ఊరించి ఉసూరుమనిపించిన ఆసీస్.. టీమిండియా ముందు ఈజీ టార్గెట్..

Published : Mar 17, 2023, 04:34 PM IST
ఊరించి ఉసూరుమనిపించిన ఆసీస్.. టీమిండియా ముందు ఈజీ టార్గెట్..

సారాంశం

INDvsAUS 1st ODI: భారత్ - ఆస్ట్రేలియా మధ్య   వాంఖెడే వేదికగా  జరుగుతున్న తొలి వన్డేలో  కంగారూలు ఊరించి ఉసూరుమనిపించారు. తొలుత బాగానే ఆడినా తర్వాత లయ కోల్పోయారు. 

ఆస్ట్రేలియాతో  మూడు వన్డేల సిరీస్ లో భాగంగా వాంఖెడే వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు అదరగొట్టారు. తొలుత మిచెల్ మార్ష్ (65 బంతుల్లో 81,  10 ఫోర్లు, 5 సిక్సర్లు)  మెరుపులతో  ఆసీస్ భారీ స్కోరు చేసేలా కనిపించినా అతడి నిష్క్రమణతో కంగారూలు కంగారెత్తారు.  భారత బౌలర్లు క్రమం తప్పకుండా  వికెట్లు తీస్తూ ఆసీస్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ తో సిరాజ్, రవీంద్ర  జడేజాలు రాణించడంతో  ఆసీస్  35.4  ఓవర్లలో 188 పరుగులకే ఆలౌట్ అయింది.  

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన  ఆసీస్‌కు మహ్మద్ సిరాజ్ తాను వేసిన తొలి ఓవర్లోనే షాకిచ్చాడు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (5) ను క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్ భారత్ కు బ్రేకిచ్చాడు.  తొలి వికెట్ కోల్పోయినా ఆసీస్ ధాటిగా ఆడింది.  ఓపెనర్ గా వచ్చిన మార్ష్..  రెండో వికెట్ కు స్టీవ్ స్మిత్  (30 బంతుల్లో 22, 4 ఫోర్లు) తో కలిసి  72 పరుగులు జోడించాడు. 

తొలి ఓవర్లోనే వికెట్ తీసిన సిరాజ్ తర్వాత   ఓవర్లలో భారీగా పరుగులిచ్చుకున్నాడు.  అతడు వేసిన ఆసీస్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో  మార్స్ మూడు బౌండరీలు బాదాడు. ఆ తర్వాత షమీ  బౌలింగ్ లో స్మిత్ రెండు ఫోర్లు కొట్టాడు. సిరాజ్ వేసిన  8వ ఓవర్లో మార్ష్ మరో రెండు బౌండరీలు సాధించాడు. శార్దూల్ వేసిన పదో ఓవర్లో భారీ సిక్సర్ బాదాడు. 

బ్రేక్ ఇచ్చిన జడ్డూ.. 

కెప్టెన్ హార్ధిక్ పాండ్యా వేసిన  13వ ఓవర్లో మూడో బంతికి   స్మిత్.. వికెట్ కీపర్  కెఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.   కుల్దీప్ వేసిన  17వ ఓవర్లో  మూడో బంతికి  ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ సాధించిన మార్ష్.. కుల్దీప్ వేసిన 19వ ఓవర్లో 4, 6 బాదాడు. అయితే జడేజా వేసిన  20 వ ఓవర్లో  మార్ష్.. సిరాజ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మార్ష్ నిష్క్రమణ తర్వాత  ఆసీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. 

కుల్దీప్ వేసిన 22వ ఓవర్లో  లబూషేన్ (15) కూడా జడ్డూ పట్టిన సూపర్  క్యాచ్ తో పెవిలియన్ చేరాడు.  షమీ వేసిన ద 28వ ఓవర్లో  భారీ సిక్సర్ బాదిన జోష్ ఇంగ్లిస్ (26)  అదే ఓవర్లో ఐదో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆసీస్ భారీ ఆశలు పెట్టుకున్న కామెరూన్ గ్రీన్ (1)  కూడా షమీ వేసిన 30 వ ఓవర్లో   బౌల్డ్ అయ్యాడు.  30 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్.. 6 వికెట్ల నష్టానికి  174 పరుగులు చేసింది. 

తోకనూ కత్తిరించారు.. 

కుల్దీప్ వేసిన  31వ ఓవర్లో  ఫోర్ కొట్టిన మార్కస్ స్టోయినిస్ (5) కూడా షమీకే దొరికిపోయాడు.   షమీ వేసిన 32వఓవర్లో  స్లిప్స్ లో శుభ్‌మన్ గిల్ కు క్యాచ్ ఇచ్చాడు.  వరుసగా వికెట్లు కోల్పోతుండటంతో ఏకాగ్రత కోల్పోయిన  మ్యాక్స్‌వెల్ (8).. జడేజా వేసిన  33వ  ఓవర్లో  హార్ధిక్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  ఇక సిరాజ్ వేసిన 34వ ఓవర్లో నాలుగో బంతికి  సీన్ అబాట్  (0) గిల్  చేతికే చిక్కాడు. అతడే వేసిన 36వ ఓవర్లో  జంపా (0) వికెట్ కీపర్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

భారత బౌలర్లలో షమీ, సిరాజ్ లు తలా  3 వికెట్లు తీయగా  జడేజా రెండు వికెట్లు పడగొట్టారు.   హార్ధిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ లకు తలా ఓ వికెట్ దక్కింది.  

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?