తడబడి, నిలబడి! రవీంద్రజడేజా మెరుపులతో... రెండో టీ20లో ఇంగ్లాండ్ ముందు ఊరించే టార్గెట్...

Published : Jul 09, 2022, 08:47 PM IST
తడబడి, నిలబడి! రవీంద్రజడేజా మెరుపులతో... రెండో టీ20లో ఇంగ్లాండ్ ముందు ఊరించే టార్గెట్...

సారాంశం

నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసిన భారత జట్టు... 46 పరుగులతో అజేయంగా నిలిచిన రవీంద్ర జడేజా...

India vs England 2nd T20: తొలి టీ20లో దూకుడు మంత్రంతో బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి ముందు దాదాపు 200 పరుగుల టార్గెట్ పెట్టిన టీమిండియా, రెండో టీ20లోనూ ఇదే ఫార్ములా ఫాలో అయ్యింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసిన భారత జట్టు, ఇంగ్లాండ్ ముందు ఊరించే టార్గెట్ పెట్టింది.

టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టుకి అదిరిపోయే ఆరంభం అందించారు ఓపెనర్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్. మిడిల్ ఆర్డర్‌లో ఫెయిల్ అవుతున్న రిషబ్ పంత్‌ని ఓపెనర్‌గా ప్రమోట్ చేస్తూ భారత జట్టు తీసుకున్న నిర్ణయం... బాగానే వర్కవుట్ అయినట్టు కనిపించింది...

ఓ ఎండ్‌లో రిషబ్ పంత్, మరో ఎండ్‌లో రోహిత్ శర్మ వరుస బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. తొలి ఓవర్‌లో 1 పరుగు వద్ద జాసన్ రాయ్, జోస్ బట్లర్ క్యాచులు డ్రాప్ చేయడంతో రెండు సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్ శర్మ.. బౌండరీలు బాదడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించాడు...

డేవిడ్ విల్లే వేసిన మూడో ఓవర్‌లో రోహిత్ శర్మ ఓ సిక్సర్, రిషబ్ పంత్ రెండు ఫోర్లు బాది 17 పరుగులు రాబట్టారు. గ్లీసన్ బౌలింగ్‌లో ఫోర్ బాదిన రోహిత్ శర్మ, టీ20ల్లో 300 ఫోర్లను బాదిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన రెండో క్రికెటర్ రోహిత్ శర్మ...

ఐర్లాండ్ క్రికెటర్ పాల్ స్టిర్లింగ్ టీ20ల్లో 300+ బాదిన మొదటి క్రికెటర్‌గా ఉండగా విరాట్ కోహ్లీ 298 ఫోర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. టీ20ల్లో 100కి పైగా సిక్సర్లు, 300+ ఫోర్లు బాదిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచాడు రోహిత్ శర్మ...

 34 ఏళ్ల 219 రోజుల వయసులో టీ20 ఆరంగ్రేటం చేసిన ఫాస్ట్ బౌలర్ రిచర్డ్ గ్లీసన్, మొదటి ఓవర్‌లోనే రోహిత్ శర్మ వికెట్ తీసి టీమిండియాకి షాక్ ఇచ్చాడు. 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేసిన రోహిత్ శర్మ, రిచర్డ్ గ్లీసన్ బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

ఆ తర్వాతి ఓవర్‌లో వరుసగా 6, 4 బాది 12 పరుగులు రాబట్టాడు రిషబ్ పంత్. పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది భారత జట్టు. ఆ తర్వాతి ఓవర్ మొదటి బంతికి భారీ షాట్‌కి ప్రయత్నించిన విరాట్ కోహ్లీ 3 బంతుల్లో 1 పరుగు చేసి డేవిడ్ మలాన్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు...

ఇంగ్లాండ్‌పై గత ఐదు టీ20ల్లో మూడు సార్లు 70+ స్కోర్లు చేసి నాటౌట్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, రెండోసారి సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి బంతికే రిషబ్ పంత్ కూడా అవుట్ అయ్యాడు...

15 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసిన రిషబ్ పంత్, జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఒకానొక దశలో 49/0 స్కోరుతో ఉన్న భారత జట్టు, 61/3 స్కోరుకి చేరుకుంది. 34 ఏళ్ల రిచర్డ్ గ్లీసన్, నాలుగు బంతుల వ్యవధిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్‌లను అవుట్ చేసి... టీ20 కెరీర్‌కి అదిరిపోయే ఆరంభం అందుకున్నాడు... 

11 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో అవుట్ కాగా 15 బంతుల్లో ఓ ఫోర్‌తో 12 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా ఆ తర్వాతి బంతికే పెవిలియన్ చేరాడు. 89 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది భారత జట్టు...

దినేశ్ కార్తీక్ 17 బంతుల్లో ఓ ఫోర్‌తో 12 పరుగులు చేసి రనౌట్ కాగా 6 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 13 పరుగులు చేసిన హర్షల్ పటేల్ కూడా క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు.. 

భువనేశ్వర్ కుమార్ 4 బంతుల్లో 2 పరుగులు చేసి జోర్డాన్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు...రవీంద్ర జడేజా 29 బంతుల్లో 5 ఫోర్లతో 46 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మొట్టమొదటి టీ20 ఆడుతున్న రిచర్డ్ గ్లీసన్ 4 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా క్రిస్ జోర్డాన్‌కి నాలుగు వికెట్లు దక్కాయి. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !