శివాలెత్తిన మావి.. రాణించిన ఉమ్రాన్ మాలిక్.. ఉత్కంఠ పోరులో టీమిండియాదే గెలుపు..

By Srinivas MFirst Published Jan 3, 2023, 10:45 PM IST
Highlights

INDvsSL Live: కొత్త ఏడాదిని యువ భారత్ విజయంతో ఆరంభించింది.   శ్రీలంకతో ముంబైలోని వాంఖెడే వేదికగా ముగిసిన తొలి టీ20లో బ్యాటర్లు విఫలమైనా  బౌలర్లు  సమిష్టిగా రాణించి టీమిండియాకు  విజయాన్ని అందించారు.  అరంగేట్ర కుర్రాడు శివమ్ మావి నాలుగు వికెట్లు తీసి అదరగొట్టాడు. 
 

బ్యాటర్లు విఫలమైనా తొలి టీ20లో  టీమిండియా బౌలర్లు ఆదుకున్నారు.   తన కెరీర్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న  శివమ్ మావి.. నాలుగు వికెట్లు తీసి లంక బ్యాటింగ్  లైనప్ వెన్ను విరిచాడు.   అతడికి తోడు జమ్మూ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ కూడా  రాణించడంతో తొలి టీ20లో టీమిండియా బోణీ కొట్టింది. భారత్ నిర్దేశించిన   163 పరుగుల లక్ష్య ఛేదనలో   శ్రీలంక.. 160 పరుగుల వద్దే ఆగిపోయింది. దసున్ శనక, చమీక కరుణరత్నె (16 బంతుల్లో 23 నాటౌట్) చివరి వరకూ పోరాడినా విజయం దక్కలేదు.  ఫలితంగా భారత్.. 2 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. 

మోస్తారు లక్ష్య ఛేదనలో లంక కూడా తడబడింది.  హార్ధిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్లో మూడు పరుగులే రాగా కెరీర్ లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న శివమ్ మావి.. తన మొదటి ఓవర్లోనే వికెట్ పడగొట్టాడు. లంక ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన మావి బౌలింగ్ లో  కుశాల్ మెండిస్ (25 బంతుల్లో 28, 5 ఫోర్లు)  వరుసగా రెండు ఫోర్లు బాదాడు.  కానీ ఐదో బంతికి  మావి.. పతుమ్ నిస్సంక(1) ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 

తన రెండో ఓవర్లో కూడా మావి.. మూడు, నాలుగు బంతులకు ధనుంజయ డిసిల్వ బౌండరీలు బాదాడు. కానీ ఐదో బంతి అతడి బ్యాట్ ఎడ్జ్ కు తాకి ద అక్కడే  పైకి లేవడంతో సంజూ శాంసన్ క్యాచ్ అందుకున్నాడు. తొలి పవర్ ప్లే (ఆరు ఓవర్లు) ముగిసేసరికి లంక స్కోరు.. 2 వికెట్లకు 35 పరుగులు. 

నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన చరిత్ అసలంక  (12) ఓ ఫోర్, సిక్సర్ కొట్టి  జోరు మీద కనిపించినా   ఉమ్రాన్ మాలిక్ అతడి పని పట్టాడు.  అతడు వేసిన 8వ ఓవర్ ఐదో బంతికి అసలంక భారీ షాట్ ఆడాడు. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ పరిగెత్తుకుంటూ అద్భుతంగా డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు.  

ఒకవైపు వికెట్లు పడుతున్నా  క్రీజులో నిలదొక్కుకునేందుకు యత్నించిన  కుశాల్ మెండిస్ ను  హర్షల్ పటేల్ తాను వేసిన తొలి ఓవర్లోనే   ఔట్ చేశాడు.  హర్షల్ వేసిన 9వ ఓవర్ తొలి బంతికి ఫోర్ కొట్టిన మెండిస్.. రెండో బంతికి స్వీపర్ కవర్ వద్ద ఉన్న  శాంసన్ కు దొరికిపోయాడు. ఫలితంగా లంక నాలుగు వికెట్ ను కోల్పోయింది. పది ఓవర్లకు లంక.. 4 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. 

