకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. పాజిటివ్ వచ్చిన ప్లేయర్లును తప్పనిసరిగా క్వారంటైన్‌లో పెట్టి, చికిత్స ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.. 

ఐపీఎల్ 2019 సీజన్ తర్వాత నాలుగేళ్లకు మళ్లీ పాత పద్ధతిలో హోం- అవే సిస్టమ్‌లో మ్యాచులు జరగబోతున్నాయి. దేశంలో 12 నగరాల్లో ఐపీఎల్ మ్యాచులు నిర్వహించబోతున్నారు. గత సీజన్‌లో టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్‌తో పాటు మహేంద్ర సింగ్ ధోనీకి ఆఖరి సీజన్ కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్ ఫెవరెట్లుగా బరిలో దిగుతున్నాయి.. 

click me!