బంగ్లాతో రెండో వన్డే: సెంచరీతో చెలరేగిన మెహిదీ హసన్... భారీ స్కోరు చేసిన బంగ్లా...

By Chinthakindhi RamuFirst Published Dec 7, 2022, 3:37 PM IST
Highlights

టీమిండియా ముందు 272 పరుగుల భారీ టార్గెట్ పెట్టిన బంగ్లాదేశ్... ఏడో వికెట్‌కి రికార్డు భాగస్వామ్యం.. ఆఖరి బంతికి సెంచరీ అందుకున్న మెహిదీ హసన్ మిరాజ్.. 

మొదటి వన్డేలో టీమిండియాకి విజయాన్ని దూరం చేసిన మెహిదీ హసన్ మిరాజ్... రెండో వన్డేలోనూ టీమిండియాకి కొరకరాని కొయ్యలా మారాడు. ఏడో వికెట్‌కి మహ్మదుల్లాతో కలిసి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పడమే కాకుండా సెంచరీతో చెలరేగి బంగ్లాదేశ్‌కి భారీ స్కోరు అందించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది...

రెండో ఓవర్‌లో నాలుగో బంతికి అనమోల్ హక్ ఇచ్చిన క్యాచ్‌ని కెప్టెన్ రోహిత్ శర్మ జారవిడిచాడు. క్యాచ్‌ని అందుకునే ప్రయత్నంలో రోహిత్ శర్మ చేతి బొటనవేలికి తీవ్ర గాయమైంది.దీంతో అతను ఫీల్డ్ వీడి, స్కానింగ్‌ కోసం ఆసుపత్రికి వెళ్లాడు...

23 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన లిటన్ దాస్‌ని మహ్మద్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ వికెట్‌తో 2022 ఏడాదిలో వన్డేల్లో టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు మహ్మద్ సిరాజ్. 35 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేసిన నజ్ముల్ హుస్సేన్ షాంటోని ఉమ్రాన్ మాలిక్ క్లీన్ బౌల్డ్ చేశాడు...

20 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన షకీబ్ అల్ హసన్, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో అవుట్ కాగా 24 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసిన ముస్తాఫిజుర్ రహీం కూడా అతని బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. షకీబ్, ముస్తాఫిజుర్ ఇద్దరూ కూడా శిఖర్ ధావన్‌కే క్యాచ్ ఇచ్చి అవుట్ కావడం మరో విశేషం...

ముస్తాఫిజుర్ అవుటైన తర్వాతి బంతికి అఫిఫ్ హుస్సేన్‌ని గోల్డెన్ డకౌట్ చేశాడు వాషింగ్టన్ సుందర్. దీంతో 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది బంగ్లాదేశ్. ఈ దశలో సీనియర్ బ్యాటర్ మహ్మదుల్లా, మెహిదీ హసన్ మిరాజ్ కలిసి ఏడో వికెట్‌కి 148 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. బంగ్లాదేశ్ తరుపున వన్డేల్లో ఇది రెండో అత్యున్నత ఏడో వికెట్ భాగస్వామ్యం. ఇంతకుముందు ఆఫ్ఘాన్‌పై మెహిదీ, అఫిఫ్ హుస్సేన్ కలిసి 174 పరుగులు జోడించారు. టీమిండియాపై మాత్రం బంగ్లాకి ఇదే బెస్ట్ 7వ వికెట్ పార్ట్‌నర్‌షిప్...

96 బంతుల్లో 7 ఫోర్లతో 77 పరుగులు చేసిన మహ్మదుల్లా, ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. క్రీజులోకి వస్తూనే ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదిన నసుమ్ అహ్మద్..11 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేయగా... మెహిదీ హసన్ 83 బంతుల్లో 8 ఫోర్లు,4 సిక్సర్లతో ఆఖరి బంతికి సెంచరీ పూర్తి చేసుకున్నాడు...

click me!