IPL 2020 Qualifier2, SRH VS DC: ఇరు జట్ల గెలుపు అవకాశాలు, వ్యూహాలు ఇవే..!

By team teluguFirst Published Nov 8, 2020, 8:06 AM IST
Highlights

వరుసగా నాలుగు విజయాలతో ఊపుమీదున్న ఆరెంజ్‌ ఆర్మీ దుబాయి టైటిల్‌ పోరుకు చేరుకునేందుకు హాట్‌ ఫేవరేట్‌గా కనిపిస్తోంది. సీజన్‌లో రెండు సార్లు సన్‌రైజర్స్‌ చేతిలో చిత్తుగా ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నేడు ఆరెంజ్‌ ఆర్మీని అడ్డుకోగలదా?!.

అటు వైపు భీకర పేసర్లు కగిసో రబాడ, నోర్క్య. ఇటువైపు సంచలన సీమర్లు సందీప్‌ శర్మ, జేసన్‌ హౌల్డర్‌. నెమ్మదైన పిచ్‌పై బంతితో మాయజాలం చేసేందుకు అటువైపు అశ్విన్‌, అక్షర్‌. మరో ఇటువైపు మాయగాళ్లకే మాయగాడు రషీద్‌ ఖాన్‌. ధనాధన్‌లో అటువైపు ప్రతిభకు కొదవలేదు. కఠిన పరిస్థితుల్లో నిలబడేందుకు ఇటువైపు వరల్డ్‌క్లాస్‌ స్టార్సే ఉన్నారు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల ప్రమాదకారులు ఇరువైపులా ఉన్నారు. 

కాగితంపై సమవుజ్జీలు, మైదానంలో అనూహ్య ప్రదర్శకులు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐపీఎల్‌ 2020 ఫైనల్‌ బెర్త్‌ కోసం నేడు క్వాలిఫయర్‌ 2లో పోటీపడుతున్నాయి. వరుసగా నాలుగు విజయాలతో ఊపుమీదున్న ఆరెంజ్‌ ఆర్మీ దుబాయి టైటిల్‌ పోరుకు చేరుకునేందుకు హాట్‌ ఫేవరేట్‌గా కనిపిస్తోంది. సీజన్‌లో రెండు సార్లు సన్‌రైజర్స్‌ చేతిలో చిత్తుగా ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నేడు ఆరెంజ్‌ ఆర్మీని అడ్డుకోగలదా?!.

లీగ్‌ దశలో తొలి తొమ్మిది మ్యాచుల్లో ఏడు విజయాలు. లీగ్‌ ద్వితీయార్థంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ అత్యుత్తమ ప్రదర్శన చూపిస్తుందని చీఫ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ ఆశించాడు. కానీ, ఢిల్లీ క్యాపిటల్స్‌ అందుకు భిన్నమైన ప్రదర్శన చేసింది. 

లీగ్‌ దశ ఆఖరు ఐదు మ్యాచుల్లో ఢిల్లీ ఏకంగా నాలుగు పరాజయాలు చవిచూసింది. ముంబయి ఇండియన్స్‌తో తొలి క్వాలిఫయర్‌లోనూ చిత్తు చిత్తుగా ఓడింది. తుది జట్టు ఎంపికపైనా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓ స్పష్టత ఉన్నట్టు కనిపించటం లేదు. అయినా, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫైనల్లోకి చేరేందుకు ఓ జట్టుకు ఓ అవకాశం మిగిలే ఉంది. 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ నేడు క్వాలిఫయర్‌ 2లో తాడోపేడో తేల్చుకోనుంది. లీగ్‌ దశ ఆఖర్లో సమిష్టిగా రాణిస్తోన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గొప్పగా కనిపిస్తోంది. ఆ జట్టును అడ్డుకోవటం ఢిల్లీ క్యాపిటల్స్‌కు అంత సులువు కాబోదు. అబుదాబిలో హైదరాబాద్‌, డిల్లీ క్వాలిఫయర్‌ 2 నేడు రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది. 

 

కూర్పుతోనే కుస్తీ! : 

ఢిల్లీ క్యాపిటల్స్‌ లీగ్‌ దశ ఆఖరుకు వచ్చేసరికి భిన్నమైన జట్టుగా మారింది. ఆ జట్టు మ్యాచ్‌ విన్నర్లు సాధారణ ప్రదర్శనలు సైతం చేయలేకపోతున్నారు. కగిసో రబాడ, నోర్క్యలు వికెట్ల వేట పక్కనపెడితే.. పరుగులు పొదుపునూ పట్టించుకోవటం లేదు. ధారాళంగా పరుగులు ఇచ్చుకుంటున్నారు. స్పిన్నర్లు అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌లు పరుగుల పొదుపుకు మాత్రమే పనికొస్తున్నారు. అవసరమైనప్పుడు వికెట్‌ తీయటంలో విఫలమవుతున్నారు. 

ఇక బ్యాటింగ్‌ లైనప్‌లో ఎవరూ ఫామ్‌లో లేరు. రెండు సెంచరీలు బాదిన శిఖర్‌ ధావన్‌.. నిరాశపరుస్తున్నాడు. యువ ఓపెనర్‌ పృథ్వీ షా అవకాశాలను నేలపాలు చేసుకుంటున్నాడు. అజింక్య రహానె ఆడినా, స్ట్రయిక్‌రేట్‌ మెరుగ్గా ఉండటం లేదు. కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌, వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌లు టచ్‌ కోల్పోయారు. 

ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టోయినిస్‌ భీకర ఫామ్‌లో ఉన్నాడు. కానీ అతడికి తోడుగా నిలిచే ఆటగాడే కరువయ్యాడు. పేసర్‌ డానియల్‌ శామ్స్‌ను తొలగించి హర్షల్‌ పటేల్‌ను తీసుకోవటం ద్వారా.. షిమ్రోన్‌ హెట్‌మయర్‌ను లోయర్‌ ఆర్డర్‌లో వాడుకునే వెసులుబాటు లభించనుంది. టాప్‌ ఆర్డర్‌లో పృథ్వీ షా, అజింక్య రహానెలను ఒకరిని తుది జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 

సన్‌రైజర్స్‌కు ఎదురుందా? 

వరుసగా నాలుగు విజయాలతో హైదరాబాద్‌ ఊపుమీదుంది. టాప్‌ ఆర్డర్‌లో డెవిడ్‌ వార్నర్‌, కేన్‌ విలియమ్సన్‌ ఫామ్‌లో ఉన్నారు. గాయపడిన వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ వృద్దిమాన్‌ సాహా, నేటి మ్యాచ్‌కు సైతం అందుబాటులో ఉండే అవకాశం కనిపించటం లేదు. గత మ్యాచ్‌లో విఫలమైన శ్రీవత్స్‌ గోస్వామి నేడూ బరిలోకి దిగనున్నాడు. టాప్‌ ఆర్డర్‌, బౌలింగ్‌ లైనప్‌.టాప్‌ గేర్‌లో ఉన్నాయి. 

కానీ మిడిల్‌ ఆర్డరే సమస్యగా మిగిలిపోయింది. ఎలిమినేటర్‌లో హైదరాబాద్‌ మిడిల్‌ ఆర్డర్‌ నిలబడింది. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, వెస్టిండీస్‌ కెప్టెన్‌ జేసన్‌ హౌల్డర్‌లు ఆఖరు వరకూ క్రీజులో నిలిచి హైదరాబాద్‌కు క్వాలిఫయర్‌కు చేర్చారు. ప్రియమ్‌ గార్గ్‌ స్పిన్‌ వలలో చిక్కుకుని వికెట్‌ కోల్పోయాడు. కీలక క్వాలిఫయర్‌లో మనీశ్‌ పాండే, గార్గ్‌, అబ్దుల్‌ సమద్‌లు బ్యాటింగ్‌లో బాధ్యత తీసుకోవాలి. బౌలింగ్‌ విభాగంలో హైదరాబాద్‌కు ఎలాగూ తిరుగులేదు. 

ఢిల్లీకి రషీద్‌ ఫోబియా!

ఐపీఎల్‌ 2020లో హైదరాబాద్‌ ఇప్పటికే రెండు సార్లు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. అబుదాబిలో జరిగిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ 162/4 పరుగులు చేయగా.. ఛేదనలో ఢిల్లీని రషీద్‌ ఖాన్‌ తిప్పేశాడు. 3/14 మ్యాజిక్‌తో క్యాపిటల్స్‌ను కట్టడి చేశాడు. ఆ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 15 పరుగులతో గెలుపొందింది. 

ఇక దుబాయిలో జరిగిన మరో మ్యాచ్‌లోనూ రషీద్‌ ఖాన్‌ 3/7తో రెచ్చిపోయాడు. ఆ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 88 పరుగుల తేడాతో గెలుపొందింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అందరూ రషీద్‌ ఖాన్‌పై ఆడేందుకు ఇబ్బందిపడేవారే. అనుకూలమైన యుఏఈ పరిస్థితుల్లో రషీద్‌ ఖాన్‌ ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు. నేడు అబుదాబి క్వాలిఫయర్‌లోనూ రషీద్‌ ఖాన్‌ను దాటితేనే ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం గురించి ఆలోచన చేయగలదు. 

పిచ్‌, వాతావరణం

అబుదాబిలో ఐదు పిచ్‌లు ఉన్నాయి. నేటి మ్యాచ్‌కు ఉపయోగించే పిచ్‌ నెమ్మదిగా స్పందించనుంది. ఇక్కడ ఇప్పటికే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ను ఓడించిన హైదరాబాద్‌కు పరిస్థితులపై మెరుగైన అవగాహన ఏర్పడింది. ఒత్తిడితో కూడిన క్వాలిఫయర్‌2లో 150 పరుగులు గెలుపుపై భరోసా కల్పించగలవు!. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావంపై స్పష్టత లేదు. 

తుది జట్లు (అంచనా)

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

డెవిడ్‌ వార్నర్‌ (కెప్టెన్‌), శ్రీవాట్స్‌ గోస్వామి (వికెట్‌ కీపర్‌), మనీశ్‌ పాండే, కేన్‌ విలియమ్సన్‌, ప్రియమ్‌ గార్గ్‌, జేసన్‌ హౌల్డర్‌, అబ్దుల్‌ సమద్‌, రషీద్‌ ఖాన్‌, షాబాజ్‌ నదీమ్‌, సందీప్‌ శర్మ, నటరాజన్‌. 

ఢిల్లీ క్యాపిటల్స్‌ 

శిఖర్‌ ధావన్‌, అజింక్య రహానె, శ్రేయాస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), షిమ్రోన్‌ హెట్‌మయర్‌, రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), మార్కస్‌ స్టోయినిస్‌, హర్షల్‌ పటేల్‌, అక్షర్‌ పటేల్‌, కగిసో రబాడ, రవిచంద్రన్‌ అశ్విన్‌, నోర్క్య. 

click me!