CWG 2022: రోడ్రిగ్స్ అదుర్స్.. రఫ్ఫాడించిన రేణుకా ఠాకూర్.. ‘కామన్వెల్త్‌’లో సెమీస్‌కు టీమిండియా

Published : Aug 04, 2022, 10:39 AM IST
CWG 2022: రోడ్రిగ్స్ అదుర్స్.. రఫ్ఫాడించిన రేణుకా ఠాకూర్..  ‘కామన్వెల్త్‌’లో సెమీస్‌కు టీమిండియా

సారాంశం

Commonwealth Games 2022: పతకమే లక్ష్యంగా కామన్వెల్త్ గేమ్స్ లోకి అడుగుపెట్టిన భారత మహిళా జట్టు  అందుకు రెండు అడుగుల దూరంలో నిలిచింది. బార్బడోస్ ను  చిత్తుగా ఓడించి సెమీస్ కు చేరింది. 

బర్మింగ్‌హామ్ వేదికగా  జరుగుతున్న కామన్వెల్త్ క్రికెట్ పోటీలలో భారత  మహిళల జట్టు సెమీస్ కు చేరింది. బుధవారం రాత్రి  బార్బడోస్ తో జరిగిన కీలక పోరులో గెలిచి సెమీఫైనల్స్ కు  చేరింది. గెలిస్తే సెమీస్ కు లేకుంటే ఇంటికి అనే పరిస్థితుల నేపథ్యంలో భారత్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ముందు బ్యాటింగ్ చేసి 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.  ఆ తర్వాత బార్బడోస్ ను 62 పరుగులకే కట్టడి చేసి వంద పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా గ్రూప్-ఏలో ఇప్పటికే ఆసీస్ సెమీస్ చేరగా.. భారత్ రెండో జట్టుగా నిలిచింది. ఇక బార్బడోస్, పాకిస్తాన్ లు గ్రూప్ దశలోనే నిష్క్రమించాయి. 

కీలక మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియాకు  మొదటి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన.. 5 పరుగులకే పెవిలియన్ చేరింది. కానీ మరో ఓపెనర్ షఫాలీ వర్మ (26 బంతుల్లో  43, 7 ఫోర్లు, 1 సిక్స్) తో కలిసి జెమీమా రోడ్రిగ్స్ (46 బంతుల్లో 56 నాటౌట్, 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. 

ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 71 పరుగులు జోడించారు. అయితే షఫాలీ ఔట్ రనౌట్ అవగా.. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్  డకౌట్ అయింది. వికెట్ కీపర్ తానియా భాటియా (6) కూడా రాణించలేదు.  అయితే చివర్లో వచ్చిన దీప్తి శర్మ (28 బంతుల్లో 34 నాటౌట్, 2 ఫోర్లు, 1 సిక్సర్) ధాటిగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్.. 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. 

 

అనంతరం లక్ష్య ఛేదనలో బార్బడోస్ కు రేణుకా ఠాకూర్ చుక్కలు చూపెట్టింది. తొలి  మ్యాచ్ లో ఆస్ట్రేలియన్లకు వేసిన స్పెల్ నే మళ్లీ రిపీట్ చేసింది. డాటిన్ (0), హేలీ మాథ్యూస్ (9), కైసియా నైట్ (3),  ఆలియా అలైన్ (0) లను పెవిలియన్ కు పంపింది.  రేణుకాతో పాటు స్నేహ్ రాణా, రాధా యాధవ్, హర్మన్ప్రీత్ కౌర్ లు బార్బడోస్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఆ జట్టులో కిషోన నైట్  (16) టాప్ స్కోరర్. షకేరా సెల్మన్ (12) తప్ప మిగిలినవారంతా ఒక అంకె స్కోరుకే పరిమితమయ్యారు. ఫలితంగా  బార్బడోస్.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 62 పరుగులు మాత్రమే  చేసింది. 

గ్రూప్-ఏలో భాగంగా పాకిస్తాన్-ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఆసీస్.. 44 పరుగుల తేడాతో పాక్ ను ఓడించి ఆడిన మూడు మ్యాచుల్లో విజయాలతో టేబుల్ టాపర్ గా నిలిచింది. ఇక సెమీస్ లో భారత్.. గ్రూప్-బీలోని ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరిగే విజేతతో పోటీ పడుతుంది. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !