IND vs AUS T20 Series: తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టుపై భారత జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై సూర్య కుమార్ యాదవ్, రింకూ సింగ్ దూకుడుగా ఆడి టీమిండియాకు విజయం అందించారు.
IND vs AUS T20 Series: విశాఖపట్టణం సాగర తీరంలో జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియాను రెండు వికెట్ల తేడాతో ఓడించింది. ప్రపంచ కప్ ఓటమి తర్వాత భారత్ మరోసారి ఆస్ట్రేలియా జట్టుతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ తలపడుతోంది. ఇందులో భాగంగా గురువారం విశాఖపట్టణంలో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్ లో భారత ఆటగాళ్లు రెచ్చిపోయారు. ప్రపంచ కప్ 2023 ఫైనల్ లో ఓడిపోయిన కసితో ఉన్నా టీమిండియా యువ ఆటగాళ్లు జూలు విదిల్చారు. ఫలితంగా విశాఖ వన్డేలో భారత్ విజయకేతనం ఎగురవేసింది. ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తర్వాత ఈ విజయం అభిమానులకు కొంత ఊరటనిస్తుంది. దీంతో సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.
భారీ టార్గెట్
విశాఖపట్నంలోని డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 208 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో జోష్ ఇంగ్లీష్ చెలరేగాడు. అద్భుత సెంచరీ సాధించాడు. కేవలం 50 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో ఇంగ్లీష్ 110 పరుగులు చేశాడు. అలాగే..స్టీవ్ స్మిత్‌తో కలిసి రెండో వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పాడు. స్మిత్ 52 పరుగులు చేయగా.. టిమ్ డేవిడ్ 19 పరుగులు చేసి నాటౌట్‌గా అజేయంగా నిలిచారు. ఈ ఇన్నింగ్స్ లో భారత్ తరఫున ప్రముఖ్ కృష్ణ, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు.
ఉత్కంఠ పోరు
అనంతరం లక్ష్య చేధనకు దిగిన భారత్ తొలుత శుభారంభం చేయలేకపోయింది. 22 పరుగులకే టిమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్ ఐదో బంతికి రుతురాజ్ గైక్వాడ్ రనౌట్ అయ్యాడు. అతడు ఒక్క బంతిని కూడా ఎదుర్కోలేక పెవిలియన్ బాట పట్టాడు. అతని తరువాత దూకుడుగా ఆడినా యశస్వి జైస్వాల్ కూడా అవుటయ్యాడు. మూడో ఓవర్ మూడో బంతికి యశస్వి పెవిలియన్‌కు చేరుకున్నాడు. మాథ్యూ షార్ట్ వేసిన బంతికి స్టీవ్ స్మిత్ క్యాచ్ పట్టాడు. దీంతో భారత్ మూడు ఓవర్లలో రెండు వికెట్లకు 25 పరుగులు చేసింది.
చెలారేగిన సూర్య
ఈ తరుణంలో ఇషాన్ కిషన్ తో కలిసి సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలారేగారు. ఆసిస్ బౌలర్లందరికీ చుక్కులు చూపించారు. కేవలం 42 బంతుల్లో 80 పరుగులు చేశాడు. తన దూకుడు ఇన్నింగ్స్ లో తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదాడు. సూర్యకుమార్ యాదవ్ నే మ్యాచ్ ఫినిష్ చేస్తాడనుకున్నారు. కానీ , సూర్య ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 18వ ఓవర్ నాలుగో బంతికి సూర్య ఔటయ్యాడు. జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ బౌలింగ్ లో భారీ షాక్ ఆడబోయి.. ఆరోన్ హార్డీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పడ్డాడు. మొత్తానికి సూర్య కుమార్ టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. అనంతరం.. రింకూ సింగ్ తనదైన శైలిలో దూకుడుగా ఆడారు.
చివరి ఓవర్ థ్రిల్
భారత్ 19 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. టీం ఇండియా గెలవాలంటే ఆరు బంతుల్లో ఏడు పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో రింకూ సింగ్, అక్షర్ పటేల్ ఉన్నారు. సీన్ అబాట్ వేసిన తొలి బంతికి రింకూ ఫోర్ కొట్టింది. దీంతో టీమిండియా ఐదు బంతుల్లో మూడు పరుగులు చేయాల్సి వచ్చింది. తర్వాతి బంతికి రింకూ పరుగు తీసింది. ఆ తర్వాత మూడో బంతికి అక్షర్ పటేల్ ఎదుర్కొన్నారు.
కానీ అవుట్ అయ్యి వెనుదిరాగాల్సి వచ్చింది. ఆ తర్వాత రవి బిష్ణోయ్ బ్యాటింగ్‌కు వచ్చారు. నాలుగో బంతిని ఎదుర్కొన్న అతడు పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. దీంతో భారత్ రెండు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సి వచ్చింది. ఐదో బంతికి రింకూ సింగ్ లెగ్ సైడ్ షాట్ ఆడి పరుగు కోసం పరుగెత్తాడు. ఒక పరుగు పూర్తి కాగా.. రెండో పరుగు కోసం ప్రయత్నించిన అర్ష్‌దీప్ సింగ్ రనౌట్ అయ్యాడు.
బంతికి ఒక్క పరుగు
చివరి బంతికి టీమిండియా ఒక్క పరుగు చేయాల్సి వచ్చింది. రింకూ స్ట్రైక్ లో ఉన్నారు. ఒకవేళ అతను ఔటయినా లేదా పరుగులు చేయలేక పోయినా మ్యాచ్ సూపర్ ఓవర్‌లోకి వెళ్లేది. మ్యాచ్ చూస్తున్న అందరిలోనూ నరాలు తెగేంతా ఉత్కంఠ. కానీ అది జరగలేదు. సీన్ అబాట్ వేసిన చివరి బంతిని రింకూ సిక్సర్ గా మలిచాడు. దీంతో టీమిండియా విజయం సాధించింది. మరో ఆసక్తికర విషయమేంటంటే..? సీన్ అబాట్ వేసి చివరి బంతిని నో బాల్ గా ప్రకటించారు. దీంతో మరో బంతి మిగిలి ఉండగానే టీమిండియా విజయపతాకాన్ని ఎగరవేసింది.