హమ్మయ్య ముంబై గెలిచింది! ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో... ఢిల్లీ క్యాపిటల్స్‌కి వరుసగా నాలుగో ఓటమి...

Published : Apr 11, 2023, 11:20 PM IST
హమ్మయ్య ముంబై గెలిచింది! ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో... ఢిల్లీ క్యాపిటల్స్‌కి వరుసగా నాలుగో ఓటమి...

సారాంశం

IPL 2023: రెండేళ్ల తర్వాత హాఫ్ సెంచరీ బాదిన రోహిత్ శర్మ.. సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డకౌట్.. ఆఖరి ఓవర్‌లో విజయం అందుకున్న ముంబై ఇండియన్స్... డేవిడ్ వార్నర్ టీమ్‌కి వరుసగా నాలుగో ఓటమి.. 

ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఆఖరి ఓవర్ వరకూ సాగిన నైల్ బైటింగ్ థ్రిల్లర్ మ్యాచ్‌లో చివరి ఓవర్ చివరి బంతికి విజయాన్ని అందుకుంది ముంబై ఇండియన్స్. చివరి ఓవర్ వేసిన ఆన్రీచ్ నోకియా 5 పరుగులు ఇవ్వకుండా ఆఖరి బంతి వరకూ బ్యాటర్లను నిలువరించినా ఫీల్డింగ్‌లో చేసిన చిన్న చిన్న తప్పులకు భారీ మూల్యం చెల్లించుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌పై 6వికెట్ల తేడాతో గెలిచి, 2023 సీజన్‌లో తొలి విజయం ఖాతాలో వేసుకుంది రోహిత్ సేన. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్, ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.. 


173 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్‌కి మెరుపు ఆరంభం దక్కింది. మొదటి ఓవర్‌లో రోహిత్ శర్మ 4, 6,4 బాదగా ఆ తర్వాతి ఓవర్‌లో ఇషాన్ కిషన్ హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. మూడో ఓవర్‌లోనూ 15 పరుగులు రావడంతో 3 ఓవర్లు ముగిసే సమయానికి 42 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్..

26 బంతుల్లో 6 ఫోర్లతో 31 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, తొలి వికెట్‌కి 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. రోహిత్ శర్మతో సమన్వయ లోపంతో ఇషాన్ కిషన్ రనౌట్ అయ్యాడు. 

28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు రోహిత్ శర్మ. రోహిత్‌కి ఐపీఎల్‌లో 808 రోజుల గ్యాప్ తర్వాత వచ్చిన హాఫ్ సెంచరీ ఇది. 2021 ఆరంభంలో హాఫ్ సెంచరీ బాదిన రోహిత్, 24 ఇన్నింగ్స్‌ల్లో 50+ మార్కును అందుకోలేకపోయాడు..

రోహిత్ శర్మతో కలిసి రెండో వికెట్‌కి 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు తిలక్ వర్మ. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో 4, 6, 6 బాదిన తిలక్ వర్మ, 29 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 41 పరుగులు చేసి మనీశ్ పాండేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

ఆ తర్వాతి బంతికి సూర్యకుమార్ యాదవ్, గోల్డెన్ డకౌట్ అయ్యాడు. భారీ షాట్‌కి ప్రయత్నించిన బౌండరీ లైన్ దగ్గర కుల్దీప్ యాదవ్ చేతుల్లోకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.. 

సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యే సమయానికి ముంబై ఇండియన్స్ విజయానికి ఆఖరి 4 ఓవర్లలో 34 పరుగులు కావాలి. 45 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 65 పరుగులు చేసిన రోహిత్ శర్మ, ముస్తాఫిజుర్ రహ్మాన్ బౌలింగ్‌లో అభిషేక్ పోరెల్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు..

రోహిత్ అవుటైన సమయానికి ముంబై విజయానికి 19 బంతుల్లో 30 పరుగులు కావాలి.. ఆన్రీచ్ నోకియా వేసిన 18వ ఓవర్‌లో 6 పరుగులే రాగా  19వ ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ రహ్మాన్, మొదటి 3 బంతుల్లో 2 పరుగులే ఇచ్చాడు. అయితే ఆ తర్వాత కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్ చెరో సిక్సర్ బాదడంతో 15 పరుగులు వచ్చేశాడు. దీంతో ఆఖరి ఓవర్‌లో ముంబై విజయానికి 5 పరుగులే కావాల్సి వచ్చాయి. 

మొదటి బంతికి సింగిల్ రాగా రెండో బంతికి పరుగులేమీ రాలేదు. మూడో బంతికి అంపైర్ వైడ్ ఇచ్చినా రివ్యూ తీసుకున్న ఢిల్లీకి ఫలితం దక్కింది. నాలుగో బంతికి సింగిల్ వచ్చింది. ఐదో బంతికి రనౌట్ మిస్ కావడంతో ముంబైకి సింగిల్ దక్కింది.ఆఖరి బంతికి టిమ్ డేవిడ్ 2 పరుగులు చేశాడు. వార్నర్ వేసిన త్రో, కీపర్ చేతుల్లోకి రాకపోవడం, టిమ్ డేవిడ్ సరైన సమయానికి డైవ్ చేయడంతో మ్యాచ్‌లో ముంబై విజయాన్ని అందుకుంది.. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, 19.4 ఓవర్లలో  172 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 18 ఓవర్లు ముగిసే సమయానికి 165/5 స్కోరుతో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, 10 బంతుల్లో 7 పరుగుల తేడాతో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులకి ఆలౌట్ అయ్యింది.  

10 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసిన పృథ్వీ షా, హృతీక్ షోకీన్ బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన  మనీశ్ పాండే 18 బంతుల్లో 5 ఫోర్లతో 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తొలి మ్యాచ్ ఆడుతున్న అండర్19 వరల్డ్ కప్ 2022 విన్నింగ్ కెప్టెన్ యశ్ ధుల్, 4 బంతుల్లో 2 పరుగులు చేసి రిలే మెడరిత్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

రోవ్‌మన్ పావెల్‌ 4 బంతుల్లో ఓ ఫోర్‌తో 4 పరుగులు చేసి పియూష్ చావ్లా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. లలిత్ యాదవ్ కూడా 4 బంతుల్లో 2 పరుగులు చేసి పియూష్ చావ్లా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 

98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ దశలో డేవిడ్ వార్నర్, అక్షర్ పటేల్ కలిసి ఆరో వికెట్‌కి 35 బంతుల్లో 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఆదుకున్నారు. 


21 బంతుల్లో ఐపీఎల్‌లో మొటట్మొదటి హాఫ్ సెంచరీ పూర్తి చేసుుకన్న అక్షర్ పటేల్, 25 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 54 పరుగులు చేసి జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ బౌలింగ్‌లో అర్షద్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..  47 బంతుల్లో 6 ఫోర్లతో 51 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, బెహ్రెన్‌డార్ఫ్ బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..

వార్నర్ అవుటైన తర్వాతి బంతికే కుల్దీప్ యాదవ్ రనౌట్ అయ్యాడు. అదే ఓవర్‌లో అభిషేక్ పోరెల్, భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఓ ఫోర్ బాదిన ఆన్రీచ్ నోకియాని రిలే మెడరిత్ క్లీన్ బౌల్డ్ చేశాడు..
 

PREV
click me!

Recommended Stories

Rohit Sharma : షాకింగ్.. అసలు విషయం చెప్పిన రోహిత్!
కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?