
గతేడాది ఐపీఎల్ ఫైనల్ ప్రత్యర్థుల మధ్య అహ్మదాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. డెత్ ఓవర్లలో మెరుపులతో ఆ జట్టు పోరాడే టార్గెట్ ను రాజస్తాన్ ఎదుట నిలిపింది. గుజరాత్ బ్యాటర్లు ఆరంభంలో శుభ్‌మన్ గిల్ (34 బంతుల్లో 45, 4 ఫోర్లు, 1 సిక్సర్) మరో కీలక ఇన్నింగ్స్ ఆడగా చివర్లో డేవిడ్ మిల్లర్ (30 బంతుల్లో46, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తో పాటు అభినవ్ మనోహర్ (13 బంతుల్లో 27, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్.. 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లు డెత్ ఓవర్లలో భారీగా పరుగులిచ్చుకోకుంటే గుజరాత్ ఇంకా తక్కువ స్కోరుకే పరిమితమయ్యేది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ధాటిగా ఆడే వృద్ధిమాన్ సాహా.. 4 పరుగులే చేసి నిష్క్రమించాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి ఓవర్లోనే సాహా.. అతడికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
వన్ డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్ తో కలిసి గిల్.. రెండో వికెట్ కు 27 పరుగులు జోడించాడు. రాజస్తాన్ బౌలర్లు రాణించడంతో ఈ ఇద్దరూ నిదానంగానే ఆడారు. ఆడమ్ జంపా వేసిన ఐదో ఓవర్లో ఆరో బంతికి సాయి సుదర్శన్ రనౌట్ అయ్యాడు.
గత మూడు మ్యాచ్‌లలో విఫలమైన హార్ధిక్ పాండ్యా.. 19 బంతుల్లోనే 3 పోర్లు, 1 సిక్సర్ సాయంతో 28 పరుగులు చేశాడు. కానీ చహల్ వేసిన 11వ ఓవర్లో అతడు యశస్వి జైస్వాల్ పట్టిన అద్భుత క్యాచ్ తో ఔటయ్యాడు. గిల్ తో కలిసి హార్దిక్ నాలుగో వికెట్‌కు 59 పరుగులు జోడించాడు.
10 ఓవర్లలో 91 కే 3 వికెట్లు కోల్పోయిన గుజరాత్‌కు సందీప్ శర్మ 15వ ఓవర్లో షాకిచ్చాడు. శుభ్‌మన్ గిల్ లాంగాఫ్ వద్ద జోస్ బట్లర్ క్యాచ్ పట్టడంతో నిష్క్రమించాడు. కానీ డేవిడ్ మిల్లర్ ( బంతుల్లో , ఫోర్లు, సిక్స్) తో పాటు అభినవ్ మనోహర్ క్రీజులో ఉండటంతో గుజరాత్.. భారీ స్కోరుపై కన్నేసింది.
అందుకు తగ్గట్టుగానే 15 ఓవర్ల వరకు 119 పరుగులు చేసిన గుజరాత్.. డెత్ ఓవర్లలో మాత్రం ధాటిగా ఆడింది. మనోహర్.. 3 భారీ సిక్సర్లు బాది గుజరాత్ స్కోరును పరుగులు పెట్టించాడు. చివరి ఓవర్లో మిల్లర్ కూడా 2 ఫోర్లు బాదడంతో గుజరాత్ స్కోరు 175 దాటింది.