భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే

Published : Aug 23, 2026, 06:50 PM IST
India vs Sri Lanka 2nd Test

సారాంశం

India vs Sri Lanka 2nd Test: కొలంబోలో భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజే ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్, శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో మధ్య మైదానంలో తీవ్ర వాగ్వాదం జరిగింది.

హాఫ్ సెంచ‌రీ మిస్ చేసుకున్న జైస్వాల్

టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా వచ్చిన యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ జట్టుకు శుభారంభం అందించే ప్రయత్నం చేశారు. అయితే రాహుల్ 18 పరుగులకే వెనుదిరగగా, జైస్వాల్ మాత్రం క్రీజులో కొంతసేపు దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. 17వ ఓవర్‌లో ఫెర్నాండో బౌలింగ్‌కు వచ్చినప్పుడు జైస్వాల్ వరుసగా మూడు బంతులను బౌండరీలకు తరలించాడు. దీంతో అతను అర్ధశతకానికి చేరువయ్యాడు. అయితే అదే ఓవర్ చివరి బంతి మ్యాచ్‌ను ఒక్కసారిగా మలుపుతిప్పింది. ఫెర్నాండో రౌండ్ ద వికెట్ నుంచి గుడ్ లెంగ్త్‌లో వేసిన బంతి పిచ్‌ను తాకిన వెంటనే లోపలికి దూసుకొచ్చింది. జైస్వాల్ దాన్ని ఆఫ్‌సైడ్‌లో అడ్డుకునే ప్రయత్నం చేసినా బంతి బ్యాట్ ఎడ్జ్‌ను తాకి వికెట్లకు తాకింది. దీంతో 53 బంతుల్లో 9 ఫోర్లతో 45 పరుగులు చేసిన జైస్వాల్ పెవిలియన్ చేరాడు.

ఫెర్నాండో, జైస్వాల్ మ‌ధ్య వాగ్వాదం

వికెట్ దక్కిన ఆనందంలో ఫెర్నాండో మైదానంలో ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నాడు. జైస్వాల్ పెవిలియన్ వైపు వెళ్తున్న సమయంలో అతడి వైపు చూస్తూ కొన్ని సైగలు, వ్యాఖ్యలు చేసినట్లు మ్యాచ్‌లో కనిపించింది. దీంతో జైస్వాల్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి బౌలర్ వైపు వెళ్లాడు. ఇద్దరూ ఒకరికొకరు దగ్గరగా నిలబడి మాటలతో తలపడ్డారు. అప్పటికే జైస్వాల్ వరుస బౌండరీలతో ఫెర్నాండోపై ఒత్తిడి పెంచాడు. ఆ తర్వాతి బంతికే అతడే వికెట్ తీసుకోవడంతో శ్రీలంక పేసర్ సంబరాలు చేసుకోవడం హైడ్రామాకు దారి తీసింది. ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న మాటల యుద్ధం మైదానంలో ఉద్రిక్తతను పెంచింది. పరిస్థితి ముదరకుండా శ్రీలంక కెప్టెన్ ధనంజయ డిసిల్వా, కమిందు మెండిస్ వెంటనే జోక్యం చేసుకున్నారు. ఇద్దరినీ విడదీసి జైస్వాల్‌ను పెవిలియన్ వైపు పంపించారు. దీంతో వివాదం అక్కడితో ముగిసింది.

తొలి రోజు భారత్ ఆధిపత్యం

తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. పడిక్కల్ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. గిల్ కూడా అర్ధశతకం సాధించి జట్టుకు కీలక సహకారం అందించాడు. ఇద్దరి భాగస్వామ్యం భారత ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేసింది. రవీంద్ర జడేజా 43 పరుగులు చేశాడు. క్రీజులో ఉన్న సమయంలో క్రాంప్స్‌తో ఇబ్బంది పడినా పోరాడుతూ బ్యాటింగ్ కొనసాగించాడు. చివరకు ఫెర్నాండో బౌలింగ్‌లో అతడు పెవిలియన్ చేరాడు. వికెట్ కీపర్ రిషభ్ పంత్ 3 పరుగుల వద్ద గాయం కారణంగా మైదానం వీడటం మరో ఆందోళన కలిగించే అంశంగా మారింది.

ఫెర్నాండోకు మూడు వికెట్లు

శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో అత్యంత ప్రభావవంతంగా రాణించాడు. అతడి ఖాతాలో మూడు వికెట్లు ప‌డ్డాయి. జైస్వాల్‌తో పాటు రవీంద్ర జడేజా వికెట్ కూడా అతడే సాధించాడు. లాహిరు కుమార, కేషారా నువాంత చెరో వికెట్ పడగొట్టారు. మొదటి రోజు ఆటలో ఒకవైపు భారత్ బ్యాటింగ్‌లో పటిష్ట స్కోరు సాధించింది. పడిక‌ల్ సెంచరీ, గిల్ హాఫ్ సెంచరీతో భారత్ తొలి రోజు స్కోర్‌ను 300కు చేర్చగా, జైస్వాల్-ఫెర్నాండో ఘటన మ్యాచ్‌లో చర్చనీయాంశంగా నిలిచింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు