INDvsWI 3rd ODI: టాస్ గెలిచిన రోహిత్ శర్మ... నాలుగు మార్పులతోో టీమిండియా...

Published : Feb 11, 2022, 01:05 PM ISTUpdated : Feb 11, 2022, 01:14 PM IST
INDvsWI 3rd ODI:  టాస్ గెలిచిన రోహిత్ శర్మ... నాలుగు మార్పులతోో టీమిండియా...

సారాంశం

మూడో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ... వరుసగా రెండో వన్డేలోనూ వెస్టిండీస్‌ కెప్టెన్ కిరన్ పోలార్డ్ దూరం...

వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ... బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి రెండు వన్డేల్లో విజయం సాధించిన భారత జట్టు నయా సారథి రోహిత్ శర్మ, పూర్తి స్థాయి కెప్టెన్‌గా టీ20, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్నాడు. టీ20 కెప్టెన్‌గా స్వదేశంలో న్యూజిలాండ్‌ను క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ శర్మ, వన్డే ఫార్మాట్‌లోనూ అదే ఫీట్ రిపీట్ చేయాలని భావిస్తున్నాడు...

తొలి రెండు వన్డేల్లోనూ పెద్దగా పరుగులు చేయలేకపోయిన భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై భారీ అంచనాలే ఉన్నాయి. విండీస్‌పై వన్డేల్లో విరాట్ కోహ్లీకి తిరుగులేని రికార్డు ఉంది. వెస్టిండీస్‌పై 2 వేలకు పైగా వన్డే పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ, రెండు వన్డేల్లో కలిసి 26 పరుగులు మాత్రమే చేయగలిగాడు...మూడో వన్డేలో అయినా విరాట్ కోహ్లీ బ్యాటు నుంచి సెంచరీ వస్తే, చూడాలని కోరుకుంటున్నారు అభిమానులు...

రెండో వన్డేలో రిషబ్ పంత్‌ని ఓపెనర్‌గా పంపించి టీమిండియా చేసిన ప్రయోగం ఘోరంగా ఫెయిల్ అయింది. దీంతో అలాంటి ప్రయోగాలకు పోకుండా మూడో వన్డేలో సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ ఓపెనర్‌గా రాబోతున్నాడు. గాయం కారణంగా రెండో వన్డేకి దూరమైన వెస్టిండీస్ ఆల్‌రౌండర్, కెప్టెన్ కిరన్ పోలార్డ్, మూడో వన్డేలో కూడా బరిలో దిగడం లేదు.

పోలార్డ్ స్థానంలో నికోలస్ పూరన్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. కెఎల్ రాహుల్‌తో పాటు దీపక్ హుడా, యజ్వేంద్ర చాహాల్‌లను తప్పించిన టీమిండియా మేనేజ్‌మెంట్, వారి స్థానంలో కుల్దీప్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్‌లకు చోటు కల్పించింది. అలాగే శార్దూల్ ఠాకూర్ స్థానంలో దీపక్ చాహార్‌కి చోటు కల్పించింది భారత జట్టు.. 

శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా రాబోతుంటే, శ్రేయాస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి రాబోతున్నాడు. మొదటి రెండు మ్యాచుల్లో బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో రాణించినప్పటికీ మూడో వన్డేలో దీపక్ హుడాని తప్పించడం విశేషం...

కరోనా నుంచి కోలుకున్నప్పటికీ యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కి నేటి మ్యాచ్‌లో కూడా అవకాశం దక్కలేదు. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచి, ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ, విజయ్ హాజారే ట్రోఫీల్లో పరుగుల వరద పారించిన రుతురాజ్ గైక్వాడ్... అప్పటి నుంచి టీమిండియాలో ఒక్క అవకాశం కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు...

విండీస్ జట్టు ఒకే ఒక్క మార్పుతో మూడో వన్డే బరిలో దిగుతోంది. బౌలర్ అకీల్ హుస్సేన్ స్థానంలో హేడెన్ వాల్ష్‌కి తుదిజట్టులో చోటు కల్పించింది విండీస్.  

వెస్టిండీస్ జట్టు: షై హోప్ (వికెట్ కీపర్), బ్రెండన్ కింగ్, డారెన్ బ్రావో, షమ్రా బ్రూక్స్, నికోలస్ పూరన్ (కెప్టెన్), జాసన్ హోల్డర్, ఫ్యాబియన్ ఆలెన్, ఓడెన్ స్మిత్, అల్జెరీ జోసఫ్, హేడెన్ వాల్ష్, కీమర్ రోచ్

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !