INDvsENG 5th Test: రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ... వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా...

By Chinthakindhi RamuFirst Published Jul 4, 2022, 4:18 PM IST
Highlights

India vs England 5th Test Day 4: 66 పరుగులు చేసి అవుటైన ఛతేశ్వర్ పూజారా... 57 పరుగులు చేసిన రిషబ్ పంత్... పంత్ అవుటయ్యే సమయానికి 330 పరుగుల ఆధిక్యంలో భారతజట్టు...

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో టెస్టులో భారత జట్టు పట్టు సాధిస్తోంది. ఓవర్‌నైట్ స్కోరు 125/3 వద్ద నాలుగో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టు, భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఛతేశ్వర్ పూజారా, రిషబ్ పంత్ కలిసి నాలుగో వికెట్‌కి 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

టెస్టుల్లో 33వ హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఛతేశ్వర్ పూజారా 168 బంతుల్లో 8 ఫోర్లతో 66 పరుగులు చేసి స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో అలెక్స్ లీస్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...  విదేశాల్లో 100కి పైగా బంతులను ఫేస్ చేయడం ఛతేశ్వర్ పూజారాకి ఇది 24వ సారి. రాహుల్ ద్రావిడ్ (38 సార్లు), సచిన్ టెండూల్కర్ (32 సార్లు), విరాట్ కోహ్లీ (25 సార్లు) మాత్రమే పూజారా కంటే ముందున్నారు...

2021 నుంచి ఛతేశ్వర్ పూజారాకి ఇది 8వ హాఫ్ సెంచరీ. టీమిండియా తరుపున గత రెండేళ్లలో అత్యధిక టెస్టు హాఫ్ సెంచరీలు చేసిన భారత ప్లేయర్‌గా టాప్‌లో నిలిచాడు ఛతేశ్వర్ పూజారా. రిషబ్ పంత్ 7 హాఫ్ సెంచరీలతో తర్వాతి స్థానంలో ఉండడం విశేషం...  SENA దేశాల్లో పూజారాకి ఇది 18వ హాఫ్ సెంచరీ.

పూజారా అవుటైన తర్వాత రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌తో పోలిస్తే నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్ 77 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులు చేసిన రిషబ్ప పంత్, రెండో ఇన్నింగ్స్‌లో 50+ స్కోరు చేసి... విదేశాల్లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు. 

ఇంతకుముందు భారత వికెట్ కీపర్లు ఎవ్వరూ విదేశాల్లో ఈ ఫీట్ సాధించలేకపోగా, స్వదేశంలో ఒకే ఒక్క భారత వికెట్ కీపర్ ఈ ఫీట్ సాధించాడు. 1973లో భారత మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజనీర్, ముంబైలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 121, రెండో ఇన్నింగ్స్‌లో 66 పరుగులు చేశాడు. 

పూజారా అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్, 26 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేసి మ్యాటీ పాట్స్ బౌలింగ్‌లో జేమ్స్ అండర్సన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 190 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది భారత జట్టు... 

86 బంతుల్లో 8 ఫోర్లతో 57 పరుగులు చేసిన రిషబ్ పంత్, జాక్ లీచ్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌కి ప్రయత్నించి జో రూట్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రిషబ్ పంత్ అవుటయ్యే సమయానికి 6 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసిన భారత జట్టు 330 పరుగుల ఆధిక్యంలో ఉంది...

ఎడ్జబాస్టన్‌లో ఇప్పటిదాకా విజయవంతంగా ఛేదించిన టార్గెట్ 281 పరుగులు మాత్రమే. ఆ స్కోరును ఎప్పుడో అధిగమించింది భారత జట్టు. అయితే గత మూడు మ్యాచుల్లో ఇంగ్లాండ్ ఆటతీరు కారణంగా నాలుగో ఇన్నింగ్స్‌లో 400+ టార్గెట్ పెట్టాలనే లక్ష్యంతో బ్యాటింగ్ చేస్తోంది భారత జట్టు..

click me!