ఐపీఎల్ 2020: తండ్రి మరణించినా అతను బరిలోకి దిగి...

By telugu teamFirst Published Oct 26, 2020, 7:31 AM IST
Highlights

తండ్రి మరణించిన విషాదాన్ని దిగమింగి పంజాబ్ బ్యాట్స్ మన్ మన్ దీప్ సింగ్ బ్యాటింగ్ కు దిగాడు. ఈ విషయం తెలిసి సచిన్ టెండూల్కర్ మన్ దీప్ సింగ్ ను ప్రశంసించాడు.

దుబాయ్: తండ్రి మరణించిన విషాదాన్ని దిగ మింగి కింగ్స్ ఎలెవన్ బ్యాట్స్ మన్ మన్ దీప్ సింగ్ బరిలోకి దిగాడు. అతనిపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. నెటిజన్లు కూడా అతన్ని కొనియాడుతున్నారు. శనివారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచులో పంజాబ్ టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. 

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఏడు వికెట్ల నష్టానికి 126 పరుగులుచేసింది. కెఎల్ రాహుల్ కు జోడీగా మన్ దీప్ సింగ్ ఓపెనర్ గా దిగి 17 పరుగులుచేశాడు. అంతకు ముందు రోజు రాత్రే అతని తండ్రి హర్ దేవ్ సింగ్ అనారోగ్యంతో మరణించాడు. 

శనివారం మధ్యాహ్నం మన్ దీప్ సింగ్ వీడియో కాల్ ద్వారా తన తండ్రి అంత్యక్రియలను చూశాడు. ఆ తర్వాత సాయంత్రం మ్యాచు ఆడాడు. ఈ విషయాన్ని పంజాబ్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. దానిపై సచిన్ టెండూల్కర్ స్పందించాడు. 

ప్రియమైనవారిని కోల్పోవడం బాధగా ఉుటుందని, మరీ దారుణమైన పరిస్థితి ఏమిటంటే చివరి చూపులకు కూడా నోచుకోకపోవడమని ఆయన అన్నారు. మన్ దీప్, నితీష్ రాణా కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి తెలియజేశారు. 

కోల్ కతా బ్యాట్స్ మన్ నితీష్ రాణా కుటుంబంలో ముందు రోజు విషాద సంఘటన చోటు చేసుకుంది. అతని మామ సురేందర్ మరణించాడు. ఆ బాధలోనే రాణా మ్యాచ్ ఆడుడు. అర్థ సెంచరీ పూర్తి చేసిన తర్వాత సురేందర్ పేరుతో ఉన్న జెర్సీని చూపిస్తూ తన ఆటను మామయ్యకు అంకితమిచ్చాడు. 

కాగా, 1999 ప్రపంచ కప్ సందర్భంలో సచిన్ టెండూల్కర్ కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. తన తండ్రి రమేష్ టెండూల్కర్ మరణించడంతో ఆయన ముంబైకి తిరిగి వచ్చాడు. తండ్రి అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఇంగ్లాండు వెళ్లి కెన్యాపై జరిగిన మ్యాచులో ఆడి సెంచరీ చేశాడు. 

click me!