మూడో టీ20లో పోరాడి ఓడిన టీమిండియా... సూర్య భాయ్ సెంచరీ వృథా! రోహిత్ రికార్డు విజయాలకు బ్రేక్...

Published : Jul 10, 2022, 10:50 PM IST
మూడో టీ20లో పోరాడి ఓడిన టీమిండియా... సూర్య భాయ్ సెంచరీ వృథా! రోహిత్ రికార్డు విజయాలకు బ్రేక్...

సారాంశం

సూపర్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసిన సూర్యకుమార్ యాదవ్... 17 పరుగుల తేడాతో ఊరట విజయం అందుకున్న ఇంగ్లాండ్... రోహిత్ సేన వరుస విజయాలకు బ్రేక్...

తొలి టీ20 మ్యాచుల్లో ఘన విజయాలు అందుకున్న భారత జట్టు, మూడో టీ20లో భారీ లక్ష్యఛేదనలో పోరాడి ఓడింది. సూర్యకుమార్ యాదవ్ సెన్సేషనల్ సెంచరీ కారణంగా 216 పరుగుల లక్ష్యఛేదనలో 198 పరుగులు చేసిన టీమిండియా, 17 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కెప్టెన్‌గా వరుసగా 19 మ్యాచుల్లో గెలుస్తూ వచ్చిన రోహిత్ శర్మ జైత్రయాత్రకు నేటి పరాజయంతో బ్రేక్ పడినట్టైంది..

కొండంత లక్ష్యఛేదనలో టీమిండియాకి శుభారంభం దక్కలేదు. రిషబ్ పంత్ 5 బంతుల్లో 1 పరుగు చేసి తోప్లే బౌలింగ్‌లో అవుట్ కాగా విరాట్ కోహ్లీ 6 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు... కెప్టెన్ రోహిత్ శర్మ 12 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసి అవుట్ కావడంతో 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఈ దశలో శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ కలిసి నాలుగో వికెట్‌కి 119 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు...

23 బంతుల్లో 2 సిక్సర్లతో 28 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, తోప్లే బౌలింగ్‌లో అవుట్ కాగా దినేశ్ కార్తీక్ 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. జడేజా కూడా 4 బంతుల్లో ఓ సిక్సర్‌తో 7 పరుగులు చేసి అవుట్ కావడంతో వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయింది భారత జట్టు...  అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో దూకుడు తగ్గించని సూర్యకుమార్ యాదవ్.. 49 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు...

సూర్యకుమార్ యాదవ్‌కి అంతర్జాతీయ కెరీర్‌లో ఇదే మొదటి సెంచరీ. నాలుగు అంతకంటే కింద బ్యాటింగ్‌కి వచ్చి సెంచరీ బాదిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు సూర్యకుమార్ యాదవ్. ఇంతకుముందు కెఎల్ రాహుల్ 2016లో వెస్టిండీస్‌పై ఈ ఫీట్ సాధించాడు...

టీ20ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి అత్యధిక స్కోరు నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచిన సూర్యకుమార్ యాదవ్, టీమిండియా తరుపున రోహిత్ శర్మ (118) తర్వాత అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 

55 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్సర్లతో 117 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, మొయిన్ ఆలీ బౌలింగ్‌లో ఫిలిప్ సాల్ట్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సూర్య అవుట్ అయ్యే సమయానికి భారత జట్టు విజయానికి చివరి 7 బంతుల్లో 25 పరుగులు కావాలి... వస్తూనే హర్షల్ పటేల్ ఫోర్ బాదడంతో ఆఖరి ఓవర్‌లో టీమిండియా విజయానికి 21 పరుగులు కావాల్సి వచ్చాయి...

మొదటి బంతికి ఆవేశ్ ఖాన్ సింగిల్ తీయగా ఆ తర్వాత రెండు బంతుల్లో పరుగులేమీ రాలేదు. నాలుగో బంతికి హర్షల్ పటేల్ భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ విజయం ఖరారైపోయింది. ఆఖరి బంతికి రవి భిష్ణోయ్ బౌల్డ్ కావడంతో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 198 పరుగులకి పరిమితమైంది భారత జట్టు...

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది... టీమిండియాపై ఇంగ్లాండ్‌కి టీ20ల్లో ఇదే అత్యధిక స్కోరు... భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, యజ్వేంద్ర చాహాల్ వంటి సీనియర్లు లేకపోవడంతో బలహీనంగా మారిన భారత బౌలింగ్ యూనిట్‌ని దంచికొట్టి, టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని పెట్టింది ఇంగ్లాండ్... 

9 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ని ఆవేశ్ ఖాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఐపీఎల్‌లో జోస్ బట్లర్‌ని రెండుసార్లు అవుట్ చేసిన ఆవేశ్ ఖాన్, ఈ ఏడాది మూడుసార్లు అతన్ని పెవిలియన్ చేర్చాడు...

ఈ సిరీస్‌లో 22 పరుగులు మాత్రమే చేసిన జోస్ బట్లర్, టీ20 సిరీస్‌లో అతి తక్కువ పరుగులు చేసిన ఇంగ్లాండ్ సారథిగా ఇయాన్ మోర్గాన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. 2019లో విండీస్‌పై 19 పరుగులు చేశాడు మోర్గాన్. 

26 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసిన జాసన్ రాయ్, ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 6 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన ఫిలిప్ సాల్ట్, హర్షల్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

84 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. ఈ దశలో డేవిడ్ మలాన్, లియామ్ లివింగ్‌స్టోన్ కలిసి నాలుగో వికెట్‌కి 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 77 పరుగులు చేసిన డేవిడ్ మలాన్, రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రెండో బంతికే మొయిన్ ఆలీకి డకౌట్ చేశాడు భిష్ణోయ్...

9 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేసిన హారీ బ్రూక్స్‌కి హర్షల్ పటేల్ అవుట్ చేశాడు. 3 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసిన జోర్డాన్, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రనౌట్ అయ్యాడు. లియామ్ లివింగ్‌స్టోన్ 29 బంతుల్లో 4 సిక్సర్లతో 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు... భారత బౌలర్లలో హర్షల్ పటేల్, రవి భిష్ణోయ్ రెండేసి వికెట్లు తీయగా ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ తీశాడు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు