
ద్వైపాక్షిక సిరీస్ లలో విజయాలు అపజయాలు ఎలా ఉన్నా ఐసీసీ (ICC) టోర్నీలలో మాత్రం పాకిస్థాన్ (Pakistan) పై భారత్ (India) దే పైచేయి. నిన్నటి మ్యాచ్ తో కలిసి ఈ రెండు జట్లు.. ఐసీసీ వన్డే, టీ20 ప్రపంచకప్ (T20 world cup) లలో 13 సార్లు తలపడ్డాయి. కానీ 12 సార్లు భారత్ నే విజయం వరించింది. ఇక ఆదివారం నాటి పోరులో ఆ పరాజయాలకు కౌంటరా..? అన్న విధంగా పాకిస్థాన్ ఆడింది.
ఉత్కంఠ పోరు ఖాయమనుకున్న చోట మ్యాచ్ ను పాక్ ఏకపక్షం చేసేసింది. ముందు సూపర్ బౌలింగ్ తో భారత్ ను కట్టడి చేసి ఆ తర్వాత ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా విజయాన్ని ముద్దాడింది. భారత అభిమానులకు అంత ఈజీగా మరిచిపోలేని వేదనను మిగిల్చింది.
ఇక ఈ మ్యాచ్ లో బౌలింగ్ తో ఆకట్టుకున్న్ పాకిస్థాన్.. బ్యాటింగ్ లోనూ చెలరేగి భారత్ పై 10 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. భారత్ పై విజయంతో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (Babar Azam).. ఆ దేశంలో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. యోధానుయోధులు సారథులుగా వ్యవహరించిన పాక్ జట్టు (Pakistan cricket Team) సాధించలేని అద్భుతాన్ని ఆ జట్టుకు అందించి.. జాతి దశాబ్దాల కలను నెరవేర్చాడు.
భారత్ పై పాక్ విజయం ఖరారైపోగానే భారత్ అభిమానుల్లో నిర్వేదం అలుముకుని టీవీలు కట్టేస్తుంటే.. మన పొరుగుదేశంలో మాత్రం సంబురాలు మిన్నంటాయి. టపాసులు, బాణసంచాతో పాకిస్థాన్ వీధులు దద్దరిల్లాయి.
అయితే పాకిస్థాన్ కు ఇంత ఆనందాన్ని అందించిన ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ తండ్రి ఆజమ్ సిద్ధిఖీ ఆనందానికి అవధుల్లేవు. మ్యాచ్ గెలిచిన అనంతరం ఆయన తీవ్ర బావోద్వేగానికి లోనయ్యారు. కన్నీటి పర్యంతమయ్యారు. తన కొడుకు విజయాన్ని చూసి గర్వంతో ఉప్పొంగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 Worldcup2021) లో భాగంగా ఆదివారం భారత్-పాక్ (India Vs Pakistan) మధ్య జరిగిన మ్యాచ్ లో ఇండియా నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ వికెట్లేమీ కోల్పోకుండా ఛేదించిన విషయం తెలిసిందే. ఓపెనర్లుగా వచ్చిన కెప్టెన్ బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ లు పని పూర్తి చేశారు. మరో 13 బంతులు మిగిలుండగానే పాక్ కు చిరస్మరణీయ విజయాన్ని కానుకగా ఇచ్చారు. ఈ మ్యచ్ లో బాబర్.. (52 బంతుల్లో 68 నాటౌట్) తన క్లాస్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు.