దెబ్బకి సీన్ రివర్స్... విజయానికి చేరువలో ఇంగ్లాండ్! వరుణుడిపైనే భారం వేసిన టీమిండియా...

By Chinthakindhi RamuFirst Published Jul 4, 2022, 11:32 PM IST
Highlights

India vs England 5th Test: నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసిన ఇంగ్లాండ్... విజయానికి 119 పరుగుల దూరంలో ఇంగ్లాండ్ జట్టు...

సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో 377 భారీ టార్గెట్‌... టీమిండియాదే విజయం అనుకున్నారంతా.. అయితే ఇంగ్లాండ్‌ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఊహించని ఆటతీరుతో భారత జట్టుకి షాక్ ఇచ్చింది. మొదటి ఓవర్ నుంచి భారత బౌలర్లపైకి ఎదురుదాడికి దిగిన ఇంగ్లాండ్ ఓపెనర్లు.. బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు... తొలి వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పి, పావు వంతు పనిని పూర్తి చేసి పడేశారు...


తొలి ఇన్నింగ్స్‌లో సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయిన ఇంగ్లాండ్ ఓపెనర్లు, రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడుతూ భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. తొలి వికెట్‌కి 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 76 బంతుల్లో 7 ఫోర్లతో 46 పరుగులు చేసిన జాక్ క్రావ్లేని అవుట్ చేసిన టీమిండియా కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా... భారత జట్టుకి తొలి బ్రేక్ అందించాడు..

అదే స్కోరు వద్ద ఓల్లీ పోప్ డకౌట్ కాగా అలెక్స్ లీస్ 65 బంతుల్లో 8 ఫోర్లతో 56 పరుగులు చేసి రనౌట్ కావడంతో ఒకానొక దశలో 107/0 స్కోరుతో ఉన్న ఇంగ్లాండ్, రెండు పరుగుల తేడాతో 3 వికెట్లు కోల్పోయి 109/3 స్కోరుకి చేరుకుంది. అయితే వెంటవెంటనే మూడు వికెట్లు తీశామనే సంతోషం, టీమిండియాకి ఎక్కువ సేపు నిలువలేదు...

సూపర్ ఫామ్‌లో ఉన్న జో రూట్, జానీ బెయిర్‌స్టో వికెట్లకు అడ్డుగా నిలబడి, స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. హనుమ విహారి క్యాచ్ డ్రాప్ చేయడంతో 18 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న జానీ బెయిర్ స్టో... 87 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 72 పరుగులు చేయగా... జో రూట్ 112 బంతుల్లో 9 ఫోర్లతో 76 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు...

ఈ ఇదదరూ 197 బంతుల్లో 150 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ ఇద్దరి భాగస్వామ్యం కారణంగా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది ఇంగ్లాండ్. సిరీస్ సమం చేయడానికి ఆఖరి రోజు మరో 119 పరుగులు చేస్తే సరిపోతుంది...

చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి. జో రూట్, జానీ బెయిర్‌స్టో పాటు బెన్ స్టోక్స్ ఇంకా బ్యాటింగ్‌కి రావాల్సి ఉండడంతో భారత జట్టు ఓటమి దాదాపు ఖరారైపోయిందనే అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. మూడు రోజుల పాటు టెస్టులో ఆధిపత్యం చూపించిన భారత జట్టు, విజయం సాధించాలంటే ఆఖరి రోజు అద్భుతం జరగాల్సిందే...

క్రీజులో పాతుకుపోయిన జో రూట్, జానీ బెయిర్‌స్టోతో పాటు మిగిలిన ఇంగ్లాండ్ బ్యాటర్లను వెంటవెంటనే అవుట్ చేస్తేనే టీమిండియా విజయం సాధించగలుగుతుంది. లేదా భారత జట్టు ఓటమి నుంచి తప్పించుకోవాలంటే ఐదో రోజు వర్షం అంతరాయం కలిగించాల్సి ఉంటుంది. నార్తింగ్‌హమ్‌లో ఐదో రోజు వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడలేదు. దీంతో విజయం అంచుల దాకా వచ్చిన టీమిండియా, డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు భారత జట్టుకి అలాంటి లక్ కలిసి రావాలని కోరుకుంటున్నారు అభిమానులు...

 

click me!