ముంబైలో కరోనా పంజా, హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచులు..?

By team teluguFirst Published Apr 3, 2021, 6:41 PM IST
Highlights

ఐపీఎల్‌ మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వాల్సిన ముంబయి వాంఖడే స్టేడియం సిబ్బందిలో పది మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు

ముంబయి:  హైదరాబాద్‌లో ఐపీఎల్‌ మ్యాచులపై మళ్లీ ఆశలు రేగుతున్నాయి.  మహారాష్ట్రలో కరోనా వైరస్‌ మహమ్మారి సెకండ్‌ వేవ్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.  ఐపీఎల్‌ మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వాల్సిన ముంబయి వాంఖడే స్టేడియం సిబ్బందిలో పది మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు.  

ఏప్రిల్‌ తొలి వారంలో కొత్త కేసుల నమోదు ఇలాగే కొనసాగితే.. మహారాష్ట్రలో మరోసారి లాక్‌డౌన్‌ విధించటం అనివార్యమని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాకరే ఇప్పటికే పేర్కొన్నారు. 

ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ వేదికగా హైదరాబాద్‌ను  బీసీసీఐ పరిశీలిస్తున్నట్టు సమాచారం.  కరోనా తీవ్రత, లాక్‌డౌన్‌లతో సంబంధం లేకుండా బయో బబుల్‌లో ఐపీఎల్‌ నిర్వహణకు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి బీసీసీఐకి భరోసా లభించినా.. ముంబయి సహా కరోనా సెకండ్‌ వేవ్‌ ఎక్కువగా కనిపిస్తోన్న బెంగళూర్‌, చెన్నైలలో ఎక్కడ సమస్య తలెత్తినా ఆ మ్యాచులను హైదరాబాద్‌కు తరలించేందుకు అవకాశం ఉంది. 

ప్రస్తుతం ముంబయి కేంద్రంగా నాలుగు జట్లు ఐపీఎల్‌ను ఆరంభించనున్నాయి. చెన్నై సూపర్‌కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌లు ముంబయిలో సాధన చేస్తున్నాయి. చెన్నై సూపర్‌కింగ్స్‌ ఏకంగా ఐదు మ్యాచులను వాంఖడేలోనే ఆడాల్సి ఉంది.

బేస్‌ క్యాంప్‌ను ముంబయి నుంచి హైదరాబాద్‌కు తరలించటంపై బీసీసీఐ నుంచి ఈ నాలుగు ప్రాంఛైజీలకు ఎటువంటి సమాచారం రాలేదు. కానీ, ముంబయిలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వాంఖడే మ్యాచులను హైదరాబాద్‌కు తరలించటమే మేలని బీసీసీఐ భావిస్తోంది. ఇదే గనుక జరిగితే హైదరాబాద్ లో ఐపీఎల్ సందడి మొదలవటం తథ్యం. 

click me!