ఉప్పల్ దంగల్.. సొంతగడ్డపై హైదరాబాద్ తొలి మ్యాచ్‌.. టాస్ ఓడిన రాజస్తాన్

Published : Apr 02, 2023, 03:03 PM ISTUpdated : Apr 02, 2023, 03:13 PM IST
ఉప్పల్ దంగల్.. సొంతగడ్డపై హైదరాబాద్ తొలి మ్యాచ్‌.. టాస్  ఓడిన రాజస్తాన్

సారాంశం

IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ -16 సీజన్ లో భాగంగా  సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) నేడు సొంతగడ్డపై రాజస్తాన్ రాయల్స్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. 

నాలుగేండ్ల తర్వాత ఉప్పల్ లో ఐపీఎల్ మ్యాచ్.  భాగ్యనగర ప్రేక్షకులకు సుదీర్ఘకాలం తర్వాత క్రికెట్ పండుగను పంచడానికి   వచ్చిన ఐపీఎల్ లో నేడు  సన్ రైజర్స్ హైదరాబాద్.. తమ తొలి మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ ను ఢీకొంటున్నది.  ఈ సీజన్ లో ఎస్ఆర్‌‌హెచ్ కు  ఎయిడెన్ మార్క్‌రమ్ సారథిగా ఉన్నా  ఇంకా అతడు అందుబాటులోకి రాకపోవడంతో  నేటి మ్యాచ్ లో  టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్  కుమార్ సారథ్యంలో సన్ రైజర్స్ బరిలోకి దిగుతున్నది.  ఈ మ్యాచ్ లో  టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్  మొదట  ఫీల్డింగ్ ఎంచుకుంది.  రాజస్తాన్ బ్యాటింగ్ కు రానుంది. 

గతేడాది   ఐపీఎల్  రన్నరప్ గా నిలిచిన  రాజస్తాన్ రాయల్స్   కూడా ఈ సీజన్ లో ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే.  దీంతో ఇరు జట్లు బోణీ కొట్టేందుకు తమ శాయశక్తులా  కృషి చేస్తున్నాయి. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ కు  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అన్ని ఏర్పాట్లూ చేసింది.  

బలాబలాలు : 

గత సీజన్ తో పోల్చితే హైదరాబాద్ లో ఈసారి కాస్త కొత్తగా మరింత బలంగా కనిపిస్తుంది.  గతేడాది డిసెంబర్ లో ముగిసిన వేలంలో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ హ్యరీ బ్రూక్ ను  రూ.13.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన  సన్ రైజర్స్.. ఈసారి అతడి మీద భారీ ఆశలు పెట్టుకుంది.   టెస్టు క్రికెట్ లో  అత్యద్భుత ఫామ్ లో ఉన్న  బ్రూక్.. ఎలా ఆడతాడో మరి. ఇతడితో పాటు  రూ. 8.5 కోట్లు పెట్టి దక్కించుకున్న మయాంక్ అగర్వాల్ కూడా కీలకమే. వీరికి తోడు  ఓపెనర్ అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్  వంటి హిట్టర్లకు తోడు వాషింగ్టన్ సుందర్  రూపంలో ఆల్ రౌండర్ కూడా ఉన్నాడు.  బౌలింగ్ లో భువీకి తోడుగా పేస్ గుర్రం ఉమ్రాన్ మాలిక్,  ఫజల్ ఫరూఖీ, నటరాజన్ లతో హైదరాబాద్  పేస్ దళం కూడా  దృఢంగానే ఉంది. 

వాళ్లూ  అంతే.. 

రాజస్తాన్ రాయల్స్ టీమ్  కూడా తక్కువేమీ తినలేదు.  ఆ జట్టు లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ తో పాటు గత సీజన్ లో హయ్యస్ట్ రన్స్ చేసిన జోస్ బట్లర్, సంజూ శాంసన్, దేవదత్ పడిక్కల్, హెట్మెయర్, రియాన్ పరాగ్ ల రూపంలో స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. బౌలర్లలో  ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ సేన్  పేస్ బాధ్యతలను మోస్తుండగా యుజ్వేంద్ర చహల్, అశ్విన్ స్పిన్నర్లుగా బరిలో ఉన్నారు.  

పిచ్ రిపోర్టు : 

ఉప్పల్ పిచ్ బ్యాటర్లతో పాటు బౌలర్లకూ సహకరిస్తుంది.  ఇక్కడ భారీ స్కోర్ల గేమ్స్ కంటే కూడా లో స్కోరింగ్ గేమ్సే ఎక్కువగా  కాపాడుకుంది ఎస్ఆర్‌‌హెచ్.  150 - 160  స్కోర్లను డిఫెండ్ చేసుకోవడం  కష్టమేమీ కాదు. మరి నేటి మ్యాచ్ లో ఎలా ఆడుతుందో చూడాలి. 

తుది జట్లు : 

రాజస్తాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్  (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్, షిమ్రన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, జేసన్ హోల్డర్,  ట్రెంట్ బౌల్ట్, కెఎం అసిఫ్, యుజ్వేంద్ర చహల్ 

సన్ రైజర్స్ హైదరాబాద్ : మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, హ్యరీ బ్రూక్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, ఉమ్రాన్ మాలిక్, అదిల్ రషీద్, భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), టి. నటరాజన్, ఫలజల్లా ఫరూఖీ 

 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !