బుమ్రా ఖాతాలో చెత్త రికార్డు... భారత స్టార్ పేసర్‌కి ఏమైంది...

By team teluguFirst Published Sep 20, 2020, 5:28 PM IST
Highlights

బుమ్రాను పక్కనబెట్టి, తొలి ఓవర్ వేసేందుకు ట్రెంట్ బౌల్ట్‌ను ఎంచుకున్న రోహిత్ శర్మ...

ఆరో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన బుమ్రా...

ముంబై జట్టులో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్‌గా బుమ్రా... 

భారత క్రికెట్ అందించిన స్టార్ పేసర్లలో జస్ప్రిత్ బుమ్రా ఒకడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌ ర్యాంకు అధిరోహించిన ఈ భారత బౌలర్, డెత్ బౌలర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంలో దిట్ట. అయితే కొద్దికాలంగా బుమ్.. బుమ్... బుమ్రా బౌలింగ్ గతి తప్పినట్టుగా అనిపిస్తోంది. ముఖ్యంగా బుమ్రా లాంటి స్టార్‌ను పెట్టుకుని కూడా రోహిత్ శర్మ, మొదటి ఓవర్ వేసేందుకు ట్రెంట్ బౌల్ట్‌ని ఎంచుకున్నాడు. బౌల్ట్ ప్రస్తుతం ఐసీసీ టాప్ బౌలర్ కావచ్చు కానీ మొదటి ఓవర్‌లో మ్యాజిక్ చేయడంలో బుమ్రా తీరే సెపరేటు. 

ఆఖరికి ఆరో ఓవర్‌లో బంతి అందుకున్న బుమ్రా... వికెట్లను తీయలేకపోగా ధారాళంగా పరుగులు ఇచ్చాడు. 4 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు. ముంబై బౌలర్లలో అత్యదిక పరుగులు ఇచ్చింది బుమ్రానే. అదీకాకుండా బుమ్రా ఖాతాలో మరో చెత్తరికార్డు కూడా చేరింది. ఐపీఎల్ కెరీర్‌లో అత్యధిక సార్లు సీజన్‌లో మొట్టమొదటి నో బాల్ వేసిన బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఆరో ఓవర్ ఆఖరి బంతికి నో బాల్ వేశాడు బుమ్రా. ఆ బంతిని బౌండరీకి పంపిన అంబటి రాయుడు, ఆ తర్వాత ఫ్రీ హిట్ బంతిని సిక్సర్‌గా మలిచాడు.

ఎలాంటి బ్యాట్స్‌మెన్‌కైనా తన యార్కర్లతో చుక్కలు చూపించే బుమ్రా, అంబటి రాయుడి లాంటి సాధారణ క్రికెటర్‌కి ధారాళంగా పరుగులు సమర్పించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2016, 2018 సీజన్లలో మొట్టమొదటి నో బాల్ వేసిన బుమ్రా, ఈ సీజన్‌లో కూడా తొలి ‘నో బాల్’ నమోదుచేశాడు. 13 సీజన్ల ఐపీఎల్‌లో ఇన్నిసార్లు మొట్టమొదటి నో బాల్ వేసిన ఏకైక బౌలర్ బుమ్రానే. 

click me!