
ఇండోర్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఓటమి అంచున ఉన్న నేపథ్యంలో దీని నుంచి తప్పించుకోవడానికి ఏదైనా అద్భుతం జరగాలని భారత క్రికెట్ జట్టు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే అద్భుతమేదో జరుగుతుందో లేదో తెలియదు గానీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కు మాత్రం ఇప్పుడు మరో టెన్షన్ పట్టుకుంది. ఇండోర్ పిచ్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఈ పిచ్ కు ఐసీసీ ‘బిలో యావరేజ్’ రేటింగ్ ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది. బిలో యావరేజ్ రేటింగ్ వచ్చే పిచ్ లకు మ్యాచ్ పాయింట్లలో కోత విధించే అవకాశముంటుంది.
ఇండోర్ పిచ్ తొలి రోజు ఉదయం సెషన్ లో ఆరో ఓవర్ నుంచే టర్న్ అయింది. ఇక రెండో రోజు అయితే 14 వికెట్లు నేలకూలాయి. దీనిపై ఆసీస్ మాజీ క్రికెటర్లు మాథ్యూ హెడెన్, ఇయాన్ చాపెల్ లతో పాటు టీమిండియా మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
చాపెల్ అయితే ఈ పిచ్ కు ఐసీసీ మ్యాచ్ రిఫరీ.. బిలో యావరేజ్ రేటింగ్ ఇవ్వాలని బహిరంగంగానే డిమాండ్ చేశాడు. బ్యాటర్లకు ఏమాత్రం అనుకూలంగా లేని ఇటువంటి పిచ్ లను తయారచేయడం వల్ల టెస్టు క్రికెట్ ను అపహస్యం చేసినట్టే అవుతుందని క్రికెట్ పండితులు కూడా విశ్లేషణలు చేశారు.
ఇదే విషయమై వెంగ్‌సర్కార్ స్పందిస్తూ... ‘మంచి క్రికెట్ ను చూడాలనుకుని మీరు అనుకుంటే ఇలాంటి పిచ్ లు పూర్తి నిరాశ కలిగిస్తాయి. బౌలర్లు, బ్యాటర్లకు అనుకూలించేలా పిచ్ లను తయారుచేయాలి. అప్పుడు బ్యాట్ బాల్ మధ్య ఆసక్తికర సమరం కొనసాగుతుంది. కానీ మొదటి రోజు తొలి గంట ఆట నుంచే బంతి టర్న్ అవుతే అది టెస్టు క్రికెట్ ను అవమానించినట్టే..’అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
ఇదిలాఉండగా ఇండోర్ పిచ్ ను నిందించడంపై పీటీఐతో ఓ క్రికెట్ ఎక్స్‌పర్ట్ మాట్లాడుతూ.. ‘టెస్టు క్రికెట్ మ్యాచ్ కోసం పిచ్ ను తయారుచేయాలంటే కనీసం ఒక నెల రోజులు పడుతుంది. పిచ్ లకు కూడా రెస్ట్ కావాలి. ఇటీవలే ఇదే వేదికపై రెండువారాల క్రితం రంజీ సెమీస్ జరిగింది. అంతకుముందు న్యూజిలాండ్ తో వన్డే మ్యాచ్ కూడా ఇదే వేదికలో ముగిసింది. కొత్త పిచ్ అయినా రెస్ట్ లేకుండా ఆడటం వల్లే ఇలా స్పందిస్తుంది ..’అని చెప్పాడు.
వాస్తవానికి మూడో టెస్టు ధర్మశాల వేదికగా జరగాల్సి ఉండగా ఆ మ్యాచ్ అక్కడ కొత్త పిచ్ తయారీతో అది ఇంకా టెస్టు క్రికెట్ కు అనుగుణంగా లేకపోవడం, ఔట్ ఫీల్డ్ కూడా సరిగా లేకపోవడంతో ఈ మ్యాచ్ ను ఇండోర్ కు తరలించిన విషయం తెలిసిందే. ఇండోర్ లో మాత్రం టీమిండియాకు ఫలితం అనుకూలంగా వచ్చేట్టు కనిపించడం లేదు.