
ఫుల్లుగా తాగి ఒళ్లు మరిచిపోయి ప్రవర్తించిన ఆటగాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాంటివాళ్లను మొగ్గలోనే తుంచేయాలని డిమాండ్ చేశాడు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి. రెండ్రోజుల క్రితం రాజస్థాన్ రాయల్స్ విడుదల చేసిన ఓ వీడియోలో.. ఆ జట్టు స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, కరుణ్ నాయర్ లు వాళ్ల జీవితంలో జరిగిన అత్యంత భయానక ఘటనలకు సంబంధించిన విషయాలను వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ వీడియోలో యుజ్వేంద్ర చాహల్ ను ఓ ఆటగాడు ఫుల్లుగా తాగి 15వ ఫ్లోర్ నుంచి పడేయబోయాడని అతడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇది చూసిన రవిశాస్త్రి తీవ్రంగా స్పందించాడు.
రాజస్థాన్ రాయల్స్ విడుదల చేసిన వీడియోలో చాహల్ మాట్లాడుతూ.. ‘నిజానికి ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. నేను ఎవరితోనూ షేర్ చేసుకోలేదు. ఈ ఘటన 2013 లో జరిగింది. అప్పుడు నేను ముంబై ఇండియన్స్ లో ఉన్నాను. బెంగళూరుతో మ్యాచ్ అయిపోయాక ఓ గెట్ టు గెదర్ పార్టీ ఉంటే వెళ్లాం.
ఆ పార్టీలో నా సహచర ఆటగాడు ఒకరు బాగా తాగేసి ఉన్నాడు. తాగిక మైకంలో నన్ను తన దగ్గరికి పిలిచాడు. నన్ను అమాంతం ఎత్తి పట్టి బాల్కనీ నుంచి వేలాడదీశాడు. తన మెడ చుట్టూ నేను చేతులు వేసి పట్టుకున్నా. ఏమాత్రం పట్టు జారినా 15వ అంతస్తు బాల్కనీ నుంచి కిందపడిపోయే వాడినే. అయితే అక్కడే ఉన్న కొంతమంది త్వరగా వచ్చి నన్ను పైకి లాగారు. పక్కన కూర్చోబెట్టి కొన్ని నీళ్లిచ్చారు. నేను తృటిలో చావు నుంచి తప్పించుకున్న ఘటన అది. బయటకు వెళ్లినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అప్పుడు నాకు తెలిసింది...’ అని చెప్పుకొచ్చాడు.
కాగా చాహల్ వ్యాఖ్యల అనంతరం రవిశాస్త్రి స్పందిస్తూ.. ‘ఈ ఘటనలో దోషిని కఠినంగా శిక్షించాలి. మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి అలా చేయడం ఆందోళనకరం. ఇది ఫన్నీ విషయం కానే కాదు. ఇలాంటి విషయం వినడం నాకైతే ఇదే మొదటిసారి. ఈరోజు గనక అలాంటి ఘటన జరిగితే సదరు ఆటగాడిపై జీవితకాలం నిషేధం విధించాలి. వీలైనంత త్వరగా ఆ వ్యక్తిని మానసిక పునరావికాస కేంద్రానికి పంపించాలి. సదరు ఆటగాడిని క్రికెట్ మైదానం దగ్గరికి రానివ్వకపోవడమే మంచిది. ఇదే సమయంలో ఆటగాళ్లు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు త్వరగా రిపోర్టు చేయాలి. ఇది తమాషా కాదు. అవినీతి నిరోధక శాఖకు అవినీతి అధికారుల గురించి చెప్పినట్టు.. ఇలాంటి మానసిక రోగుల గురించి కూడా తెలియజేయాలి...’ అని వ్యాఖ్యానించాడు.
అంతకుముందు భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ విషయమై స్పందించాడు. ఈ ఘటనను సరదాగా పరిగణించలేమని, సదరు దోషి పేరు వెల్లడించాలని చాహల్ ను కోరాడు. ఈ మేరకు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించిన మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాలో.. ఆయన ఓ వ్యక్తిని బాల్కనీ నుంచి పడేసిన సీన్ మీమ్ ఫోటోను కూడా పోస్ట్ చేశాడు.
ఇక 2013లో యుజ్వేంద్ర చాహల్ ముంబైలో ఉండగా.. అందుకు సంబంధించిన జట్టు వివరాల ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. చాహల్ ను తోసేయబోయింది విదేశీ ప్లేయర్ అని అతడు హింట్ ఇచ్చాడు. ఆ సమయంలో ముంబైలో ఉన్న విదేశీ ఆటగాళ్లలో ఏడెన్ బ్లిజర్డ్, జేమ్స్ ఫ్రాంక్లిన్, కీరన్ పొలార్డ్, లసిత్ మలింగ, మిచెల్ జాన్సన్, డ్వేన్ స్మిత్ లు ఉన్నారు. మరి వీరిలో చాహల్ ను బాల్కనీ నుంచి తోసేయాలనుకున్నది ఎవరు..? అది అతడే వెల్లడించాలి..