LSG vs MI Eliminator: దంచికొట్టిన ముంబై.. లక్నో ఎదుట భారీ టార్గెట్

By Srinivas MFirst Published May 24, 2023, 9:30 PM IST
Highlights

IPL 2023, LSG vs MI Eliminator: ఐపీఎల్ - 16 ప్లేఆఫ్స్ లో భాగంగా చెన్నై వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ - ముంబై ఇండియన్స్ మధ్య  జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందు బ్యాటింగ్  చేసిన ముంబై.. భారీ స్కోరు చేసింది. 

లక్నో సూపర్ కింగ్స్ - ముంబై ఇండియన్స్ మధ్య చెన్నై వేదికగా  జరుగుతున్న ఎలిమినేటర్  మ్యాచ్‌లో  రోహిత్ సేన బ్యాటింగ్ లో రాణించింది.  కామెరూన్ గ్రీన్  (23 బంతుల్లో 41, 6 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్  (20 బంతుల్లో 33, 2 ఫోర్లు, 2 సిక్సర్లు)  లు ధాటిగా ఆడటంతో ఒక దశలో 200 ఈజీ అనుకున్న తరుణంలో వరుసగా వికెట్లు కోల్పోయి  నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులే చేయగలిగింది.   మరి రెండో ఇన్నింగ్స్ లో నెమ్మదించే  చెన్నై పిచ్ పై  ముంబై బౌలర్లు ఈ స్కోరును ఏ మేరకు కాపాడుకుంటారనేది చూడాలి.  లక్నో కు కూడా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన ఉండటం  ఆ జట్టును కలవరపరిచేదే. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న  ముంబై ఇండియన్స్.. ఇన్నింగ్స్‌ను ధాటిగానే ఆరంభించేందుకు యత్నించింది. కానీ దూకుడుగా ఆడే క్రమంలో ఇషాన్ కిషన్  (12 బంతుల్లో  15, 3 ఫోర్లు),  కెప్టెన్ రోహిత్ శర్మ  (10 బంతుల్లో 11, 1 ఫోర్, 1 సిక్స్)  లు వెంటవెంటనే ఔట్ అయ్యారు. 

నవీన్ ఉల్ హక్   వేసిన  నాలుగో ఓవర్లో  రెండో బాల్ కు అయుష్ బదోనికి  క్యాచ్ ఇచ్చి రోహిత్ ఔటయ్యాడు. మరుసటి ఓవర్లో  యశ్ ఠాకూర్..  ఇషాన్ ను ఔట్ చేశాడు. 38 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన  ముంబైని  కామెరూన్ గ్రీన్ (23 బంతుల్లో 41, 6 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్  (20 బంతుల్లో 33, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నారు. 

ఈ ఇద్దరూ  ఉన్నంతసేపూ లక్నో బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.  క్రీజులోకి రావడమే సిక్సర్ తో  బాదుడు  ప్రారంభించిన సూర్య.. అదే జోరు కొనసాగించాడు.  కృనాల్ వేసిన ఆరో ఓవర్లో  గ్రీన్.. మూడు ఫోర్లు కొట్టాడు.  మోహ్సిన్ ఖాన్ వేసిన 9వ ఓవర్లో  సూర్య సిక్సర్ బాదడంతో ఇద్దరి మధ్య అర్థ  సెంచరీ భాగస్వామ్యం పూర్తైంది. పది ఓవర్లకే ముంబై స్కోరు  98 పరుగులకు చేరింది.  

షాకిచ్చిన నవీన్.. 

ధాటిగా ఆడుతున్న   ఈ జోడీని  నవీన్ ఉల్ హక్ విడదీశాడు.   అతడు వేసిన  11వ ఓవర్లో  ఫస్ట్ బాల్ ఫోర్ కొట్టిన సూర్య.. నాలుగో బాల్  భారీ షాట్ ఆడబోయి  కృష్ణప్ప గౌతమ్ కు క్యాచ్ ఇచ్చాడు.  దీంతో  66 పరుగులమూడో వికెట్  భాగస్వామ్యానికి తెరపడింది.   సూర్య నిష్క్రమించిన తర్వాత అదే ఓవర్లో ఆఖరి బంతికి  గ్రీన్ కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

సూర్య-గ్రీన్ లు నిష్క్రమించాక ముంబై స్కోరు వేగం తగ్గింది. 13 బంతులాడి 13 పరుగులే చేసిన టిమ్ డేవిడ్..   యశ్ ఠాకూర్ వేసిన  17వ ఓవర్లో ఫుల్ టాస్ బాల్ ఆడి  దీపక్ హుడా చేతికి చిక్కాడు.  నవీన్ వేసిన  18వ ఓవర్లో తిలక్ వర్మ  (22 బంతులలో 26, 2 సిక్సర్లు)  కూడా హుడాకే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. సూర్యకుమార్ యాదవ్ చేతిలో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన   నెహల్ వధెర  (12 బంతుల్లో 23, 2 ఫోర్లు, 2 సిక్సర్లు)  ఆఖర్లో మెరుపులు మెరిపించి ముంబై స్కోరును  180 మార్కు దాటించాడు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్  4 ఓవర్లు వేసి  38 పరుగులిచ్చి  4 వికెట్లు తీయగా  యశ్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టాడు. మోహ్సిన్ ఖాన్ కు ఒక వికెట్ దక్కింది. 

click me!