
ఐపీఎల్‌లో ప్లేఆఫ్‌కు వెళ్లేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వున్న అవకాశాలపై వరుణుడు నీళ్లు చల్లాడు. మంగళవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.
ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండటంతో మ్యాచ్‌ను 5 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ముందుగా బ్యటింగ్ చేసిన బెంగళూరుకు ఓపెనర్లు డివిలియర్స్, విరాట్ కోహ్లీ మెరుపు ఆరంభాన్నిచ్చారు.
ఇద్దరు తొలి ఓవర్‌లోనే విజృంభించడంతో 23 పరుగులు వచ్చాయి. దంతో స్కోరు 100 దాటుతుందని అభిమానులు ఆశించారు. అయితే శ్రేయస్ గోపాల్ వరుస బంతుల్లో కోహ్లీ, డివిలియర్స్, స్టోయినిస్‌ను ఔట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు.
ఆ తర్వాత వచ్చిన వాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో బెంగళూరు నిర్ణీత 5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో శ్రేయస్ గోపాల్ 3, థామస్ 2, రియాన్ పరాగ్, ఉనద్కత్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ 3.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 41 పరుగులు చేసిన స్థితిలో వర్షం మళ్లీ పడటంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ఎంపైర్లు ప్రకటించి ఇరు జట్లకు తలో పాయింట్ ఇచ్చారు.
11 బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన పరిస్ధితుల్లో వర్షం పడకుండా ఉండివుంటే ఫలితం వేరేలా ఉండేది. దీంతో బెంగళూరుకు ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. అయితే 11 పాయింట్లతో రాజస్థాన్ ప్లే ఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది.