
కరోనా కారణంగా భారత్‌లో ఏప్రిల్ నెలలో జరగాల్సిన ఐపీఎల్ కాస్తా వాయిదా పడింది. దుబాయ్ వేదికగా మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఈ మెగా క్రికెట్ ఈవెంట్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు భారత క్రికెటర్లతో పాటు న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా క్రికెటర్లు దుబాయ్ చేరుకుని ప్రాక్టీస్ చేస్తున్నారు.
అయితే ఉష్ణమండల ప్రాంతమైన దుబాయ్ వాతావరణం క్రికెటర్లకు పెద్ద సమస్యగా మారింది. న్యూజిలాండ్‌లో ఇప్పుడు చలికాలం, భారత్‌లో వర్షాకాలం... దుబాయ్‌లో మాత్రం ఎప్పుడూ మండే కాలమే. ప్రస్తుతం దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటోందక్కడ.
క్వారంటైన్ కోసం రెండు వారాల ముందే అక్కడికి వెళ్లిన భారత క్రికెటర్లు ఈ వాతావరణాన్ని అలవాటు పడినా, మిగిలిన క్రికెటర్లకు చాలా ఇబ్బందిగా మారిందట.
‘ఇక్కడి వాతావరణానికి అలవాటు పడాలంటే చాలా సమయం కావాలి. ప్రాక్టీస్ బాగానే నడుస్తున్నా, మ్యాచ్‌లు మొదలైతే కానీ అసలు విషయం తెలీదు. చలికాలం నుంచి ఒక్కసారిగా ఎండాకాలంలోకి అడుగుపెడితే, ఆరోగ్యం కూడా పాడవుతుంది కదా’ అన్నాడు కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్.