భారత బ్యాటర్లను ‘డక్’ ఆడించిన ఆస్ట్రేలియా... 26 ఓవర్లలోనే టీమిండియా ఆలౌట్...

Published : Mar 19, 2023, 03:54 PM ISTUpdated : Mar 19, 2023, 03:56 PM IST
భారత బ్యాటర్లను ‘డక్’ ఆడించిన ఆస్ట్రేలియా...  26 ఓవర్లలోనే టీమిండియా ఆలౌట్...

సారాంశం

26 ఓవర్లలో 117 పరుగులకి ఆలౌట్ అయిన టీమిండియా... భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నలుగురు డకౌట్... 31 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా విరాట్ కోహ్లీ.. 

ముంబైలో జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా, విశాఖపట్నంలో జరుగుతున్న రెండో వన్డేలో పీకల్లోతు కష్టాల్లో పడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 26 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ అయ్యింది..   3 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా, వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.. 


టాస్ ఓడి ఇన్నింగ్స్ మొదలెట్టిన టీమిండియాకి తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. 2 బంతులాడిన శుబ్‌మన్ గిల్, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి లబుషేన్‌కి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. 3 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా...

ఆ తర్వాత 4 ఓవర్ల పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును కదిలించారు. 15 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన రోహిత్ శర్మ, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు...

ఆ తర్వాతి బంతికి సూర్యకుమార్ యాదవ్‌ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు మిచెల్ స్టార్క్. తొలి వన్డేలో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో డకౌట్ అయిన సూర్యకుమార్ యాదవ్, రెండో వన్డేలోనూ అదే స్టైల్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. వరుసగా రెండు మ్యాచుల్లో గోల్డెన్ డకౌట్ అయిన మొదటి భారత ప్లేయర్‌గా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు సూర్యకుమార్ యాదవ్...

32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా. గత మ్యాచ్‌లో 75 పరుగులు చేసి టీమిండియాని గెలిపించిన కెఎల్ రాహుల్, రెండో వన్డేలో పెద్దగా పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరాడు. 12 బంతులు ఆడి ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు...

డీఆర్‌ఎస్ తీసుకున్నా టీమిండియాకి ఫలితం దక్కలేదు. ఆ తర్వాత 3 బంతుల్లో ఓ సింగిల్ తీసిన హార్ధిక్ పాండ్యా, సీన్ అబ్బాట్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కి అవుట్ అయ్యాడు. 9.2 ఓవర్లలోనే 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది టీమిండియా.. 

ఓ వైపు వికెట్లు పడుతున్నా, మరో ఎండ్‌లో జాగ్రత్తగా ఆడుతున్నట్టు కనిపించిన విరాట్ కోహ్లీ కూడా భారీ స్కోరు చేయలేకపోయాడు. 35 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేసిన విరాట్ కోహ్లీని నాథన్ ఎల్లీస్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేయడంతో 71 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది టీమిండియా..

ఈ దశలో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా కలిసి ఏడో వికెట్‌కి 20 పరుగులు జోడించారు. 39 బంతుల్లో ఓ ఫోర్‌తో 16 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, నాథన్ ఎల్లీస్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీ చేతుల్లోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 17 బంతులాడిన కుల్దీప్ యాదవ్, కుల్దీప్ యాదవ్‌తో కలిసి 8వ వికెట్‌కి 12 పరుగుల భాగస్వామ్యం జోడించి... టీమిండియా స్కోరును 100 మార్కు దాటించాడు...

4 పరుగులు చేసిన కుల్దీప్ యాదవ్, సీన్ అబ్బాట్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికి మహ్మద్ షమీని డకౌట్ చేశాడు అబ్బాట్.. క్రీజులోకి వస్తూనే కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు షమీ...

103 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది టీమిండియా. ఈ దశలో మిచెల్ స్టార్క్ వేసిన 26వ ఓవర్‌లో 2 సిక్సర్లు బాదాడు అక్షర్ పటేల్. అదే ఓవర్‌లో ఎల్బీడబ్ల్యూ నుంచి తప్పించుకున్న సిరాజ్, ఆఖరి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు...

మిచెల్ స్టార్ 8 ఓవర్లలో 53 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. భారత బ్యాటర్లలో ఏకంగా నలుగురు డకౌట్ కావడం విశేషం. అక్షర్ పటేల్ 29 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 29 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

PREV
click me!

Recommended Stories

ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు
డికాక్ రాకతో డేంజరస్‌గా ముంబై.. ప్లేయింగ్ ఎలెవన్ చూస్తే మతిపోతుంది