
ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఏదైనా ఒక జట్టు ఒక ఫార్మాట్ లో అదరగొడుతుంది. టీ20లలో నెంబర్ వన్ గా ఉన్న జట్టు వన్డే ర్యాంకులలో ఒకటో రెండో స్థానాలు తక్కువగా ఉంటుంది. వన్డేలలో సూపర్ గా రాణించే టీమ్ టెస్టులలో విఫలమవుతుంది. కానీ అన్ని ఫార్మాట్లలో రాణించే టీమ్ లు అరుదుగా ఉంటాయి. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు మాత్రం అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్ గా నిలిచి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తాజాగా విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో భారత జట్టు నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకులలో భారత జట్టు నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. తాజా టెస్టు ర్యాంకింగ్స్ లో భారత్.. 115 పాయింట్లతో అగ్రస్థానం సాధించింది. ఆస్ట్రేలియా.. 111 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించిన తర్వాత టీమిండియాకు పాయింట్లు పెరగగా ఆస్ట్రేలియాకు పాయింట్లు తగ్గాయి. ఈ జాబితాలో ఇంగ్లాండ్ (106), న్యూజిలాండ్ (100), సౌతాఫ్రికా (85), వెస్టిండీస్ (79) పాయింట్లతో తర్వాత స్థానాల్లో నిలిచాయి. 77 పాయింట్లతో పాకిస్తాన్.. ఏడో స్థానంలో నిలిచింది.
టెస్టులతో పాటు వన్డేలలో కూడా టీమిండియా నెంబర్ వన్ టీమ్ గా ఉన్న విషయం తెలిసిందే. 50 ఓవర్ల ఫార్మాట్ లో భారత్.. 114 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. 112 పాయింట్లతో ఆసీస్ రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ లు 111 పాయింట్లతో 3, 4వ స్థానాల్లో ఉన్నాయి. 106 పాయింట్లతో పాకిస్తాన్ ఐదో స్థానంలో నిలిచింది.
ఇక టీ20లలో భారత జట్టు.. 267 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. ఇంగ్లాండ్ (266), పాకిస్తాన్ (258), సౌతాఫ్రికా (256), న్యూజిలాండ్ (252), ఆస్ట్రేలియా (251) లు తదుపరి స్థానాల్లో ఉన్నాయి.
వన్డేలు, టీ20లతో పాటు టెస్టులలో కూడా భారత జట్టు నెంబర్ వన్ ర్యాంకు సాధించడంతో భారత జట్టు అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఏకకాలంలో మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ గా నిలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్ గా రోహిత్ నిలిచాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత రోహిత్.. టీ20లకు దూరంగా ఉన్నా అధికారికంగా ఇంకా హార్ధిక్ పాండ్యాను బీసీసీఐ ఇంకా అనౌన్స్ చేయలేదు.