మళ్లీ తల్ల‘ఢిల్లీ’.. బౌల్డ్ దెబ్బతో వార్నర్ సేనకు హ్యాట్రిక్ ఓటమి..

Published : Apr 08, 2023, 07:22 PM IST
మళ్లీ తల్ల‘ఢిల్లీ’.. బౌల్డ్ దెబ్బతో వార్నర్ సేనకు హ్యాట్రిక్ ఓటమి..

సారాంశం

IPL 2023: ఐపీఎల్-16లో ఢిల్లీకి హ్యాట్రిక్ ఓటమి ఎదురైంది.  మూడు రోజుల క్రితం సరిగ్గా ఇదే వేదికపై  పంజాబ్ తో మ్యాచ్ ను  ఆరు పరుగుల తేడాతో ఓడిన రాజస్తాన్.. ఢిల్లీని ఖంగుతినిపించింది.  

ఐపీఎల్‌లో ఆడుతున్న వేదికలు మారుతున్నా  ఢిల్లీ క్యాపిటల్స్ తలరాత మారడం లేదు.  లక్నో, ఢిల్లీ,  గువహతి.. ఎక్కడికెళ్లినా పరాభవాలే. ఈ సీజన్ లో ఆడిన తొలి రెండు మ్యాచ్ లలో ఓడిన  ఢిల్లీ.. తాజాగా గువహితి వేదికగా  రాజస్తాన్ రాయల్స్ తో ముగిసిన   మ్యాచ్ లో కూడా ఓటమిపాలై హ్యాట్రిక్ ఓటమి నమోదుచేసింది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి  199  పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఏ దశలోనూ  విజయం దిశగా సాగలేదు. రాజస్తాన్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్.. ఫస్ట్ ఓవర్ లోనే ఢిల్లీ ఓటమిని  ఖాయం చేశాడు.   200 పరుగుల టార్గెట్ లో  భాగంగా ఢిల్లీ..  20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ సారథి డేవిడ్ వార్నర్ (55 బంతుల్లో 65, 7 ఫోర్లు) రాణించాడు. తద్వారా రాజస్తాన్.. 57 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.  

భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి క్రీజులోకి వచ్చిన ఢిల్లీకి తొలి ఓవర్లోనే డబుల్ షాక్ తాకింది. ఫామ్‌లో లేక తంటాలు పడుతున్న ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా (0) మరోసారి సున్నాలు చుట్టాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఫస్ట్ ఓవర్   మూడో బాల్‌కు  షా..  వికెట్ కీపర్  సంజూ శాంసన్ కు క్యాచ్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో  షా ఖలీల్ అహ్మద్ ప్లేస్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగడం గమనార్హం.

షా నిష్క్రమించిన మరుసటి బంతికే  ఈ మ్యాచ్ లో మిచెల్ మార్ష్ స్థానంలో  బ్యాటింగ్‌కు వచ్చిన  మనీష్ పాండే (0) కూడా  వికెట్ల ముందు దొరికిపోయాడు.  సున్నాకే ఢిల్లీ  రెండు వికెట్లు కోల్పోయింది.   ఓవర్ మెయిడిన్ తో పాటు  రెండు వికెట్లు కూడా తీసి ఢిల్లీకి  తొలి ఓవర్లోనే రెండు షాకులిచ్చాడు బౌల్ట్.

ఆదుకున్న వార్నర్..

నాలుగో స్థానంలో వచ్చిన రిలీ రూసో (12 బంతుల్లో 14,  2 ఫోరలు)  వార్నర్  ఇన్నింగ్స్ ను నిర్మించే యత్నం చేశాడు. మూడో వికెట్ కు ఈ ఇద్దరూ  36 పరుగులు జోడించారు. కుదురుకుంటున్న ఈ జోడీని అశ్విన్ విడదీశాడు.  అశ్విన్ వేసిన  ఆరో ఓవర్లో  రూసో..  జైస్వాల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

రూసో  ఔటయ్యాక  వచ్చిన లలిత్ యాదవ్  (24 బంతుల్లో  38,  5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు.   ఈ ఇద్దరూ  నాలుగో వికెట్ కు    64 పరుగులు జోడించారు. అడపాదడపా  బౌండరీలు బాదిన ఈ జోడీ..  చహల్,  అశ్విన్ ల జోడీని సమర్థంగా ఎదుర్కుంది.   ఈ క్రమంలో బౌల్ట్ వేసిన  9వ ఓవర్లో మూడో బంతికి   ఫోర్ కొట్టడం ద్వారా  వార్నర్  ఐపీఎల్ లో ఆరు వేల పరుగులు పూర్తి చేసుకున్న  రెండో బ్యాటర్ (విరాట్ కోహ్లీ ముందున్నాడు) గా నిలిచాడు.  పది ఓవర్లు ముగిసేటప్పటికీ  ఢిల్లీ చేసిన పరుగులు  3 వికెట్ల నష్టానికి 68 పరుగులే.  

మళ్లీ బౌల్ట్ మాయ.. 

చహల్ వేసిన 11వ ఓవర్లో రెండు ఫోర్లు బాదిన లలిత్.. బౌల్ట్ వేసిన  13వ ఓవర్లో కూడా ఓ బౌండరీ కొట్టాడు. కానీ ఆ మరుసటి బంతికే  క్లీన్ బౌల్డ్ అయ్యాడు.   అతడి స్థానంలో వచ్చిన  అక్షర్ పటేల్ (2).. చహల్ వేసిన  15వ ఓవర్లో ముందుకొచ్చి ఆడబోయి  స్టంపౌట్ అయ్యాడు.

అశ్విన్ వేసిన  16వ ఓవర్లో  బౌండరీ  సాధించిన వార్నర్.. 44 బంతులలో  హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.   కానీ ఇదే ఓవర్లో ఢిల్లీ భారీ ఆశలు పెట్టుకున్న  రొవ్మన్ పావెల్  (2) భారీ షాట్ ఆడబోయి   బౌండరీ లైన్ వద్ద  హెట్మెయర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.   మురుగన్ అశ్విన్ వేసిన   17వ ఓవర్లో  వార్నర్.. జైస్వాల్ కు క్యాచ్ ఇచ్చినా అది  నోబాల్ అవడంతో బతికిపోయాడు. చహల్ వేసిన  19వ ఓవర్లో  అభిషేక్ పొరెల్  (7)  కూడా హెట్మెయర్  కు క్యాచ్ ఇచ్చాడు.  అదే ఓవర్లో చివరి బంతికి వార్నర్  కూడా ఔటయ్యాడు. నోర్జే (0) ను సందీప్ శర్మ బౌల్ట్ చేశాడు.   ఫలితంగా  రాజస్తాన్.. 57 పరుగుల తేడాతో గెలుపొందింది. 

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?