
ఐపీఎల్ 2023 సీజన్‌లోనూ ఆర్‌సీబీ టైటిల్ కలలు నెరవేరలేదు. గత మూడు సీజన్లుగా ప్లేఆఫ్స్ చేరుతూ వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి టాప్ 4కి అడుగుదూరంలో ఆగిపోయింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడిపోవడంతో సన్‌రైజర్స్‌పై గెలిచిన ముంబై ఇండియన్స్, 2 సీజన్ల తర్వాత ప్లేఆఫ్స్ చేరింది. మే 24న లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య చెన్నైలో ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది.
ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్లు చేతులు ఎత్తేయడంతో 198 పరుగుల భారీ స్కోరుని టైటాన్స్ ఊదేసింది.. శుబ్‌మన్ గిల్, వరుసగా ఐపీఎల్ 2023 సీజన్‌లో రెండో సెంచరీ చేసి, గుజరాత్‌కి గ్రూప్ స్టేజీలో 10వ విజయాన్ని అందించాడు..
ఎప్పటిలాగే ఇన్నింగ్స్‌ని నెమ్మదిగా మొదలెట్టిన గుజరాత్ టైటాన్స్ ఆ తర్వాత దూకుడు ప్రదర్శించింది. 14 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహా, సిరాజ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఈ దశలో విజయ్ శంకర్, శుబ్‌మన్ గిల్ కలిసి రెండో వికెట్‌కి 123 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు.
35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేసిన విజయ్ శంకర్, విజయ్‌కుమార్ వైశాక్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3 బంతుల్లో పరుగులేమీ చేయలేకపోయిన దసున్ శనక, హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ప్రభుదేశాయ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
7 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఆ ఓవర్ ఆఖరి బంతికి శుబ్‌మన్ గిల్ సిక్సర్ బాదడంతో గుజరాత్ టైటాన్స్ విజయానికి ఆఖరి 2 ఓవర్లలో 19 పరుగులే కావాల్సి వచ్చాయి.
హర్షల్ పటేల్ వేసిన 19వ ఓవర్‌లో రెండో బంతికి సిక్సర్ బాదిన శుబ్‌మన్ గిల్, మ్యాచ్‌లో డ్రామా లేకుండా చేశాడు. ఆఖరి ఓవర్‌లో గుజరాత్ టైటాన్స్ విజయానికి 8 పరుగులు కావాల్సి వచ్చాయి.
చివరి ఓవర్ వేసిన వేన్ పార్నెల్, నో బాల్‌తో ఓవర్‌ని మొదలెట్టి, ఆ తర్వాత వైడ్ బాల్ వేశాడు. దీంతో 6 బంతుల్లో 8 పరుగుల లెక్క కాస్తా 6 బంతుల్లో 6 పరుగులకు వచ్చింది. మొదటి బంతికి సిక్సర్ బాదిన శుబ్‌మన్ గిల్ సెంచరీతో పాటు గుజరాత్ టైటాన్స్‌కి విజయాన్ని అందించాడు. 52 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 104 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు శుబ్‌మన్ గిల్.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేయగలిగింది. తొలి వికెట్‌కి ఫాఫ్ డుప్లిసిస్, విరాట్ కోహ్లీ కలిసి 67 పరుగుల భాగస్వామ్యం అందించారు. 19 బంతుల్లో 5 ఫోర్లతో 28 పరుగులు చేసిన ఫాఫ్ డుప్లిసిస్, నూర్ అహ్మద్ బౌలింగ్‌లో రాహుల్ తెవాటియాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
5 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ని రషీద్ ఖాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు... 3 బంతుల్లో 1 పరుగు చేసిన మహిపాల్ లోమ్రోర్, నూర్ అహ్మద్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 67/0 స్కోరుతో ఉన్న ఆర్‌సీబీ, 2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 85/3కి చేరింది. 16 బంతుల్లో 5 ఫోర్లతో 26 పరుగులు చేసిన మైకేల్ బ్రాస్‌వెల్, షమీ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
దినేశ్ కార్తీక్, యశ్ దయాల్ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో దూకుడు తగ్గించకుండా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు విరాట్ కోహ్లీ. 35 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ, 60 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు.
2020 సీజన్‌లో శిఖర్ ధావన్, 2022 సీజన్‌లో జోస్ బట్లర్ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో రెండు సెంచరీలు చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, ఐపీఎల్‌లో ఏడో సెంచరీతో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా చరిత్ర నెలకొల్పాడు..
విరాట్ కోహ్లీ 61 బంతుల్లో 13 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 101 పరుగులు చేయగా అనుజ్ రావత్ 15 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేసి ఆర్‌సీబీకి 197 పరుగుల స్కోరు అందించారు. ఈ ఇద్దరూ 34 బంతుల్లో 64 పరుగుల భాగస్వామ్యం జోడించారు.