కోహ్లీ, భువి మెరుపులు: వర్షం అడ్డొచ్చినా.. విండీస్‌పై భారత్‌దే పైచేయి

By Siva KodatiFirst Published Aug 12, 2019, 8:06 AM IST
Highlights

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన రెండో వన్డేలో భారత్ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో కెప్టెన్ కోహ్లీ, బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా ఆడి టీమిండియాకు విజయాన్ని అందించారు. 

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన రెండో వన్డేలో భారత్ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది.

కాట్రెల్ వేసిన తొలి ఓవర్‌లోనే ధావన్ ఎల్బీగా వెనుదిరిగాడు. అనంతరం బరిలోకి దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆరంభం నుంచి దూకుడుగా ఆడాడు. రోచ్ వేసిన రెండో ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టాడు.  ఆ తర్వాత కూడా అతను జోరును కొనసాగించాడు.

మరోవైపు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. తన సహజశైలికి భిన్నంగా బ్యాటింగ్ చేశాడు. చివరికి 16వ ఓవర్‌లో చేజ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి 18 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత వచ్చిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ దూకుడుగా ఆడుతూ కెప్టెన్‌కు సహకారం అందించాడు. అయితే ఆ కొద్దిసేపటికే బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్ అయ్యర్..  కోహ్లీతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు

ఈ క్రమంలో కోహ్లీ సెంచరీ సాధించాడు. వన్డేల్లో అది అతనికి 42వది. ఆ తర్వాత కాసేపటికే అయ్యర్ అర్ధసెంచరీ అందుకున్నాడు. ఈ జోడీ దూకుడుతో స్కోరు 300 దాటడం ఖాయమేనని అంతా అనుకున్నారు.

అయితే చివరి ఓవర్లలో విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ పప్పులు ఉడకలేదు. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది.  భారత ఆటగాళ్లలో కోహ్లీ 120, శ్రేయస్ అయ్యర్ 71 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో బ్రాత్‌వైట్ 3, కాట్రెల్, హోల్డర్, ఛేజ్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్యఛేదనకు భారీలోకి దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్లు మంచి ఆరంభం ఇవ్వలేకపోయారు. విధ్వంసక ఆటగాడు క్రిస్‌గేల్ భారత బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బందిపడగా.. మరో ఓపెనర్ లూయిస్ మాత్రం ధాటిగా ఆడాడు.

11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద 10వ ఓవర్‌లో భువనేశ్వర్ బౌలింగ్‌లో గేల్ ఎల్బీగా వెనుదిరిగాడు. స్వల్ప వ్యవధిలోనే షై హోప్, హెట్‌మైయర్ కూడా ఔటవ్వడంతో వెస్టిండీస్ కష్టాల్లో పడింది.

13వ ఓవర్లో వర్షం పడటంతో అరగంట పాటు మ్యాచ్ ఆగిపోయింది. అనంతరం డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో విండీస్ లక్ష్యాన్ని 46 ఓవర్లలో 270 పరుగులకు కుదించారు. ఈ క్రమంలో లూయిస్-పూరన్‌ల జోడీ మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడింది.

లూయిస్ 23వ ఓవర్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వెస్టిండీస్ లక్ష్యం వైపు సాగుతున్న దశలో కుల్దీప్ బౌలింగ్‌లో లూయిస్ ఔటయ్యాడు. ఆ తర్వాత పూరన్, ఛేజ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించే ప్రయత్నం చేశాడు.

వీరిద్దరూ కుదురుకుంటున్న దశలో 35వ ఓవర్‌లో భువనేశ్వర్ కుమార్ వీరిద్దరిని వెంట వెంటనే ఔట్ చేసి విండీస్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఆ తర్వాత ఓవర్‌లో బ్రాత్‌వైట్ డక్కౌట్ కావడంతో వెస్టిండీస్ ఓటమి ఖరారైంది.

42వ ఓవర్‌లో షమి.. కాట్రెల్, థామస్‌ను పెవిలియన్‌కు పంపి టీమిండియాకు విజయాన్ని అందించాడు. విండీస్ బ్యాట్స్‌మెన్‌లలో లూయిస్ 65, పూరన్ 42 పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4, షమీ, కుల్దీప్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. 

click me!