
అహ్మదాబాద్ టెస్టులో సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ, ఆఖరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. 364 బంతులు ఆడిన విరాట్ కోహ్లీ, 15 ఫోర్లతో 186 పరుగులు చేసి... టాడ్ ముర్పీ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు.. శ్రేయాస్ అయ్యర్ వెన్నునొప్పితో బాధపడుతూ బ్యాటింగ్‌కి రాకపోవడంతో రిటైర్డ్ హార్ట్‌గా అవుట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 178.5 ఓవర్లు బ్యాటింగ్ చేసిన టీమిండియా 571/9 స్కోరు చేసి ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టుకి 91 పరుగుల ఆధిక్యం దక్కింది...
శుబ్‌మన్ గిల్ 235 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 128 పరుగులు చేయగా రోహిత్ శర్మ 35, ఛతేశ్వర్ పూజారా 42, రవీంద్ర జడేజా 28 పరుగులు చేసి అవుట్ అయ్యారు..
శ్రీకర్ భరత్ 88 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేసి పెవిలియన్ చేరగా, 113 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగులు చేసిన అక్షర్ పటేల్, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మొదటి వికెట్ నుంచి ఆరో వికెట్ వరకూ ప్రతీ వికెట్‌కి 50+ భాగస్వామ్యాలు నమోదు చేసింది టీమిండియా..
శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మతో తొలి వికెట్‌కి 74 పరుగులు, ఛతేశ్వర్ పూజారాతో కలిసి రెండో వికెట్‌కి 113 పరుగులు, విరాట్ కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కి 58 పరుగుల భాగస్వామ్యం జోడించి అవుట్ అయ్యాడు...
ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాతో కలిసి నాలుగో వికెట్‌కి 64 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. ఆ తర్వాత శ్రీకర్ భరత్‌తో కలిసి ఐదో వికెట్‌కి 83 పరుగుల భాగస్వామ్యం, అక్షర్ పటేల్‌తో కలిసి ఆరో వికెట్‌కి 162 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
అక్షర్ పటేల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసి నాథన్ లియాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి, బౌండరీ లైన్ దగ్గర కుహ్నేమన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఉమేశ్ యాదవ్ క్రీజులోకి వచ్చిన తర్వాత రెండు పరుగులు తీసేందుకు ప్రయత్నించాడు విరాట్ కోహ్లీ. రెండో పరుగు పూర్తి చేసే క్రమంలో డైరెక్ట్ హిట్‌తో ఉమేశ్ యాదవ్‌ని డైమండ్ డకౌట్ చేశాడు పీటర్ హ్యాండ్స్‌కోంబ్...
మహ్మద్ షమీ 2 బంతులు ఎదుర్కొన్నా పరుగులేమీ చేయలేకపోయాడు. అశ్విన్ అవుట్ అయ్యే సమయానికి 184 పరుగుల వద్ద ఉన్న విరాట్ కోహ్లీ... డబుల్ సెంచరీ చేసుకునేందుకు స్ట్రైయిక్ రొటేట్ చేయకుండా బౌండరీలు బాదేందుకు ప్రయత్నించాడు. విరాట్‌కి బౌండరీ ఇవ్వకుండా ఫీల్డర్లకు బౌండరీ లైన్ దగ్గర మోహరించాడు స్టీవ్ స్మిత్. ఎంతకీ పరుగులు రాకపోవడంతో విసిగిపోయిన కోహ్లీ, భారీ షాట్‌కి ప్రయత్నించి ఆఖరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు..
ఆస్ట్రేలియాపై మొట్టమొదటి టెస్టు డబుల్ సెంచరీ చేయాలనే విరాట్ కోహ్లీ కోరిక నెరవేరలేదు. ఆసీస్‌పై విరాట్‌కి ఇదే అత్యధిక స్కోరు. ఇంతకుముందు 169 పరుగులు చేసిన విరాట్, ఆ రికార్డును అధిగమించాడు.