
ఈ ఏడాది భారత జట్టు ఆగస్టులో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్నది. షెడ్యూల్ ప్రకారం మూడు ఫార్మాట్లలో కలిపి 8 మ్యాచ్ లు ఆడాల్సి ఉన్న భారత జట్టు పర్యటనలో మార్పులు జరిగాయి. ఈ మేరకు క్రికెట్ వెస్టిండీస్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. మారిన షెడ్యూల్ ప్రకారం.. భారత జట్టు 8 మ్యాచ్ లు కాకుండా పది మ్యాచ్ లు ఆడనుంది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాదీ భారత జట్టు అమెరికాలో మ్యాచ్ లు ఆడనుంది.
క్రిక్ బజ్ లో వచ్చిన నివేదిక మేరకు.. ఐసీసీ ఇదివరకే నిర్దేశించిన ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టీపీ) షెడ్యూల్ లో భారత జట్టు వెస్టిండీస్ తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ఇవన్నీ వెస్టిండీస్ లోనే జరగాలి.
కానీ ఈ టూర్ లో భారత్ మూడు కాకుండా ఐదు టీ20 లు ఆడనుంది. రెండు టెస్టులు, మూడు వన్డేలలో ఏ మార్పులు లేవు గానీ అదనంగా రెండు టీ20లు యాడ్ అయ్యాయి. ఈ రీషెడ్యూల్డ్ రెండు టీ20 మ్యాచ్ లు వెస్టిండీస్ దీవుల్లో కాకుండా ఫ్లోరిడా (యూఎస్) లో జరుగుతాయి. జులై చివరి నుంచి మొదలయ్యే ఈ టూర్.. ఆగస్టు వరకూ జరుగుతుంది. అమెరికాలో ఈ టూర్ ముగించుకుని భారత్ స్వదేశం చేరుకుంటుంది.
ఇదే విషయమై క్రికెట్ వెస్టిండీస్ ప్రతినిధి ఒకరు క్రిక్ బజ్ తో మాట్లాడుతూ.. ‘ఏదైనా అనివార్యకారణం ఎదురైతే తప్ప ఈ సిరీస్ రీషెడ్యూల్డ్ ప్రకారమే జరుగుతుంది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాదీ రెండు టీ20లు అమెరికాలో జరుగుతాయి...’అని చెప్పాడు. ఫ్లోరిడాలో జరుగబోయే ఈ మ్యాచ్ లకు యూఎస్ ఆతిథ్యమిస్తున్నా మ్యాచ్ లను నిర్వహించేది మాత్రం క్రికెట్ వెస్టిండీసే కావడం గమనార్హం. ఇది భారత్ కు కూడా ఒక విధంగా కలిసొచ్చేదే. 2024లో టీ20 వరల్డ్ కప్ అమెరికా, వెస్టిండీస్ లలోనే జరుగనుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో జరిగే మ్యాచ్ లతో భారత టీ20 వీరులకు ఇక్కడి పిచ్ ల పై అవగాహన ఏర్పుడుతుంది.
కాగా భారత జట్టు ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్ 7 నుంచి 12 వరకూ ఇంగ్లాండ్ లోని ది ఓవల్ వేదికగా జరిగే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో పాల్గొంటుంది. ఫైనల్ లో భారత జట్టు ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఆ తర్వాత విండీస్ పర్యటనకు వెళ్లనుంది. జూన్ నుంచి జులై మధ్య గ్యాప్ లో అఫ్గనిస్తాన్ తో టీ20 సిరీస్ ప్లాన్ చేసేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.