INDvsWI 3rd T20I: టాస్ గెలిచిన టీమిండియా... జడేజా ప్లేస్‌లో దీపక్ హుడా..

By Chinthakindhi RamuFirst Published Aug 2, 2022, 9:07 PM IST
Highlights

భద్రతా కారణాల వల్ల గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైన మూడో టీ20... టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ.. 

వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. తొలి రెండు టీ20ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నేటి మ్యాచ్‌లో ఛేదనలో బలాన్ని పరీక్షించుకోనుంది. 

తొలి టీ20లో భారత జట్టు 68 పరుగుల తేడాతో భారీ విజయం అందుకోగా, రెండో టీ20 మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఆఖరి ఓవర్‌లో విజయాన్ని అందుకుని సిరీస్‌ని 1-1 తేడాతో సమం చేసింది వెస్టిండీస్... సెయింట్ కిట్స్‌లో జరిగిన రెండో టీ20లో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమైనా బౌలర్లు అద్భుతంగా పోరాడడంతో మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ భరితంగా సాగింది... 

సెయింట్ కిట్స్‌లో జరిగిన రెండో టీ20 షెడ్యూల్ కంటే మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభం కాగా, మూడో టీ20 మ్యాచ్‌ని భద్రతా కారణాలతో గంటన్నర సేపు వాయిదా వేసింది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. ఈ మ్యాచ్ తర్వాత మిగిలిన రెండు మ్యాచులు అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరగబోతున్నాయి...

నేటి మ్యాచ్‌లో రవీంద్ర జడేజాకి రెస్ట్ ఇచ్చిన టీమిండియా, అతని స్థానంలో దీపక్ హుడాకి తుది జట్టులో అవకాశం కల్పించింది. తొలి రెండు టీ20ల్లో పెద్దగా సక్సెస్ కాకపోయినా నేటి మ్యాచ్‌లో కూడా సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. 

గత మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో 10 పరుగులు నియంత్రించడంలో విఫలమైనా ఆవేశ్ ఖాన్‌కి మరో అవకాశం ఇచ్చింది టీమిండియా. నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు 2-1 తేడాతో యూఎస‌ఏకి పయనమవుతుంది. నాలుగు రోజుల బ్రేక్ వస్తుండడంతో ఈ ఆధిక్యం... నూతనోత్సాహాన్ని ఇచ్చేందుకు ఉపయోగపడుతుందని ఇరు జట్లు భావిస్తున్నాయి. రెండో టీ20లో ఓబెడ్ మెక్‌కాయ్ ఏకంగా 6 వికెట్లు తీసి భారత జట్టు ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 

నేటి మ్యాచ్‌లో అతన్ని భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. అలాగే గత మ్యాచ్‌లో డెత్ ఓవర్లలో అద్భుత స్పెల్‌తో సత్తా చాటిన అర్ష్‌దీప్ సింగ్ పర్ఫామెన్స్‌పై సెలక్టర్లు దృష్టి పెట్టారు. అతను నేటి మ్యాచ్‌లో మరోసారి మంచి బౌలింగ్ కనబరిస్తే, టీ20 వరల్డ్ కప్ 2022 జట్టులోనూ చోటు దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి..

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ ( వికెట్ కీపర్), దీపక్ హుడా, దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్

వెస్టిండీస్ జట్టు: బ్రెండన్ కింగ్, కేల్ మేయర్స్, నికోలస్ పూరన్ (కెప్టెన్), సిమ్రాన్ హెట్మయర్, డివాన్ థామస్ (వికెట్ కీపర్), రోవ్‌మెన్ పావెల్, డొమెనిక్ డ్రాక్స్, జాసన్ హోల్డర్, అకీల్ హుస్సేన్, అల్జెరీ జోసఫ్, ఓబెడ్ మెక్‌కాయ్

click me!