రాహుల్ క్లాస్, సూర్యకుమార్ మాస్... జింబాబ్వే ముందు భారీ టార్గెట్ పెట్టిన టీమిండియా..

By Chinthakindhi Ramu  |  First Published Nov 6, 2022, 3:13 PM IST

కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలు... జింబాబ్వే ముందు 187 పరుగుల భారీ టార్గెట్ పెట్టిన టీమిండియా... 


టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో జింబాబ్వేతో జరుగుతున్న ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు బ్యాటు ఝులిపించారు. రోహిత్ శర్మ, రిషబ్ పంత్ మరోసారి ఫెయిల్ అయినా కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ, సూర్యకుమార్ యాదవ్ మెరుపులతో భారత జట్టు మంచి స్కోరు చేయగలిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా... నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.  

టోర్నీలో వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ 13 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ కలిసి రెండో వికెట్‌కి 60 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 25 బంతుల్లో 2 ఫోర్లతో 26 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, సీన్ విలియమ్స్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి అవుట్ అయ్యాడు...

Latest Videos

undefined

టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీలో 246 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా టాప్‌లో నిలిచాడు. విరాట్ కోహ్లీ 5 మ్యాచుల్లో ఈ ఫీట్ అందుకుంటే ఆ తర్వాతి నాలుగు స్థానాల్లో క్వాలిఫైయర్ మ్యాచులతో సహా 8 మ్యాచులు ఆడిన ప్లేయర్లు మ్యాక్స్ ఓడాడ్, కుశాల్ మెండిస్, పథుమ్ నిశ్శంక, లోర్కన్ టక్కర్ ఉన్నారు.. 

దినేశ్ కార్తీక్ ప్లేస్‌లో టీమ్‌లో చోటు దక్కించుకున్న రిషబ్ పంత్ 5 బంతుల్లో 3 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, సికందర్ రజా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు...

మొదటి మూడు మ్యాచుల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరిన కెఎల్ రాహుల్, వరుసగా రెండు మ్యాచుల్లో 50+ స్కోర్లు నమోదు చేయడం విశేషం. 

బీభత్సమైన ఫామ్‌లో ఉన్న ఐసీసీ నెం.1 టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, ఈ ఏడాది టీ20ల్లో 1000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకున్న మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. 

15 ఓవర్లు ముగిసే సమయానికి 107 పరుగులే చేసింది టీమిండియా. ముజరబానీ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్, పాండ్యా కలిసి 4 ఫోర్లతో 18 పరుగులు రాబట్టారు.  ఆ తర్వాతి ఓవర్‌లో 12 పరుగులు రాగా 18వ ఓవర్‌లో 15 పరుగులు వచ్చాయి. 

18 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, ఆఖరి ఓవర్‌లో అవుట్ అయ్యాడు. 23 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న సూర్యకుమార్ యాదవ్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో మూడో 50+ స్కోరు నమోదు చేశాడు. 

ఆఖరి ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 21 పరుగులు రాబట్టిన సూర్యకుమార్ యాదవ్, టీమిండియాకి భారీ స్కోరు అందించాడు. ఆఖరి 5 ఓవర్లలో 79 పరుగులు చేసింది టీమిండియా. 

click me!