IPL 2022 MI vs CSK: చెన్నై బ్యాటర్లకు చుక్కలు చూపించిన ముంబై బౌలర్లు... ఎమ్మెస్ ధోనీ పోరాడినా...

By Chinthakindhi RamuFirst Published May 12, 2022, 9:05 PM IST
Highlights

చెన్నై సూపర్ కింగ్స్‌ని దారుణంగా దెబ్బతీసిన టెక్నికల్ ప్రాబమ్స్... డీఆర్‌ఎస్ అందుబాటులో లేకపోవడంతో కుప్పకూలిన సీఎస్‌కే టాపార్డర్... ఒంటరిపోరాటం చేసిన చెన్నై సూపర్ కింగ్స్... 

ఐపీఎల్ 2022 ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ చెన్నై సూపర్ కింగ్స్‌ బ్యాట్స్‌మెన్ చేతులు ఎత్తేశారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్‌కి తోడు, ఆటగాళ్ల తప్పిదాల కారణంగా పవర్ ప్లేలో 5 వికెట్లు కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్, 16 ఓవర్లలో 97 పరుగులకి ఆలౌట్ అయ్యింది.

మొదటి ఓవర్ రెండో బంతికి మొదలైన సీఎస్‌కే వికెట్ల పతనం, ఓవర్లలో పరుగులకే ఆలౌట్ అయ్యేదాకా సాగింది. సారథి మహేంద్ర సింగ్ ధోనీ బంతుల్లో పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవడంతో ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది చెన్నై సూపర్ కింగ్స్... 

Latest Videos

స్టేడియంలో పవర్ కట్ ఉన్నందున డీఆర్‌ఎస్ తీసుకునేందుకు అవకాశం లేదంటూ తేల్చేశారు రిఫరీలు... ఇది చెన్నై సూపర్ కింగ్స్‌ను ఘోరంగా దెబ్బ తీసింది. డానియల్ సామ్స్ వేసిన ఇన్నింగ్స్ రెండో బంతికే డివాన్ కాన్వేని ఎల్బీడబ్ల్యూ అవుట్‌గా ప్రకటించాడు అంపైర్... ఎల్బీడబ్ల్యూల విషయాల్లో చాలాసార్లు అంపైర్లు ఇచ్చిన నిర్ణయాలు, రివ్యూలో తారుమారు అయ్యాయి...

అయితే డీఆర్‌ఎస్ తీసుకునే అవకాశం లేకపోవడంతో కాన్వే నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఆ తర్వాత రెండో బంతికే వన్‌డౌన్‌లో వచ్చిన మొయిన్ ఆలీ కూడా డకౌట్ అయ్యాడు... టీవీ రిప్లైలో కాన్వే ఎదుర్కొన్న బంతి, లెగ్ స్టంప్‌ని మిస్ అవుతున్నట్టు కనిపించింది. 

దీంతో కీలక మ్యాచ్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్, చెన్నై సూపర్ కింగ్స్ టాపార్డర్‌ను కకావికలం చేసింది. డానియల్ సామ్స్ బౌలింగ్‌లో హృతిక్ షోకీన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మొయిన్ ఆలీ. మొదటి ఓవర్‌లో వైడ్ల రూపంలో చెన్నై సూపర్ కింగ్స్‌కి 3 పరుగులు రాగా, 2 వికెట్లు కోల్పోయింది. 

ఆ తర్వాత బుమ్రా వేసిన ఓవర్‌లో రాబిన్ ఊతప్ప కూడా ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు..అప్పటికీ డీఆర్‌ఎస్ తీసుకునేందుకు అవకాశం లేకపోవడంతో ఊతప్ప 1 పరుగు చేసి నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. 3 ఓవర్లు ముగిసే సమయానికి 6 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది... 

6 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, డానియల్ సామ్స్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 14 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన అంబటి రాయుడు, రిలే మెడరిత్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరడంతో పవర్ ప్లే ముగిసేలోపు 5 వికెట్లు కోల్పోయింది డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్...  

చెన్నై సూపర్ కింగ్స్, పవర్ ప్లేలో 5 వికెట్లు కోల్పోవడం ఇది మూడోసారి కాగా ఇంతకుముందు కూడా 2020, 2021 సీజన్లలో ముంబై ఇండియన్స్‌పై ఈ దారుణ రికార్డు నెలకొల్పింది సీఎస్‌కే...  9 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసిన శివమ్ దూబే, రిలే మెడరిత్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 39 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్.

ఈ దశలో ఎమ్మెస్ ధోనీతో కలిసి 39 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు డీజే బ్రావో. 15 బంతుల్లో ఓ సిక్సర్‌తో 12 పరుగులు చేసిన డీజే బ్రావో, కుమార్ కార్తీకేయ బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

3 బంతుల్లో 2 పరుగులు చేసిన సిమర్‌జీత్ సింగ్ కూడా కుమార్ కార్తీకేయ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. సిమర్‌జీత్ సింగ్ అవుటయ్యే సమయానికి డీఆర్‌ఎస్ రివ్యూ తీసుకునే అవకాశాన్ని కల్పించారు అంపైర్లు. సిమర్‌జీత్ డీఆర్‌ఎస్ తీసుకున్నా, ఫలితం లేకపోయింది...

మహీశ్ తీక్షణ, రమన్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి డకౌట్ కాగా ముకేశ్ చౌదరి 4 బంతుల్లో 4 పరుగులు చేసి 16వ ఓవర్ ఆఖరి బంతికి రనౌట్ అయ్యాడు. ఎమ్మెస్ ధోనీ 32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

click me!