INDvsNZ 1st Test: శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ... తొలి టెస్టు, తొలి సెషన్‌లో ఆధిక్యం మనదే...

By Chinthakindhi RamuFirst Published Nov 25, 2021, 11:37 AM IST
Highlights

India vs New Zealand 1st Test: తొలి టెస్టు తొలి సెషన్‌లో పూర్తి ఆధిపత్యం కనబర్చిన టీమిండియా... శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ, ఛతేశ్వర్ పూజారా జిడ్డు బ్యాటింగ్...

న్యూజిలాండ్‌తో కాన్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకి శుభారంభం దక్కింది. తొలి సెషన్‌లో ఒక్క వికెట్ కోల్పోయిన భారత జట్టు 82 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ గైర్హజరీతో ఓపెనర్‌గా ఎంట్రీ ఇచ్చిన మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్ తొలి వికెట్‌కి 21 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మూడో ఓవర్‌ మూడో బంతికే శుబ్‌మన్ గిల్‌ను ఎల్బీడబ్ల్యూ అవుట్‌గా ప్రకటించాడు అంపైర్. అప్పటికి భారత జట్టు స్కోరు 3 పరుగులు మాత్రమే. అయితే డీఆర్‌ఎస్ తీసుకున్న శుబ్‌మన్ గిల్‌కి అనుకూలంగా ఫలితం దక్కింది. రిప్లైలో గిల్ బ్యాట్‌కి బంతి ఎడ్జ్ తీసుకున్నట్టు స్పష్టంగా కనిపించింది. 

Read: ఆ ఇద్దరూ రాణిస్తే, టీమిండియాకి పెద్ద సమస్యే... మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్ స్థానాలపై...

28 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్, కేల్ జెమ్మీసన్ బౌలింగ్‌లో బ్లండెల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. గత 12 ఇన్నింగ్స్‌ల్లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేసిన మయాంక్ అగర్వాల్, 11 ఇన్నింగ్స్‌ల్లో స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరాడు... ఇందులో ఆరు ఇన్నింగ్స్‌ల్లో డబుల్ డిజిట్ స్కోరు కూడా చేరుకోలేకపోయాడు మయాంక్ అగర్వాల్...

81 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న శుబ్‌మన్ గిల్, అతిపిన్న వయసులో కివీస్‌పై హాఫ్ సెంచరీ చేసిన ఐదో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల 91 రోజుల వయసులో ఈ ఫీట్ సాధించగా, పృథ్వీ షా, కాంట్రాక్టర్, అథుల్ వాసన్ టాప్ 4లో ఉన్నారు. 22 ఏళ్ల 78 రోజుల వయసున్న శుబ్‌మన్ గిల్ టాప్ 5లో చోటు దక్కించుకున్నాడు...

కాన్పూర్‌లో హాఫ్ సెంచరీ చేసిన రెండో అతిపిన్న వయసున్న భారత ఓపెనర్‌ శుబ్‌మన్ గిల్. ఇంతకుముందు 21 ఏళ్ల 288 రోజుల వయసులో జయసింహా హాఫ్ సెంచరీ చేశాడు...

ఆస్ట్రేలియాపై, ఇంగ్లాండ్‌పై హాఫ్ సెంచరీ చేసిన శుబ్‌మన్ గిల్, ఇప్పుడు న్యూజిలాండ్‌పై కూడా ఈ ఫీట్ రిపీట్ చేశాడు. 23 ఏళ్ల లోపే 4 హాఫ్ సెంచరీలు చేసిన శుబ్‌మన్ గిల్, సునీల్ గవాస్కర్ (9). దినేశ్ కార్తీక్ (6), ఎంఎల్ జయసింహా (5) తర్వాతి స్థానంలో నిలిచాడు. 

21 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన దశలో శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా కలిసి రెండో వికెట్‌కి 61 పరుగులు జోడించారు. ఛతేశ్వర్ పూజారా తన స్టైల్‌లో జిడ్డు బ్యాటింగ్‌తో క్రీజులో నిలదొక్కుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నాడు...

తొలి సెషన్ ముగిసే సమయానికి 29 ఓవర్లలో ఓ వికెట్ కోల్పోయిన భారత జట్టు 2.83 రన్‌రేట్‌తో 82 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ 87 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 52 పరుగులు, ఛతేశ్వర్ పూజారా 61 బంతుల్లో 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ శతాధిక భాగస్వామ్యం నమోదు చేస్తే, భారత జట్టు భారీ స్కోరు చేసేందుకు అవకాశాలు పెరుగుతాయి...

Read Also: కివీస్ జట్టులో ఇద్దరు భారత ప్లేయర్లు... రచిన్ రవీంద్రకు అనంతపురంతో లింక్, మరి అజాజ్ పటేల్

click me!