
లార్డ్స్ టెస్టులో ఆఖరి రోజు రసవత్తరంగా మొదలైంది. ఓవర్‌నైట్ స్కోర్ 181/6 వద్ద ఐదో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా... త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. 46 బంతుల్లో ఒక ఫోర్‌తో 22 పరుగులు చేసిన రిషబ్ పంత్, రాబిన్‌సన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 194 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది టీమిండియా...
ఆ తర్వాత 24 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసిన ఇషాంత్ శర్మ కూడా ఓల్లీ రాబిన్‌సన్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు... ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన భారత బౌలర్ జస్ప్రిత్ బుమ్రాను టార్గెట్ చేస్తూ ఇంగ్లాండ్ బౌలర్లు బౌన్సర్లు సంధించడం మొదలెట్టారు.
ఈ సమయంలో మార్క్ వుడ్, బుమ్రా మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ ఇద్దరినీ అడ్డుకునేందుకు ఫీల్డ్ అంపైర్ ప్రయత్నించారు. అంపైర్‌కి బుమ్రా ఏదో చెప్పడం, జోస్ బట్లర్ కలిపించుకుని ఏదో కామెంట్ చేయడం జరిగిపోయాయి. ఈ సంఘటన తర్వాత మార్క్ వుడ్ వేసిన ఓ బంతి వేగంగా వచ్చి బుమ్రా హెల్మెట్‌కి తగిలింది.
తొలి ఇన్నింగ్స్‌లో జేమ్స్ అండర్సన్ పైకి బౌన్సర్లు వేసిన బుమ్రాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇంగ్లాండ్ బౌలర్లు అందరూ అతన్ని టార్గెట్ చేయడంపై భారత సారథి విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేయడం స్పష్టంగా కనిపించింది.