
రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ సీజన్ లో కూడా తన చెత్త ఆటతో సోషల్ మీడియాలో మీమర్స్ కు సరుకవుతున్నాడు. ఆడిన ఆరు మ్యాచ్ లలో కూడా దారుణమైన ప్రదర్శనలతో విఫలమైన పరాగ్‌ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. ఆల్ రౌండర్ (ఈ ట్యాగ్ పెట్టుకోవడమే తప్ప అసలు బౌలింగ్ వేసిందే లేదు) ట్యాగ్ తో జట్టులో నెట్టుకొస్తున్న అతడు టీమ్ మేనేజ్మెంట్ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాడు. నిన్న గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో కూడా చేతులెత్తేశాడు.
నిన్నటి మ్యాచ్ లో అతడు యశస్వి జైస్వాల్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగాడు. కానీ ఆరు బంతులలో 4 పరుగులే చేసి రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ సీజన్ లో ఆరు మ్యాచ్ లు ఆడిన పరాగ్.. 58 పరుగులు మాత్రమే చేశాడు. ఆడటం లేదని అతడిని జట్టు నుంచి తప్పించినా పరాగ్ ఆట మాత్రం మారడం లేదు.
ఇక గుజరాత్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత పరాగ్ ను టార్గెట్ చేస్తూ ట్రోలర్స్ ఆటాడుకున్నారు. అటిట్యూడ్ ఆకాశంలో ఉంటే ఆట మాత్రం పాతాళంలో ఉందని కామెంట్స్ చేస్తున్నారు. టుక్ టుక్ అకాడమీ (చెత్తగా ఆడటం)కి పరాగ్ ను డైరెక్టర్ గా నియమించాలని.. ఆ పోస్టు అయితే అతడికి కరెక్ట్ గా సరిపోతుందని వాపోతున్నారు. పరాగ్ ను దక్కించుకునేందుకు రాజస్తాన్ గత వేలంలో రూ. 3.80 కోట్లు ఖర్చు చేసిందని, అవన్నీ బూడిదలో పోసిన పన్నీరేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆట సరిగా లేకపోయినా ట్విటర్ లో ఇతగాడి బిల్డప్ లు కూడా మామూలుగా ఉండవు. ఈ సీజన్ కు ముందు పరాగ్ ట్విటర్ వేదికగా.. ‘ఈసారి ఐపీఎల్ లో నేను ఒకే ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు కొడతానని నా మనస్సాక్షి చెబుతున్నది..’ అని ట్వీట్ చేశాడు. వరుసగా నాలుగు సిక్సర్లు ఏమో గానీ నాలుగు నిమిషాలు కూడా క్రీజులో ఉండేందుకు అతడు నానా తంటాలు పడుతున్నాడు. ఇప్పటివరకు 6 మ్యాచ్ లలో పరాగ్ కొట్టినా మూడు సిక్సర్లే కొట్టాడు.
ఇక తనపై వస్తున్న ట్రోల్స్ పై పరాగ్ ట్విటర్ లో స్పందించాడు. గుజరాత్ తో మ్యాచ్ ముగిశాక ‘కాలం మంచిదో చెడ్దదో ఏదైమైనా కరిగిపోతుంది’అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కూడా నెటిజన్లకు కోపం తెప్పిస్తున్నది. ‘నువ్వు ఆడేది లేదు చేసేది లేదు గానీ ఈ పనికి మాలిన ముచ్చట్లకైతే తక్కువ లేదు’ అని పలువురు కౌంటర్ ఇస్తుండగా మరికొందరేమో ‘రియాన్.. ఈ క్రికెట్ ఇవన్నీ నీ వల్ల అయ్యేపనులు కాదు గానీ నా మాట విని రిటైర్ అయిపో..’అని కౌంటర్ ఇస్తున్నారు.