ప్రపంచకప్ తర్వాత, భారత్ తొలి సిరీస్ విజయం:రెండో టీ20లో విండీస్‌పై గెలుపు

By Siva KodatiFirst Published Aug 5, 2019, 7:48 AM IST
Highlights

ప్రపంచకప్‌ చేజార్చుకున్న తర్వాత ఆడిన తొలి సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. వెస్టిండీస్‌తో మూడు జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది. లాడర్‌హిల్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 22 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది

ప్రపంచకప్‌ చేజార్చుకున్న తర్వాత ఆడిన తొలి సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. వెస్టిండీస్‌తో మూడు జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది. లాడర్‌హిల్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 22 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ 67, ధావన్ 23 శుభారంభం అందించారు. ముఖ్యంగా రోహిత్ ఫోర్లు, సిక్సర్లతో విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ధావన్ కూడా వేగంగా ఆడటంతో భారత్ 7 ఓవర్లకే 61 పరుగులు చేసింది.

ఈ క్రమంలో కీమో పాల్ బౌలింగ్‌లో ధావన్ ఔటయ్యాడు. అయినప్పటికీ కోహ్లీ సాయంతో రోహిత్ ఇన్సింగ్స్‌ను నడిపించాడు. అయితే 14 ఓవర్ నుంచి టీమిండియా తడబడింది. స్వల్ప వ్యవధిలో రోహిత్, కోహ్లీ, పంత్, మనీష్ పాండే ఔటయ్యారు.

కానీ పాల్ వేసిన చివరి ఓవర్‌లో కృనాల్, జడేజా మూడు సిక్సర్లు బాదడంతో  భారత్ నిర్ణీత 20 ఓవర్‌లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన విండీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.

ఓపెనర్ లూయిస్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డకౌటయ్యాడు. ఆ వెంటనే నరైన్ కూడా పెవిలియన్ చేరడంతో విండీస్ కష్టాల్లో పడింది. ఈ పరిస్ధితుల్లో రోమన్ పావెల్ 54, పూరన్ 19 జంట భారత బౌలర్లను సమర్థవంతంగా అడ్డుకుని మూడో వికెట్‌కు 76 పరుగులు జోడించి విజయం వైపు ఆశలు రేపారు.

అయితే 14వ ఓవర్‌లో కృనాల్ వీరిద్దరిని ఔట్ చేసి విండీస్‌కు షాకిచ్చాడు. 16వ ఓవర్ వద్ద వాతావరణం ఒక్కసారిగా మారిపోవడం, సమీప ప్రాంతాల్లో పిడుగులు పడుతుండటంతో ఎంపైర్లు కాసేపు ఆటను నిలిపివేశారు.

ఆ వెంటనే భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌ను రద్దు చేసి డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్‌ను విజేతగా ప్రకటించారు. రెండు వికెట్లు తీయడంతో పాటు చివర్లో ధాటిగా బ్యాటింగ్ చేసిన కృనాల్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపిక చేశారు. 

click me!