ఇక లంక భారీ ఆశలు పెట్టుకున్న భానుక రాజపక్స (10) ను హర్షల్ బోల్తొ కొట్టించాడు.  అతడు వేసిన 11వ ఓవర్ నాలుగో బంతికి  ఇచ్చిన క్యాచ్ ను మిడాఫ్ వద్ద వెనక్కి పరిగెడుతూ హార్ధిక్ క్యాచ్ అందుకున్నాడు.  ఈ క్రమంలో  బ్యాటింగ్ కు వచ్చిన  హసరంగ (10 బంతుల్లో 21, 2 సిక్సర్లు, 1 ఫోర్)  దూకుడుగా ఆడాడు.  ఉమ్రాన్ మాలిక్ వేసిన 13వ ఓవర్ చివరి బంతికి బౌండరీ బాదిన అతడు.. చాహల్ వేసిన  14వ ఓవర్లో రెండు బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు బాది  లంక స్కోరును వంద దాటించాడు. అయితే శివమ్ మావి వేసిన 15వ ఓవర్లో తొలుత రనౌట్ నుంచి తప్పించుకున్న అతడు.. మూడో బంతికి హార్ధిక్ పాండ్యా కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  

ఉమ్రాన్.. 155 స్పీడ్‌కు శనకకు చుక్కలు 

చివరి ఐదు ఓవర్లలో 53 పరుగులు చేయాల్సి ఉండగా.. క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా కెప్టెన్ దసున్ శనక (27 బంతుల్లో 45, 3 సిక్సర్లు, 3 ఫోర్లు)  క్రీజులో ఉండటంతో లంక ఆశలన్నీ అతడి మీదే ఉన్నాయి.   కానీ ఉమ్రాన్ మాలిక్ వేసిన 17వ ఓవర్  నాలుగో బంతికి అతడు చాహల్ కు క్యాచ్ ఇచ్చి పెవలియన్ చేరాడు. ఈ బంతి వేగం స్పీడ్ మీటర్ లో 155 కేపీహెచ్ (కిలోమీటర్ పర్ హవర్)  గా నమోదవడం గమనార్హం. 

చివర్లో ఉత్కంఠ.. 

ఆ  తర్వాత మావి.. తన చివరి ఓవర్లో మహేశ్ తీక్షణను ఔట్ చేసి అరంగేట్ర మ్యాచ్ లోనే నాలుగు వికెట్లు తీశాడు.  ఈ మ్యాచ్ లో అతడు నాలుగు ఓవర్లు వేసి  22 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇక చివరి ఓవర్ లో 13 పరుగులు కావాల్సి ఉండగా చమీక  ఓ భారీ సిక్సర్ బాదాడు. సమీకరణం 3 బంతుల్లో ఐదు పరుగులు. ఐదో బంతికి రజిత (5) రనౌట్ అయ్యాడు. చివరి బంతికి నాలుగు పరుగులు కావాల్సి ఉండగా..  చమీక భారీ షాట్ ఆడినా  దానికి ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. రెండో పరుగు కోసం యత్నించగా .. మధుశనక రనౌట్ అయ్యాడు. ఫలితంగా భారత్ రెండు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. 

అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో   ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.  భారత బ్యాటర్లలో దీపక్ హుడా (41 నాటౌట్), ఇషాన్ కిషన్ (37) రాణించారు.  అక్షర్ పటేల్ (31 నాటౌట్), హార్దిక్ పాండ్యా (29) లు ఫర్వాలేదనిపించారు.  భారీ ఆశలు పెట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ (7)  సహా సంజూ శాంసన్ (5) లు విఫలమయ్యారు. 

click me!