
ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలబడుతోంది. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు..
ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆర్‌సీబీ 23 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించడంతో 174 పరుగుల స్కోరు చేసిన ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌ని 151 పరుగులకే కట్టడి చేసింది. మనీశ్ పాండే 50 పరుగులతో రాణించినా ఢిల్లీకి విజయాన్ని అందించలేకపోయాడు..
ఈ మ్యాచ్ సమయంలో అగ్రెసివ్ యాటిట్యూడ్‌తో వార్తల్లో నిలిచాడు విరాట్ కోహ్లీ. మ్యాచ్ ముగిసిన తర్వాత సౌరవ్ గంగూలీతో షేక్ హ్యాండ్ ఇవ్వకుండా తప్పించుకోవడం, బౌండరీ లైన్ దగ్గర బీసీసీఐ మాజీ బాస్‌ని కోపంగా చూడడం టీవీ కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. నాటకీయ పరిణామాల మధ్య ముగిసిన ఆ మ్యాచ్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌కి హైప్ పెరిగిపోయింది.
గౌతమ్ గంభీర్‌తో వాగ్వాదం జరిగిన తర్వాత సౌరవ్ గంగూలీతో విరాట్ కోహ్లీ ఎలా ప్రవర్తిస్తాడని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. లక్నో సూపర్ జెయింట్స్‌పై 18 పరుగుల తేడాతో గెలిచిన ఆర్‌సీబీ, ప్రస్తుతం 9 మ్యాచుల్లో 5 విజయాలతో ఐదో స్థానంలో ఉంది...
మరోవైపు 9 మ్యాచుల్లో 3 విజయాలు మాత్రమే అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖరి స్థానంలో ఉంది. నేటి మ్యాచ్‌లో ఓడితే ఢిల్లీ క్యాపిటల్స్, ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటుంది..
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ అన్రీచ్ నోకియా వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లడంతో ఆ టీమ్ కష్టాలు రెట్టింపు అయ్యాయి. గత మ్యాచ్‌లో టాపార్డర్ విఫలమైనా ఆమన్ హాకీం ఖాన్, రిపల్ పటేల్, అక్షర్ పటేల్ బ్యాటింగ్‌లో రాణించారు..
గత మ్యాచ్‌లో 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఆర్‌సీబీ కూడా 127 పరుగుల టార్గెట్‌ని కాపాడుకుంటూ లక్నో సూపర్ జెయింట్స్‌ని చిత్తు చేసింది... రెండు లో స్కోరింగ్ మ్యాచుల తర్వాత ఈ రెండు జట్లు తలబడుతుండడంతో ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు ఆశిస్తున్నారు అభిమానులు..
గాయం కారణంగా జట్టుకి దూరమైన డేవిడ్ విల్లే ప్లేస్‌లో ఆర్‌సీబీలోకి వచ్చిన కేదార్ జాదవ్, నేటి మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. మిడిల్ ఆర్డర్‌లో యంగ్ బ్యాటర్లు వరుసగా విఫలం అవుతుండడంతో కేదార్ జాదవ్ నుంచి ఆర్‌సీబీ భారీగా ఆశిస్తోంది.
ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్, రిలే రసో, మిచెల్ మార్ష్, మనీశ్ పాండే, ఆమన్ హకీం ఖాన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, వానిందు హసరంగ, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, జోష్ హజల్‌వుల్