
మొన్నటి వరకు రజత్ పాటిదార్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ.. ఇప్పుడు ఆ పేరు వినగానే ఎవరైనా ఆర్సీబీ కొత్త హీరో అనాల్సిందే. క్లిష్ట సమయంలో.. ఆర్సీబీ కి అండగా నిలిచి.. రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ లో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లపై చెలరేగి జట్టు స్కోర్ 200 దాటించడంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా ఎలిమినేటర్‌లో బెంగళూరు అద్భుత విజయాన్ని అందుకుంది. కీలక సమయంలో చెలరేగిన పటీదార్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే పటీదార్ ఐపీఎల్ 2022 కోసం తన పెళ్లిని వాయిదా వేసుకోవడం గమనార్హం.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్ 2021లో 4 మ్యాచ్‌లు ఆడిన రజత్ పటీదార్ 71 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు అతని బెంగళూరు వదిలేసింది. మెగా వేలంలో కూడా అతడిని కోలుగోలు చేయలేదు. దాంతో పటీదార్‌కు నిరాశే ఎదురైంది. ఇక మే 9న వివాహం చేసుకోవాలని ప్లాన్ చేశాడు. ఇందుకోసం చిన్న ఫంక్షన్, ఇండోర్‌లో ఓ హోటల్‌ను కూడా బుక్ చేశాడు. అయితే గాయం రూపంలో పటీదార్‌కు ఓ లక్కీ అవకాశం వచ్చింది.
ఐపీఎల్ ఆరంభంలో లువ్నిత్ సిసోడియాకు గాయం కావడంతో.. ఏప్రిల్ 3న రజత్ పాటిదార్‌ను రూ. 20 లక్షలకు రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా బెంగళూరు ప్రాంచైజీ తీసుకుంది. ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు 7 మ్యాచులు ఆడిన పాటిదార్ 275 రన్స్ చేశాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఏకంగా సెంచరీ చేసి ఒక్కసారిగా హీరో అయ్యాడు. పాటిదార్ సునామీ ఇన్నింగ్స్‌తో బెంగళూరు టైటిల్ సాధించే దిశగా మరో అడుగు ముందుకేసింది. ఇక శుక్రవారం క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో బెంగళూరు తలపడనుంది.
రజత్ పాటిదార్ తండ్రి మనోహర్ పాటిదార్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'మే 9న రజత్ పాటిదార్ వివాహంకు డేట్ ఫిక్స్ చేశాం. పెళ్లి అంగరంగ వైభవంగా కాకుండా కొద్దిమంది సమక్షంలోనే చేద్దామని ప్లాన్ చేశాం. అందుకే ఇన్విటేషన్ కార్డ్‌లు ప్రింట్ చేయలేదు. పరిమిత అతిథుల కోసం నేను ఇండోర్‌లో హోటల్‌ను కూడా బుక్ చేసాను. ఇంతలో ఐపీఎల్ ఆడే అవకాశం వచ్చింది. ఐపీఎల్ అనంతరం మధ్యప్రదేశ్ తరఫున రంజీ మ్యాచులు ఉన్నాయి. జులైలో రత్లామ్‌కి చెందిన అమ్మాయితో వివాహం చేయాలనుకుంటాం' అని చెప్పారు.